Attack on RDO|నిర్మల్ ఆర్డీవోపై గ్రామస్తుల దాడి.. నిర్బంధం
x

Attack on RDO|నిర్మల్ ఆర్డీవోపై గ్రామస్తుల దాడి.. నిర్బంధం

గ్రామస్తులు, రైతులు ఆర్డీవో రత్న కల్యాణి(RDO RatnaKalyani)పై దాడిచేసి ఆమె కారులో ఆమెను నిర్బంధించటం తెలంగాణా(Telangana)లో సంచలనమైంది.


ఒకవైపు స్కూల్లో చదువుతున్న విద్యార్ధుల అనారోగ్యాలు, మరోవైపు అధికారులపై గ్రామస్తులు, రైతుల దాడులతో రేవంత్ రెడ్డి(Revanth reddy) ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. నారాయణపేటలోని మాగనూరు స్కూలులో పురుగుల అన్నం తినటంతో మంగళవారం రాత్రి కొందరు పిల్లలు తీవ్ర అస్వస్ధతకు గురై ఆసుపత్రిలో చేరారు. మంగళవారం రాత్రి దిలావర్ పూర్(Dilavarpur village) గ్రామస్తులు, రైతులు ఆర్డీవో రత్న కల్యాణి(RDO RatnaKalyani)పై దాడిచేసి ఆమె కారులో ఆమెను నిర్బంధించటం తెలంగాణా(Telangana)లో సంచలనమైంది. లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జై(Collector Pratik Jain)న్ మీద గ్రామస్తుల దాడి ఘటన మరువకముందే దిలావర్ పూర్ లో ఆర్డీవోపై గ్రామస్తులు దాడిచేయటమే కాకుండా గంటలకొద్దీ నిర్బంధించటం కలకలం రేపుతోంది. గ్రామస్తుల నుండి ఆర్డీవోను విడిపించటానికి స్వయంగా జిల్లా కలెక్టర్ జానకీ షర్మిల తన అధికారులతో రావాల్సొచ్చింది.

మంగళవారం మధ్యాహ్నం దిలావర్ పూర్ జాతీయరహదారిపైకి చేరుకున్న గ్రామస్తులు బుధవారం ఉదయం కూడా రోడ్డుమీదే బైఠాంచటంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తత పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే దిలావర్ పూర్-గుండంపల్లి గ్రామాల మధ్య శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఆధారంగా 40 ఎకరాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ(Ethanol Project) ఏర్పాటవుతోంది. ఈ ఫ్యాక్టరీని పీఎంకే గ్రూప్(PMK Group) నిర్మిస్తోంది. కాంపౌండ్ వాల్ తో పాటు ఫ్యాక్టరీ నిర్మాణం కూడా దాదాపు అయిపోవచ్చింది. వందల కోట్ల రూపాయల పెట్టుబడితో పెడుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల తమ పొలాలు, భూములతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని గ్రామస్తులు, రైతులు చాలాకాలంగా నిరసనలు తెలుపుతున్నారు. అయితే అప్పట్లో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం వీళ్ళ ఆందోళనలను పట్టించుకోలేదు. తమ ఫ్యాక్టరీ వల్ల ఎలాంటి వాతావరణ కాలుష్యం జరగదని కంపెనీ యాజమాన్యం చెబుతోంది.

గతంలో కూడా గ్రామస్తుల ఆందోళనతో ఒకసారి ఉద్రిక్తపరిస్ధితులు తలెత్తాయి. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులను పెట్టి ఆందోళనను అణిచేసింది. అప్పటినుండి ఏదోరూపంలో గ్రామస్తులు నిరసనలు తెలుపుతునే ఉన్నా ఎవరూ లక్ష్యపెట్టలేదు. ఇపుడు దిలావర్ పూర్, గుండంపల్లి గ్రామాల జనాలకు సముందర్ పల్లి, కాండ్లి, టెంబరేణి, లోలం గ్రామస్తులు, రైతులు కూడా జతకలిశారు. దాంతో పై గ్రామాల్లోని వందలమంది మహిళలు జాతీయరహదారిపై రాస్తారోకో చేయటంతో పెద్ద గందరగోళం మొదలైంది. పోలీసులు ఎంతచెప్పినా గ్రామస్తులు వినకపోవటంతో రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆర్డీవో రత్నకల్యాణి అక్కడికి చేరుకున్నారు. గ్రామస్తులతో ఎంతసేపు మాట్లాడినా ఉపయోగంలేకపోయింది. గ్రామస్తులను కలెక్టర్ తో సమవేశం చేయిస్తానని ఆర్డీవో చెప్పిన మాటను గ్రామస్తులు వినలేదు.



కలెక్టర్ నే తమ దగ్గర తీసుకురావాలని పట్టుబట్టారు. దాంతో ఆర్డీవోకు గ్రామస్తులకు మాట మాట పెరిగింది. అక్కడ ఏమైందో తెలీదుకాని గ్రామస్తులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఆర్డీవోపై ఒక్కసారిగా దాడిచేసి ఆమెను కారులోకి నెట్టేశారు. కారులోనుండి బయటకు వచ్చేందుకు కల్యాణి ఎంత ప్రయత్నంచేసినా ఉపయోగం లేకపోయింది. కారు డ్రైవర్ లేడు, పైగా కారు అద్దాలన్నీ పైకి ఎత్తేశారు. దాంతో గాలిలేక కారులో ఆర్డీవో ఇరుక్కుపోయారు. తనకు ఊపిరి ఆడటం కష్టంగా ఉందని బయటకు రానివ్వాలని కల్యాణి ఎంతవేడుకున్నా జనాలు వినిపించుకోలేదు. అక్కడే పోలీసులున్నప్పటికీ వాళ్ళను గ్రామస్తులు కారుదగ్గరకు రానీయలేదు. దాంతో పోలీసులు చేసేదిలేక అదే విషయాన్ని కలెక్టర్, ఎస్పీకి వివరించారు. దాంతో వెంటనే ఎస్పీ జానకి షర్మి(SP Janaki Sharmila)ల అక్కడికి చేరుకుని లాఠీఛార్జి చేసి జనాలందరినీ చెదరగొట్టారు. తర్వాత కారుదగ్గరకు చేరుకుని తలుపులు బలవంతంగా తెరిచి లోపల ఇరుక్కుపోయిన ఆర్డీవోను బయటకు తీసుకొచ్చారు. దాదాపు 5 గంటల తర్వాత కారులో నుండి బయటకు వచ్చిన ఆర్డీవో కల్యాణి చివరకు ఊపిరి పీల్చుకున్నారు.

ఒకవైపు చలిపులి వణికిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకనే తాము ఇబ్బందిపడకుండా పైన చెప్పిన నాలుగు గ్రామాల జనాలు రోడ్లపైనే వంటావార్పు చేసుకున్నారు. అలాగే చలిమంటలను కూడా రోడ్లపైన వేసుకున్నారు. దాంతో రాత్రంతా గ్రామస్తులు, రైతులు రోడ్డుపైనే ఉండగలిగారు. దీని కారణంగా వాహనాల ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఇంత గోలజరుగుతున్నా ప్రభుత్వం తరపున మంత్రి, ప్రజాప్రతినిధులు ఎవరూ దిలావర్ పూర్ కు చేరుకోలేదు. ప్రతిపక్షాల నేతలెవరినీ దిలావర్ పూర్ నేషనల్ హైవే దగ్గరకు రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. మొత్తానికి ఆర్డీవోను 5 గంటలపాటు నిర్బంధించిన ఘటన ఇపుడు తెలంగాణాలో సంచలనమైపోయింది. మరి దీని పర్యవసానాలు ఎలాగుంటాయో చూడాలి.

Read More
Next Story