స్కూళ్ళల్లో మొబైల్ ఫోన్లు బ్యాన్
x

స్కూళ్ళల్లో మొబైల్ ఫోన్లు బ్యాన్

మొబైల్ ఫోన్లను టీచర్లు స్కూళ్ళకు తీసుకెళ్ళవచ్చు కాని ఆ ఫోన్లను హెడ్ మాస్టర్ దగ్గరే డిపాజిట్ చేసేయాలి.


స్కూళ్ళల్లో మొబైల్ ఫోన్ల ఉపయోగానికి సంబంధించి తెలంగాణా ప్రభుత్వం ఒక సర్క్యులర్ ను జారీచేసింది. అంటే ఇదేమీ కొత్తగా తీసుకొచ్చిన సర్క్యులర్ కాదు. సమైక్య రాష్ట్రంలో 2012లోనే అప్పటి విద్యాశాఖ డైరెక్టర్ స్కూళ్ళల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధిస్తు సర్క్యులర్ జారీచేశారు. అయితే అప్పటికే ప్రత్యేక తెలంగాణా ఉద్యమం మంచి ఊపుమీద ఉండటంతో ఆ సర్క్యులర్ ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సర్క్యులర్ ను రద్దుచేయలేదు. కాబట్టి ఆ సర్క్యులర్ అమలులో ఉన్నట్లే అనుకోవాలి.

అయితే తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాత సర్క్యులర్నే దుమ్ముదులిపి తాజా తేదీతో మళ్ళీ జారీచేసింది. సర్క్యులర్ సారాంశం ఏమిటంటే క్లాసుల్లో టీచర్లు ఎవరూ మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదని. మొబైల్ ఫోన్లను టీచర్లు స్కూళ్ళకు తీసుకెళ్ళవచ్చు కాని ఆ ఫోన్లను హెడ్ మాస్టర్ దగ్గరే డిపాజిట్ చేసేయాలి. ఏదైనా అత్యవసరమైతే టీచర్లు స్కూళ్ళల్లో ఉండే ఫోన్లను వాడచ్చు లేదా తమ మొబైల్ ఫోన్లనే ఉపయోగించుకోవచ్చు. అయితే ఏ అవసరంతో తాము మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తున్నామనే విషయాన్ని టీచర్లు ముందుగానే హెడ్ మాస్టర్ కు చెప్పాలి. పైగా సర్క్యులర్ ను టీచర్లందరు ఫాలో అవుతున్నారా లేదా అన్న విషయాన్ని పరిశీలించాలని విద్యాశాఖ హెడ్ మాస్టర్లపైనే బాధ్యతలు మోపింది.

దీనిపై సహజంగానే టీచర్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీచర్లలో కొందరు సర్క్యులర్ ను వ్యతిరేకిస్తుంటే మరికొందరు ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమోదిస్తున్నారు. ఇపుడీ సమస్య తెరమీదకు ఎందుకు వచ్చిందంటే కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు కొన్ని స్కూళ్ళను ఆకస్మిక తనిఖీలు చేశారు. అప్పుడు చాలామంది టీచర్లు సెల్ ఫోన్లు వాడుతు, సోషల్ మీడియాలో బిజీగా కనిపించారు. కొంతమంది టీచర్లయితే క్లాసులను గాలికొదిలేసి మొబైల్ ఫోన్లలోనే బిజీగా గడిపేస్తున్నట్లు ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. ఇలాంటి ఫిర్యాదులు 12 జిల్లాల నుండి అనేకమంది టీచర్ల మీద వచ్చాయి. దాంతో విద్యాశాఖ తనకు అందిన ఫిర్యాదులను ప్రభుత్వానికి ఫార్వార్డ్ చేసింది.

అందిన ఫిర్యాదులన్నింటినీ పరిశీలించిన ఉన్నతాధికారులు క్లాసుల్లో టీచర్లు మొబైల్ ఫోన్లను వాడకుండా నిషేధం విధించటం ఒకటే మార్గమని డిసైడ్ అయ్యారట. ఉత్తినే నిషేధం అంటే ఎవరూ మాట వినరుకాబట్టే క్లాసుల్లో టీచర్లు మొబైల్ ఫోన్లు వాడెకుండా సర్క్యులర్ ను జారీచేశారు. సర్క్యులర్ ను అమలుచేసే బాధ్యత హెడ్ మాస్టర్లపైన ఉంచారు. కొందరు టీచర్లు ముందుగా లెసన్ ప్రిపేర్ కాకుండా క్లాసుకు వచ్చిన తర్వాత యూట్యూబ్ లో చూసి పిల్లలకు పాఠాలు చెబుతున్నారనే ఫిర్యాదులు కూడా విద్యాశాఖకు అందాయి. ఇలాంటి అనేక ఫిర్యాదులకు పరిష్కారంగానే టీచర్లు క్లాసుల్లో మొబైల్ ఫోన్లు వాడకూడదనే సర్క్యులర్ జారీ అయ్యింది.

నిషేధం వల్ల సమస్యలేంటి ?

సమస్యలు ఏమిటంటే ఇపుడు టీచర్లు అనేక యాప్ లు ఉపయోగిస్తున్నారు. ఈ యాప్ లన్నీ మొబైల్ ఫోన్లలోనే ఉంటున్నాయి. ప్రతిరోజు విద్యార్ధుల్లో ఎంతమంది క్లాసులకు హాజరు అవుతున్నారనే విషయాన్ని టీచర్లు యాప్ ద్వారా తీసుకుని అప్ లోడ్ చేయాలి. దీన్ని ఫేస్ రికగ్నిషన్ యాప్ అంటారు. అటెండెన్స్ రిజిస్టర్ కు ఫేస్ రికగ్నిషన్ యాప్ అదనం అన్నమాట. అలాగే మిడ్ డే మీల్ పథకంలో ప్రతిరోజు ఎంతమంది విద్యార్ధులు భోజనాలు చేస్తున్నారనే విషయాన్ని కూడా యాప్ ద్వారానే అప్ లోడ్ చేయాలి. దీనికి మొబైల్ ఫోన్ వాడకం తప్పదు. ఇలాంటి అనేక యాప్ ల ద్వారా టీచర్లు ప్రతిరోజు మొబైల్ ఫోన్ వాడక తప్పనిసరైంది.

తెలంగాణాలో సుమారు 30 వేల ప్రభుత్వ స్కూళ్ళున్నాయి. ఇందులో 1.04 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. ఈరోజుల్లో మొబైల్ అందులోను స్మార్ట్ ఫోన్ లేని టీచర్లు ఉంటారా ? ప్రతి స్మార్ట్ ఫోన్ కు ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉండటం వల్ల కొందరు టీచర్లు పాఠాలు చెప్పటంతో కాకుండా ఇతరత్రా బిజీగా ఉంటే ఉండచ్చు. అందులోనే టీచర్లపైన అనేక రకాల ఆరోపణలున్నాయి. చాలామంది టీచర్లు రియల్ ఎస్టేట్, వడ్డీ వ్యాపారం చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. అలాగే ఇన్ స్యూరెన్స్ ఏజెంట్లుగానే కాకుండా రకరకాల వ్యాపకాల్లో ముణిగిపోయారనే ఆరోపణలకు కొదవలేదు. అందరు టీచర్లు కాకపోయినా పైన చెప్పిన వ్యాపకాల్లో బిజీగా ఉండే టీచర్ల సంఖ్య తక్కువేమీ కాదు. అలాంటి టీచర్లకు విద్యాశాఖ జారీచేసిన సర్క్యులర్ కచ్చితంగా మింగుడుపడనిదే అనటంలో సందేహంలేదు.

నేతలేమంటున్నారు ?

టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి తెలంగాణా ఫెడరల్ తో మాట్లాడుతు టీచర్లకు ఫోన్లు లేకుండా రోజు గడవదన్నారు. ప్రభుత్వ పథకాలు అమలు తీరును టీచర్లు ఎప్పటికప్పుడు యాప్ ల ద్వారా అప్ లోడ్ చేయాలంటే మొబైల్ చేతిలో ఉంటేనే సాధ్యమవుతుందన్నారు. అసలు మొబైల్ ఫోన్లు లేకుండా స్కూళ్ళు నడుస్తాయా అని ప్రశ్నించారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించమని ప్రభుత్వం ఒకవైపు చెబుతునే మరోవైపు టీచర్లు స్కూళ్ళల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధించటంలో అర్ధంలేదన్నారు. ఇక టీఎస్పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ షౌకత్ ఆలీ మాట్లాడుతు మొబైల్ నిషేధం అనే సర్క్యులర్ కన్నా స్వీయ నియంత్రణ పాటించేలా చర్యలుంటే బాగుంటుందన్నారు. బోధనకు మొబైల్ ఫోన్లు అడ్డం కాకుండా చూసుకోవాల్సిన బాద్యత టీచర్లపైన కూడా ఉందని చెప్పారు. తాజా సర్క్యులర్ ను అడ్డం పెట్టుకుని కొందరు హెడ్ మాస్టర్లు టీచర్లను వేధించే అవకాశం కూడా ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.

Read More
Next Story