అమరావతిలో ఐదు కిమీ వరకు నోఫ్లై జోన్‌..మీరితే కఠిన చర్యలు
x

అమరావతిలో ఐదు కిమీ వరకు నోఫ్లై జోన్‌..మీరితే కఠిన చర్యలు

సభా ప్రాంగణంలో ప్రత్యేకంగా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు.


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటన సందర్భంగా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారు. అమరావతి ప్రాంతంలో సభ నిర్వహించే ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల పరిధి వరకు నో ఫ్లై జోన్‌గా కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన పూర్తి అయ్యేంత వరకు ఈ ఐదు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్‌ను ఎగురవేయడానికి వీల్లేకుండా కఠిన నిబంధనలు చేపట్టింది. ఇదే పరిస్థితి ప్రధాని మోదీ విమానం దిగే గన్నవరం ఎయిర్‌ పోర్టులో కూడా విధించింది. ఎయిర్‌ పోర్టు చుట్టు పక్కల ప్రాంతాలలో ఇవే నిబంధనలను అమలులోకి తెచ్చారు.

గన్నవరం ఎయిర్‌ పోర్టు నుంచి ప్రధాని మోదీని అమరావతి సభా ప్రాంగణానికి వెళ్లేందుకు రెండు మార్గాలను అందుబాటులోకి ఉంచారు. కేరళ తిరువనంతపురం నుంచి స్పెషల్‌ ఫ్లైట్‌లో ప్రధాని మోదీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. గన్నవరం ఎయిర్‌ పోర్టులో దిగిన తర్వాత ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్‌ హోం మంత్రి వంగలపూడి అనిత, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజులు స్వాగతం పలుకుతారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సభాప్రాంగణానికి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.

దీని కోసం గన్నవరం ఎయిర్‌పోర్టులో నాలుగు ప్రత్యేక హెలికాప్టర్లను ఉంచారు. హెలికాప్టర్‌లో వెళ్లేందుకు వాతావరణం అనుకూలించని పక్షంలో రోడ్డు మార్గం ద్వారా వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. గన్నవరం ఎయిర్‌ పోర్టు నుంచి చెన్నై–కోల్‌కతా నేషనల్‌ హైవే మీదకు వచ్చి అక్కడ నుంచి కేసరపల్లి–గూడవల్లి–ఎనికేపాడు–రామరప్పాడు మీదుగా విజయవాడ నగరంలోకి ఎంటర్‌ అవుతారు. అక్కడ నుంచి బెంజిసర్కిల్, ప్రకాశం బ్యారేజీ మీదుగా ఉండవల్లి కరట్ట నుంచి అమరావతిలోకి ప్రవేశిస్తారు. రోడ్డు మార్గం గుండా వెళ్లేందుకు అవసరమైన ట్రయిల్‌ రన్‌ను కూడా ఇప్పటికే పూర్తి చేశారు. ఈ ప్రాంతమంతా నిషేధిత ఫ్లై జోన్‌ కిందకు వస్తుంది. ఈ ప్రాంతంలో ఎక్కడా కనీసం బెలూన్లు కూడా ఎగరేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పహల్గా ఉగ్ర దాడుల నేపథ్యంలో పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టారు. సభా ప్రాంగణంలో ఒక ప్రత్యేక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. భద్రత చర్యల్లో ఎక్కడా లోపాలు తలెత్తకుండా పెద్ద పెద్ద స్క్రీన్‌లు ఏర్పాటు చేసి, తద్వారా మోనటరింగ్‌ చేపట్టనున్నారు. నో ఫ్లై జోన్‌లో డ్రోన్‌లు కానీ, బెలూన్లు కానీ ఎగురవేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు.

Read More
Next Story