లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ అయ్యే ఛాన్సేలేదా!?
x

లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ అయ్యే ఛాన్సేలేదా!?

ఇప్పటి చార్జిషీట్ ప్రకారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే ఛాన్స్ లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఎందుకు?


ఏపీని కుదిపేస్తున్న మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎట్టకేలకు తొలి చార్జిషీట్ ను దాఖలు చేసింది. 305 పేజీలు, వ్యక్తులు, సంస్థలు సహా 48 మంది నిందితులు, 16మంది నిందితుల పేర్లు, 12 మంది అరెస్ట్ అయిన వారిపేర్లతో ఈ చార్జిషీట్ ఉంది. దీనికి అనుబంధంగా 70 వాల్యూమ్‌ల అనుబంధ పత్రాల్ని జతపరిచారు. అసలు కుట్ర ఏమిటీ, కుంభకోణం ఏమిటీ, నిధులు ఎలా దారిమళ్లాయి, డబ్బులు ఎలా చేతులు మారాయి అనే అంశాలను ప్రధానంగా ఇందులో రాసుకొచ్చారు.

విచారణ సందర్భంలో పలువురు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే నిందితులు లేదా అభియోగాలు ఎదుర్కొన్న వారి పేర్లలో జగన్ పేరు ఎక్కడా లేదు. దీంతో సిట్ అధికారులు జగన్ ను విచారిస్తారని, ఆయన్ను అరెస్ట్ చేస్తారని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని హైకోర్టు న్యాయవాది (పేరు రాయడానికి ఇష్టపడలేదు) ఒకరు చెప్పారు.
వైసీపీ హయాంలో జరిగినట్టు చెబుతున్న 3,200 కోట్ల మద్యం కుంభకోణం కేసు చార్జిషీట్ లో సిట్‌ అధికారులు నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేరును పలుమార్లు ప్రస్తావించడం దేనికి సంకేతమని ఆ న్యాయవాదిని ది ఫెడరల్ ప్రతినిధి అడిగినపుడు... జగన్ అప్పటి ముఖ్యమంత్రి. సహజంగానే ఆ పేరు ప్రస్తావనకు వస్తుంది లేదా అధికారులే పలుమార్లు ఆయన పేరును ప్రస్తావించి ప్రశ్నలు అడుగుతారు, అంతమాత్రాన జగన్ నిందితుడు అయిపోడు. అధికారుల అడిగిన విషయాన్నే అందులో రాసి ఉంటారు. దీంతో ఆయనంటే గిట్టని వాళ్లు, అదిగో చార్జిషీట్ లో ఆయన పేరుంది, ఇక అరెస్ట్ తప్పదనే భావనకు వచ్చి ఉండవచ్చు అని అన్నారు. చార్జిషీట్ లో జగన్ పేరు లేదంటే ఆయన నిందితుడు కానట్టే కదా అని చెప్పారు ఆ న్యాయవాది.
చార్జిషీట్లను ఎన్ని సార్లైనా మార్చే అవకాశం ఉన్నందున మున్ముందు జగన్ పేరును చేర్చుతారేమో చూడాలి. ఇప్పటికైతే ఆయన పేరు లేదు. అందువల్ల సిట్ అధికారులు ఆయన జోలికి పోయే అవకాశం తక్కువ. మున్ముందు జగన్‌ ప్రమేయంపై స్పష్టత రానుంది.
మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు, డిస్టిలరీల నుంచి డబ్బులు ఎలా వసూలు చేసేవారు? అందులో ఎవరెవరు ఉన్నారు? ఈ ముడుపుల సొమ్ము ఎక్కడ నిల్వ చేశారు? ఏయే డొల్ల కంపెనీల్లోకి మళ్లించారు అనే వివరాలను ఈ 305 పేజీల చార్జిషీట్ లో పొందుపరిచారు. ఈ కేసులో ఇప్పటి వరకు రూ.62 కోట్ల సొత్తును రెండు విడతలుగా జప్తు చేశారు. 16 మంది నిందితుల్లో ఎవరెవరు ఏమేమీ చేశారు, ప్రమేయం వంటి వివరాలను కోర్టుకు సమర్పించారు. ఆడియో, వీడియో రికార్డులు, ఫోరెన్సిక్‌ నివేదికలు, సీడీఆర్‌ వివరాలను కూడా కోర్టుకు అందించారు.
కోర్టుకు సమర్పించక ముందే మీడియాకి ఎలా వచ్చిందీ?
న్యా­యస్థానం కంటే ముందే ఈ కేసులో చార్జ్‌షీట్‌ వివరాలు కొన్ని పత్రికల్లో, ఛానళ్లలో రావడంతో వైసీపీ నాయకులు సిట్ అధికారులను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ కేసులో ప్రా­థ­మిక చార్జ్‌షీట్‌ను సిట్‌ అధికారులు న్యాయస్థానంలో శనివారం రాత్రి స­మర్పించింది.
రాజ్యాంగ నిబంధనల ప్రకారం కోర్టులో సమర్పించే వరకు చార్జ్‌షీట్‌లో ఉన్న వివరాలు ఎవరికీ తెలియకూడదు. ఆ చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు న్యాయస్థానం ప్రకటించాలి. అనంతరం కోర్టు ద్వారానే చార్జ్‌షీట్‌ కాపీని ఈ కేసుతో సంబంధం ఉన్నవారు తీసుకోవాలి.
దీనికి భిన్నంగా ఇందులోని వివరాలు శనివారం మార్కెట్ లోకి వచ్చిన కొన్ని పత్రికల్లో అచ్చయింది. కోర్టు కంటే ముందుగానే మీడియాకు చార్జ్‌షీట్‌ చేరింది. చార్జ్‌షీట్‌ ఎన్నిపేజీలు ఉన్నాయో, అందులోని వివరాలేమిటో ప్రచురించాయి. అయితే నిందితులు 41 మందిగా పేర్కొంటే కోర్టుకు సమర్పించిన పత్రంలో మాత్రం 48గా ఉంది.
Read More
Next Story