కాఠిన్యమే కాదు కారుణ్యం కూడా....(వీడియో)
ఇలాంటి ఘటనలు విన్నపుడు, చూసినపుడే కాకీల్లో కాఠిన్యమే కాదు కారుణ్యం కూడా ఉంటుందనే విషయం బయటపడుతుంది.
కాకీలు అలియాస్ పోలీసులంటేనే కాఠిన్యానికి మారుపేరుగా జనాల్లో ఓ అభిప్రాయాం బలంగా నాటుకుపోయింది. ఫై స్ధాయిలోని ఉన్నతాధికారులు ‘ఫ్రెండ్లీ పోలీసు’ అని పదేపదే చెబుతున్నా కిందిస్ధాయి అధికారుల్లో అదెక్కడా ఆచరణలో కనబడదు. పోలీసులంటేనే బండబారిన మనసులని, కాఠిన్యంతో లాఠీలతో దొరికిన వాడిని దొరికినట్లుగా చావబాదేవారే అన్న అభిప్రయం సంవత్సరాలుగా నాటుకుపోయింది. తమపైన బలంగా పడిన ముద్రను తుడిచేయటానికి పోలీసులు కూడా ప్రయత్నాలు ఏమీ చేయటంలేదు. తాము కాఠినంగా ఉంటామన్నది ఒట్టి అపోహమాత్రమే అని తెలియజేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు కూడా ఏమీలేదు. పైగా తాము కఠినాత్ములమని చాటిచెప్పిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇలాంటి నేపధ్యంలో మంగళవారం జరిగిన ఒక ఘటన చాలామందిని ఆకర్షించింది.
ఇంతకీ విషయం ఏమిటంటే వికారాబాద్ జిల్లా తాండూరులో గ్రూప్ 3 పరీక్ష(Group 3 exams) రాయటానికి కృష్ణవేణి అనే యువతి ఎగ్జామ్ సెంటర్(Exam centre) కు వచ్చింది. ఎగ్జామ్ సెంటర్ కు అయితే చేరుకున్నది కాని ఆమెకు ప్రశాంతంగా పరీక్ష ఎలాగ రాయాలో తెలీలేదు. ఎందుకంటే చేతిలో 5 నెలల పసిపాప కూడా ఉంది. పరీక్ష సెంటర్లోకి పాపను తీసుకుని వెళ్ళే అవకాశంలేందు. అలాగని పసిపాపను బయట ఎవరికీ అప్పగించి తాను పరీక్ష రాయటానికి సెంటర్లోకి వెళ్ళలేందు. ఎందుకంటే 5 నెలల పసిపాపలు మామూలుగా అయితే తల్లులదగ్గర తప్ప ఇంకెవరి దగ్గరా ఉండరు. ఇపుడు తాండూరులో పరీక్షా కేంద్రం దగ్గర కూడా కృష్ణవేణి పరిస్ధితి అలాగే ఉంది. ఒకవైపు పరీక్ష కేంద్రంలోకి వెళ్ళాల్సిన సమయం దగ్గరపడుతోంది. మరోవైపు పసిపాప సమస్యకు పరిష్కారం దొరకలేదు. కృష్ణవేణితో పాటు తోడుగా ఇంకెవరూ రాలేదు మరి. దాంతో ఏమిచేయాలో ఆ తల్లికి దిక్కుతోచటంలేదు.
సరిగ్గా ఈ సమయంలోనే అక్కడే డ్యూటీలో ఉన్న పోలీసుల్లో నరసమ్మ అనే కానిస్టేబుల్ కూడా ఉంది. కృష్ణవేణి పడుతున్న టెన్షన్ను కానిస్టేబుల్ నరసమ్మ గమనిస్తునే ఉంది. టైం చూస్తే పరీక్ష కేంద్రంలోకి వెళ్ళటానికి ఇంక కొద్దినిముషాలు మాత్రమే మిగిలుంది. దాంతో వెంటనే కృష్ణవేణి దగ్గరకు వెళ్ళిన నరసమ్మ పాపను తనచేతిలోకి తీసుకున్నది. ధైర్యంగా పరీక్ష రాయమని చెప్పింది. పాపకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాను చూసుకుంటానని భరోసా ఇచ్చింది. నరసమ్మతో పాటు అక్కడే డ్యూటీలో ఉన్న మిగిలిన పోలీసులు కూడ పాప తల్లికి ధైర్యం చెప్పారు. ఏదైనా అత్యవసరమైతే తము పరీక్ష హాలులోకి కబురుచేస్తామని హామీ ఇచ్చారు. దాంతో ధైర్యంచేసిన కృష్ణవేణి పసిపాపను కానిస్టేబుల్ నరసమ్మ చేతుల్లో పెట్టి పరీక్ష రాయటానికి వెళ్ళింది.
కాఠిన్యమే కాదు కారుణ్యం కూడా ఉందని నిరూపించిన పోలీసులు pic.twitter.com/LfahsPYEIa
— K Phani Kumar (@KPhaniKuma69706) November 19, 2024
ఈ వార్త రాసే సమయానికి కూడా కృష్ణవేణి ఇంకా పరీక్ష రాస్తునే ఉన్నది. సెంటర్ బయట నరసమ్మ పసిపాపను తన ఒళ్ళో పెట్టుకుని ఆడిస్తోంది. విచిత్రం ఏమిటంటే పసిపాప కూడా ఏదవకుండా బుద్ధిగా నరసమ్మ చేతిలో ఆడుకుంటోంది. పరీక్షల సమయంలో కృష్ణవేణి-నరసమ్మ ఉదంతం అనే కాదు ఈమధ్యనే ఒక అభ్యర్ధి తాను రాయాల్సిన పరీక్ష కేంద్రానికి కాకుండా అయోమయంలో ఇంకెక్కడో ఉండిపోయాడు. అది గమనించి హాలుటికెట్ ను చూసిన ఒక కానిస్టేబుల్ వెంటనే అభ్యర్ధిని తన మోటారుసైకిల్ పైన కూర్చోబెట్టుకుని ఆగమేఘాలపైన పరీక్ష రాయాల్సిన సెంటర్ దగ్గర దిగబెట్టాడు. ఇలాంటి ఘటనలు విన్నపుడు, చూసినపుడే కాకీల్లో కాఠిన్యమే కాదు కారుణ్యం కూడా ఉంటుందనే విషయం బయటపడుతుంది.