
శ్రీసిటీలో ‘నో హెల్మెట్ – నో ఎంట్రీ’ నిబంధనలు
రోడ్డు భద్రతపై అవగాహన పెంచి, బాధ్యతాయుతమైన ప్రయాణ సంస్కృతిని ప్రోత్సహించడమే లక్ష్యం దీనిని అమల్లోకి తెచ్చారు.
శ్రీసిటీలో కఠినమైన నిబంధనలు అమలులోకి తీసుకొచ్చారు. తిరుపతి ఎస్పీ ఆదేశాల మేరకు శ్రీసిటీ పోలీసులు శ్రీ సిటీ సెక్యూరిటీ సిబ్బంది సహకారంతో ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ నిబంధన అమలు ప్రారంభించారు. ద్విచక్ర వాహనదారుల భద్రతను మరింత పటిష్టం చేయాలని లక్ష్యంగా సోమవారం ఉదయం నుంచి ఈ నిబంధనను శ్రీసిటీ అంతటా కఠినంగా అమలు చేశారు. దీనికి అదనంగా ‘నో హెల్మెట్ – నో ఎంట్రీ’ నిబంధనను అమలు చేస్తూ, హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు శ్రీసిటీలోకి ప్రవేశం నిరాకరించారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచి, బాధ్యతాయుతమైన ప్రయాణ సంస్కృతిని ప్రోత్సహించడమే దీని లక్ష్యంగా అధికారులు పేర్కొన్నారు.
నిబంధనల అమలులో భాగంగా, స్థానిక సెంట్రల్ ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు ప్రధాన కూడళ్ల వద్ద పోలీసు బృందాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. హెల్మెట్ ధరించిన వాహనదారులను ఆపి అభినందనలు తెలియజేయగా, హెల్మెట్ లేకుండా ప్రయాణించిన వారిపై చట్ట ప్రకారం జరిమానాలు విధించారు.
ఈ కార్యక్రమాన్ని శ్రీసిటీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, సబ్ ఇన్‌స్పెక్టర్ సుధీర్ కుమార్ రెడ్డి, శ్రీసిటీ సెక్యూరిటీ చీఫ్ వై.రమేష్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ, రోడ్డు భద్రతపై జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుబడి ఉందని, హెల్మెట్ ధరించడం ప్రాణ రక్షణకు అత్యంత కీలకమని పేర్కొంటూ ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు.
Next Story

