నిర్మల్, సోమశిల, అహోబిలం బెస్ట్ టూరిజం గ్రామాలు, ఎందుకంటే...
తెలంగాణలోని నిర్మల్, సోమశిల, ఏపీలోని అహోబిలంను ఉత్తమ పర్యాటక గ్రామాలుగా కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ శుక్రవారం ప్రకటించింది.ఉత్తమ గ్రామాల విశిష్ఠత తెలుసుకుందాం.
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శుక్రవారం కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ తెలంగాణలోని నిర్మల్, సోమశిల గ్రామాలను ఉత్తమ పర్యాటక గ్రామాలుగా ఎంపిక చేసింది. దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు 2023వ సంవత్సరంలో ఉత్తమ పర్యాటక గ్రామాల మధ్య పోటీని కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. సాంస్కృతిక, కమ్యూనిటీ ఆధారిత కళలను సంరక్షించేందుకు వీలుగా పర్యాటక గ్రామాలను ఎంపిక చేశారు.
- దేశంలో 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 991 దరఖాస్తులు రాగా,8 విభాగాల్లో వీటిలో 36 గ్రామాలను ఉత్తమ పర్యాటక గ్రామాలుగా కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ఎంపిక చేసింది.
ఏపీలో అహోబిలం ఉత్తమ పర్యాటక గ్రామం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తమ పర్యాటక గ్రామంగా అహోబిలం ఎంపికైంది. ఆధ్యాత్మికం, ఆరోగ్య రంగంలో అహోబిలం గ్రామాన్నిఉత్తమ పర్యాటక గ్రామంగా కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ఎంపిక చేసింది. తెలంగాణలో ఈ ఏడాది రెండు గ్రామాలు ఎంపిక కాగా ఏపీలో ఒకే గ్రామం ఉత్తమ పర్యాటక గ్రామంగా కేంద్రం ప్రకటించింది.
నిర్మల్ చెక్క బొమ్మలు, పెయింటింగులు
హస్తకళల్లో గొప్ప సాంస్కృతిక వారసత్వానికి నిర్మల్ ప్రసిద్ధి చెందింది. ప్రత్యేకించి నిర్మల్ పెయింటింగ్‌లు, సంప్రదాయ చెక్క బొమ్మలు క్రాఫ్ట్స్ విభాగంలో గుర్తింపు పొందాయి. నిర్మల్ జిల్లాలోని నిర్మల్ గ్రామం కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి. హైదరాబాద్ నగరానికి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మల్ మొఘల్ శకం నాటి కళాత్మక ప్రతిభకు కేంద్రంగా మారింది.
ఆధ్యాత్మిక గ్రామంగా సోమశిల
హైదరాబాద్‌కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగర్‌కర్నూల్ జిల్లాలోని సోమశిల గ్రామం ఆధ్యాత్మిక - వెల్‌నెస్ విభాగంలో ఉత్తమ పర్యాటక గ్రామంగా అవార్డు లభించింది.గలగల పారే కృష్ణా నదీ తీరాన నెలకొన్న సోమశిల గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నిర్మలమైన ప్రకృతి అందాల దృశ్యాలకు సోమశిల ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామం వెల్‌నెస్ టూరిజంకు ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామంలో అత్యంత పురాతన మైన సోమశిల దేవాలయం ఉంది.ఈ ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు.
Next Story