ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్ వ్యవస్థ లేదని కూటమి ప్రభుత్వం మరో సారి స్పష్టం చేసింది. వలంటీర్ వ్యవస్థ మీద తొలుత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన తెలుగుదేశం, జనసేన పార్టీలు ఎన్నికల సమయంలో మాట మార్చాయి. వలంటీర్లపై తమకు ఎలాంటి ద్వేషం లేదని, అన్యాయంగా వారి పొట్టగొట్టడం తమకు ఇష్టం లేదన్నాయి. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వలంటీర్లకు ఇప్పుడు ఇస్తున్న దాని కంటే రెట్టింపు గౌరవ వేతనం చెల్లిస్తామని, నెలకు రూ. 10వేలు చొప్పున వలంటీర్లకు ఇస్తామని హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. వలంటీర్ల నియామకాలు నిబంధనల ప్రకారం జరగలేదని చెప్పారు. అందువల్ల వలంటీర్లను కొనసాగించలేమని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా మరో సారి స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్ వ్యవస్థ లేదని, వలంటీర్లు పని చేయడం లేదని, ఇక దానిని ఎలా కొనసాఇస్తామని తేల్చి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వలంటీర్ల వ్యవస్థ మీద బుధవారం శాసన మండలి సమావేశాల్లో చర్చ జరిగింది. బుధవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో దీని ప్రస్తావన వచ్చింది. గ్రామ, వార్డు వలంటీర్లకు గౌరవ వేతనం పెంచుతున్నారా? రాష్ట్రంలో ఎంత మంది వలంటీర్లు పని చేస్తున్నారు? వారి గౌరవ వేతనం కోసం విడుదలైన నిధుల పరిణామం ఎంత? వారి గౌరవ వేతనం పెంచేందుకు ఎదైనా ప్రతిపాదనలు ఉన్నాయా? వివరాలు చెప్పాలని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, రాజగొల్ల రమేష్ యాదవ్, డా మొండితోక అరుణ్‌కుమార్‌లు ప్రశ్నించారు. దీనికి మంత్రి డోల బాల వీరాంజనేయులు సమాధానం చెబుతూ ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్ల వ్యవస్థ ఉంటే కదా కొనసాగించేది కానీ, గౌరవ వేతనం పెంచడం కానీ చేసేది అని, ఆంధ్రప్రదేశ్‌లో లేని వలంటర్ల వ్యవస్థను ఎలా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో వలంటీర్లు పని చేయడం లేదు. అసలు వలంటీర్ వ్యవస్థే లేదు. లేని వ్యవస్థను అసలు ఎలా కొనసాగిస్తాం. ఒక వేళ కొనసాగిస్తేనే జీతాలు పెంచుతామని అన్నాం. అసలు కొనసాగించలేదు. కాబట్టి జీతాలు పెంచమని మంత్రి స్పష్టంగా బదులిచ్చా. దీంతో శాసన మండలిలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. వలంటీర్ వ్యవస్థను తొలగించమని, తాము అధికారంలోకి వస్తే గౌరవ వేతనం కింద రూ. 10వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పారని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వలంటీర్ వ్యవస్థే లేదనడం దారుణమని మండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని నిలదీశారు. వలంటీర్లను రద్దు చేయమన్నారు. కొనసాగిస్తామన్నారు. గౌరవ వేతనం పెంచుతామన్నారు. ఇన్ని హామీలు ఎన్నికల్లో ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్లను మోసం చేశారని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మండిపడ్డారు. వలంటీర్లపై కూటమి ప్రభుత్వం కుట్రేంటో మరో సారి బయటపడిందని ధ్వజమెత్తారు.