
నామినేటెడ్ పదవులు.. ఆశలు..
కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న వారు నీరస పడుతున్నారు. ఎప్పుడు పదవులు ఇస్తారో తెలియని పరిస్థితి ఉంది.
నామినేటెడ్ పదవుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఊరిస్తున్నారు. ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి రేపు మాపు అంటూ వస్తున్నారు. కొన్ని ముఖ్యమైన పదవులు కట్టబెట్టినా చాలా పదవులు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా బీసీ కార్పొరేషన్లు 56 ఉండగా అందులో పది కార్పొరేషన్ లకు కూడా పూర్తి స్థాయిలో చైర్మన్లు, డైరెక్టర్లను నియమించలేదు. మిగిలిన కమిషన్ లు, కార్పొరేషన్ లు, సలహా దారుల పోస్టులు చాలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలోని ఆశా వహులు ఇప్పటికే చాలా వరకు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ దరఖాస్తులన్నీ పరిశీలలో ఉన్నాయి. పార్టీలో ఎప్పటి నుంచి ఎలా పనిచేస్తున్నారనే విషయాన్ని వారి దరఖాస్తుల్లో స్పష్టంగా వివరించారు.
ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించడం లేదు?
నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో స్థానిక ఎమ్మెల్యేల పాత్ర కీలకంగా ఉంది. ఎమ్మెల్యే సూచించిన వారికి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఇప్పటి వరకు ఇచ్చిన పదవులు కూడా అలాగే ఇచ్చారు. స్థానికంగా ఎమ్మెల్యే అనుమతి లేకుండా పదవులు తీసుకున్న వారు ఎమ్మెల్యేను లెక్క చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయని సీఎం భావించారు. అందుకే ఎమ్మెల్యేకు అంతటి ప్రాధాన్యత ఇచ్చారు.
అయినా ఎమ్మెల్యే ల్లో పెద్దగా స్పందన కనిపించడం లేదని శుక్రవారం పార్టీ నాయకులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్యేలను ప్రత్యేకించి హెచ్చరించారు. పార్టీ వారిని కాదని వైఎస్సార్ సీపీ వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆ సమాచారం తన వద్ద ఉందని వారిని హెచ్చరించడం విశేషం. తాను సంక్షేమ పథకాలకు అర్హులైన వైఎస్సార్ సీపీ అభిమానులను పక్కన బెట్టినట్లు వైఎస్సార్ సీపీ వారు ప్రచారం చేస్తున్నారని, దీనిని తిప్పి కొట్టడంలో ఎమ్మెల్యేలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారని నిలదీశారు.
ఎమ్మెల్యేలపై నిత్యం నిఘా
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లపై నిత్యం తెలుగుదేశం పార్టీ పెద్దలు నిఘా పెట్టారు. ప్రతి వారం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై ఫోన్ సర్వేలు నిర్వహిస్తున్నారు. ఆ సర్వేల్లో వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుంటున్నారు. అభిమానించే వారు ఎంత మంది ఉన్నారు. ఎమ్మెల్యేలను వ్యతిరేకించే వారు ఏ నియోజకవర్గంలో ఎంత మంది ఉన్నారనే విషయమై ఒక ఆంతరంగిక సర్వే అయితే చేస్తున్నారు. ఇప్పటికే జీడీ నెల్లూరులో జరిగిన పార్టీ సమావేశంలో జీడీ నెల్లూరు ఎమ్మెల్యేతో పాటు మరికొందరు జిల్లాలోని ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పనులూ చేసేది లేదని తేల్చి చెప్పారు. టెలీ కాన్ఫరెన్స్ లో కూడా సరిగా పనిచేయడం లేదని భావించిన ఎమ్మెల్యేలను మందలించారు. పార్టీ సభ్యత్వం చేర్పించే విషయంలో చొరవ తీసుకోకుండా, నియోజకవర్గంలోని నాయకులందరినీ కలుపుకుని పోకుండా వ్యవహరించే ఎమ్మెల్యేలపై తన కోపాన్ని వ్యక్తం చేశారు.
నామినేటెడ్ పదవులకు 60వేల దరఖాస్తులు
నామినేటెడ్ పదవులు కావాలని కోరుకున్న వారు 60 వేల మంది ఉన్నారని, వారి దరఖాస్తులు పార్టీ వద్ద ఉన్నాయని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. జనసేన పార్టీ నుంచి, బీజేపీ నుంచి కూడా నామినేటెడ్ పదవుల కోసం దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ దరఖాస్తులు ఆయా పార్టీల నేతలకు వచ్చిన తరువాత వాటిని ఫిల్టర్ చేసి అందులో ముఖ్యమైన వారి పేర్లు నమోదు చేసుకుని వారికి పదవులు దక్కేలా పవన్ కల్యాణ్, పురందేశ్వరి ప్రయత్నిస్తారు. ఆ పార్టీల నుంచి ఎవరి పేర్లు వస్తాయనే ప్రస్తావన ఇంకా తెరపైకి రాలేదు.
తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్యమైన సీనియర్ నాయకుల పరిస్థితి ఏమిటనే దానిపైనే చర్చ జరుగుతోంది. చిన్న చిన్న పదవులు సీనియర్ లు తీసుకునే అవకాశం లేదు. సీనియర్లలో వారి స్థాయికి తగిన పదవులు బాబు ఇవ్వాల్సి ఉంటుంది. మాజీ మంత్రుల విషయంలో ఆచీ తూచీ అడుగులు వేస్తున్నారు.