
రేషన్ కార్డు కోసం పెళ్లి కార్డు అవసరమా?
క్లారిటీ ఇచ్చిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డ్‌లపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక క్లారిటీ ఇచ్చారు. పెళ్లి , మ్యారేజ్ సర్టిఫికేటు లేకుండా రేషన్ కార్డులను జారీ చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గురువారం మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. కొత్తగా మంజూరు చేసే రేషన్ కార్డులకు మ్యారేజ్ సర్టిఫికేట్లు, పెళ్లి కార్డులు అవసరం అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. రేషన్ కార్డు దరఖాస్తులకు మ్యారేజ్ సర్టిఫికేటు, పెళ్లి కార్డు, పెళ్లి ఫొటోలు అవసరం లేదని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాలని, ఆ సర్టిఫికేట్లు కావాలని దరఖాస్తుదారులపై ఒత్తిడి తీసుకొని రావొద్దని, రేషన్ కార్డుల అంశాల్లో ఎలాంటి పొరపాట్లు చేయొద్దని క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
రేషన్ కార్డు కోసం ఎవరు దరఖాస్తులు చేసుకున్నా స్వీకరించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,24 కోట్ల మందికి జూన్‌లో ఉచితంగా రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. వయసుతో సంబంధం లేకుండా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఎవరైనా రేషన్ కార్డులో సభ్యులుగా యాడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. అయితే కార్డులో నుంచి పేర్లను తొలగించే విషయంలో మరణించిన వారి పేర్లను మాత్రమే ప్రస్తుతానికి పరిగణనలోకి తీసుకుంటున్నామని మంత్రి నాదెండ్ల వెల్లడించారు. అంతేకాకుండా కార్డులో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మర్చే విషయంలో మాత్రం అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. మండల తాహశీల్దారు స్థాయిలోనే కార్డుల్లో నమోదైన తప్పుడు వివరాలను పరిష్కరించుకునేందుకు వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు. క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ రైస్ కార్డు మంజూరు చేస్తామని, దీని కోసం కూటమి ప్రభుత్వం సాంకేతికతను ఉపయోగించుకుని ముందుకు అడుగులేస్తోందన్నారు.
కొత్త రేషన్ కార్డుల జారీలో పెళ్లి ధృవపత్రాలది పెద్ద సమస్యగా మారింది. ఇవి ఉంటేనే రేషన్ కార్డులు మంజూరు చేస్తామంటూ అధికారులు భీష్మించుకుని కూర్చోవడంతో లబ్ధిదారులు నానావస్థలు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చాలా మంది దరఖాస్తులు చేసుకునేందుకు కూడా ముందుకు రాని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నాయి. దీంతో కూటమి ప్రభుత్వం మీద విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగారు. ఈ సమ్యలను చక్కదిద్దే ప్రయత్నాలకు ఉపక్రమించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డును మంజూరు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
Next Story