విజయవాడలో డయేరియాతో ఎవరూ చనిపోలేదు
x

విజయవాడలో డయేరియాతో ఎవరూ చనిపోలేదు

నిగెటివ్‌ రిపోర్టు వచ్చినా రెండో సారి తాగు నీటి నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌లకు పంపామని మంత్రి సత్యకుమార్‌ తెలిపారు.


విజయవాడలో డయేరియాతో ఎవరూ చనిపోలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. విజయవాడ నగరంలో డయేరియా కేసులు నమోదైన ప్రాంతం న్యూరాజరాజేశ్వరిపేటలో ప్రస్తుతం పరిస్థితులు అన్నీ అదుపులోనే ఉన్నాయని, ఎవరూ ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. నగరంలోని డయేరియా ప్రభావిత ప్రాంతాలను స్థానిక ఎంపీ కేశినేని చిన్నీతో కలిసి ఆయన క్షేత్ర స్థాయిలో పర్యటించారు. క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిశీలించిన ఆయన బాధితులను, వారి కుటుంబాలను కూడా పరామార్శించారు. డయేరితో ఎవరూ చనిపోలదని, అలాంటి వదంతులను నమ్మొద్దని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా క్షేత్ర స్థాయి పరిస్థితుల గురించి వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మంత్రి సత్యకుమార్‌కు వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. తాగు నీరు ఏమైనా కలుషితమైందా.. వాటిని తాగడం వల్ల వాంతులు, విరోచనాలు వంటి అనారోగ్య సమస్యలు ఏమైనా తలెత్తాయా వంటి అనేక అనుమానాల నేపథ్యంలో మంచినీటి పైపులైన్, అండర్‌ గ్రౌండ్‌ వాటర్‌ నమూనాలు సేకరించి వాటిని పరీక్షల కోసం ల్యాబ్‌లకు పంపాం. అయితే కలుషితం కాలేదు, మంచిగానే ఉన్నాయనే రిపోర్టులు వచ్చాయి. అయినా దానిని వదలకుండా రెండో విడతగా నమూనాలను సేకరించి వాటిని మళ్లీ ల్యాబ్‌లకు పంపాం. అలా నెగిటివ్‌ రిపోర్టులు వచ్చినా ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో ఆ తాగు నీటి సరఫరాను నిలిపి వేశాం. ప్రస్తుతం బయట నుంచి మినరల్‌ వాటర్‌ను క్యాన్లతో బాధిత ప్రాంతపు వాసులకు సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు కూడా ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ, సహకరించుకుంటూ పని చేస్తున్నారని వెల్లడించారు. అంతేకాకుండా స్థానికులతో కూడా మాట్లాడి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. అనారోగ్య పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో ప్రతి ఇంటికి వెళ్లి మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు కూడా అందజేస్తున్నట్లు చెప్పారు.
మరో వైపు విజయవాడలో డయేరియా విజృంభిస్తోంది. ఇది తెరపైకి వచ్చిన మంగళవారం రాత్రి నుంచి గురువారం వరకు 115 మంది డబేయరియా బారిన పడినట్లు వైద్యులు గుర్తించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య శిబిరంలో బాధితులకు చికిత్సలు అందిస్తున్నారు. ప్రస్తుతం 60 మంది వరకు చికిత్సలు పొందుతుండగా, తక్కిన 55 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. స్థానికంగా నిర్వహించిన వినాయక నిమజ్జనం ఆహారం వికటించడం వల్ల ఈ అనారోగ్య పరిస్థితులు వచ్చాయని అధికారులు చెబుతుండగా.. తరచుగా రంగు మారిన నీళ్లు తాగడం వల్ల వాంతులు, విరోచనాలు వచ్చాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరో వైపు స్థానికంగా విక్రయించే ఆహార, మాసంతో పాటు ఇతర షాపులలో సమస్యలు ఉన్నాయనే కారణంగా ఆహార భద్రత అధికారులు దాదాపు 15 షాపుల్లో తనిఖీలు నిర్వహించారు.
మరో వైపు ఇది వరకే ఈ ప్రాంతాన్ని మంత్రి నారాయణ పర్యటించారు. బాధిత ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఆయన పర్యటించారు. అక్కడ బాధితులను పరామర్శించారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో కూడా సమీక్షలు నిర్వహించారు. డయేరియాతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని.. అలాంటి వదంతులు నమ్మొద్దని మంత్రి నారాయణ కూడా వెల్లడించారు.
Read More
Next Story