
’విద్వేషం వద్దు..వికాసం ముద్దు‘
చర్చలతోనే సంక్లిష్టమైన జల వివాదాలను పరిష్కరించుకోగలమని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య, తెలుగు ప్రజల మధ్య విధ్వేషాలు వద్దని, వికాసమే ముద్దు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అక్షరం మన ఆయుధం.. ఐక్యత మన బలం. తెలుగు భాషకు రెండు రాష్ట్రాలు ఉండవచ్చు కానీ, తెలుగు జాతికి ఉన్నది ఒకటే గుండెకాయ అని ఉద్ఘాటించారు. గుంటూరు వేదికగా జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల సాక్షిగా ఆయన తెలుగు జాతికి దిశానిర్దేశం చేశారు. మాతృభాష ప్రాభవాన్ని చాటుతూనే, దశాబ్దాలుగా రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న నీటి వివాదాలపై ఆయన తన గళాన్ని విప్పారు. గోదావరి జలాలను తెలంగాణ వాడుకున్నా అడ్డుచెప్పలేదు.. కాళేశ్వరం కట్టినా అభ్యంతరం పెట్టలేదు.. సముద్రంలో కలిసే వేల టీఎంసీల నీటిని ఒడిసిపట్టడమే మన లక్ష్యం కావాలి అని చెబుతూ, వివాదాల కంటే పరిష్కారాలకే పెద్దపీట వేయాలని పిలుపునిచ్చారు.
గుంటూరులో అట్టహాసంగా జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సోమవారం (జనవరి 5, 2026) ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రాంగణమంతా 'తెలుగు' నినాదాలతో మారుమోగుతుండగా, అటు భాషా వైభవాన్ని, ఇటు తెలుగు రాష్ట్రాల మధ్య నలుగుతున్న నీటి ప్రాజెక్టుల సమస్యలను మేళవిస్తూ ఆయన చేసిన ప్రసంగం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న నీటి సమస్యలపై చంద్రబాబు గట్టిగా మాట్లాడారు. నీటి చుక్క కోసం రెండు రాష్ట్రాల తెలుగు సోదరులు ఘర్షణ పడాల్సిన అవసరం లేదు. గోదావరి జలాలను ఒడిసిపట్టి, కృష్ణా డెల్టాను కాపాడుకోవడంలోనే మన ఉమ్మడి విజయం ఉంది. పోలవరం సహా ఇతర కీలక ప్రాజెక్టుల పూర్తికి అడ్డంకులు తొలగించుకుని, తెలుగు గడ్డను సస్యశ్యామలం చేయడమే మా ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. కేవలం చర్చలతోనే సంక్లిష్టమైన జల వివాదాలను పరిష్కరించుకోగలమని ఆయన పునరుద్ఘాటించారు.
అభివృద్ధి లేని భాష, భాష లేని అభివృద్ధి రెండూ అసంపూర్ణమే అని సీఎం వ్యాఖ్యానించారు. ఐటీ రంగంలో తెలుగు వారు ప్రపంచాన్ని ఏలుతున్నారని, అదే స్ఫూర్తితో సాగునీటి రంగంలోనూ నూతన సాంకేతికతను జోడించి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉంటూనే, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని తేల్చి చెప్పారు.
ఆధునిక టెక్నాలజీ: ప్రపంచంలో 10 కోట్ల మంది మాట్లాడే తెలుగు భాషకు ప్రాచీన హోదా ఉండడం గర్వకారణమని, ఐటీ/టెక్నాలజీ వల్ల భాష కనుమరుగవుతుందన్న భయం వద్దని సీఎం భరోసా ఇచ్చారు. టెక్నాలజీ తోనే తెలుగును మరింత సులభంగా కాపాడుకోవచ్చని సూచించారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి ఏటా 6,000 టీఎంసీలకు పైగా నీరు సముద్రం పాలు కావడాన్ని ప్రస్తావిస్తూ.. రెండు రాష్ట్రాలు విద్వేషాలు వీడి నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం గోదావరి నీటిని వాడుకున్నా, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు కట్టినా తాము అడ్డుచెప్పలేదని, తెలుగు వారంతా కలిసి ఉండాలన్నదే తన ఆకాంక్ష అని స్పష్టం చేశారు. నదుల అనుసంధానమే అంతిమ పరిష్కారమని పేర్కొన్నారు.
Next Story

