పీఎఫ్ లో కొత్త సంస్కరణలు
x

పీఎఫ్ లో కొత్త సంస్కరణలు

చందాదారులకు సేవలు మరింత సులభం చేసేందుకు ఈపీఎఫ్‌వో సంస్కరణలు చేపట్టింది. ప్రత్యేక క్లైమ్ లు ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ వద్దే పరిష్కారం.


ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) చందాదారుల సౌకర్యార్థం పలు సంస్కరణలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ సంస్కరణలు ఉద్యోగులకు పీఎఫ్‌ సేవలను మరింత వేగవంతంగా, సులభంగా అందించే లక్ష్యంతో రూపొందించారు. ఈ మేరకు కేంద్ర అదనపు పీఎఫ్‌ కమిషనర్‌ జీఆర్‌ సుచింద్రనాథ్‌ ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేశారు.

ఎకౌంట్స్‌ అధికారి స్థాయిలోనే పరిష్కారం

ఇప్పటివరకు ప్రత్యేక క్లెయిమ్‌లు, ఇతర ముఖ్యమైన పనులకు ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌ ఆమోదం అవసరం ఉండగా, ఇక నుంచి ఈ పనులను ఎకౌంట్స్‌ అధికారి, సహాయ పీఎఫ్‌ కమిషనర్‌ స్థాయిలోనే పరిష్కరించేలా సవరణలు చేశారు. ఈ సంస్కరణల ద్వారా 15 రకాల సేవలు సులభతరం కానున్నాయి.

పూర్వ ఈపీఎస్‌ సర్వీసును ప్రస్తుత సంస్థ సర్వీసుతో కలపడం

ఈపీఎఫ్‌ అడ్వాన్స్‌ చెల్లింపులు

వడ్డీ లెక్కింపులో లోపాల సవరణ

అదనంగా చెల్లించిన ఈపీఎస్‌ మొత్తాల సర్దుబాటు

ఈ చర్యలు చందాదారులకు సేవలను వేగవంతంగా అందించడంతో పాటు అధికారులపై ఆధారపడే సమయాన్ని తగ్గిస్తాయి.

అనుబంధం-‘K’ సర్టిఫికెట్‌ ఆన్‌లైన్‌లో అందుబాటు

ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు వారి గత ఈపీఎస్‌ సర్వీసు, ఈపీఎఫ్‌ నిల్వలు కొత్త సంస్థకు బదిలీ కావాలి. ఇది పింఛను సర్వీసు పెరగడంతో పాటు నిల్వలను ఒకే చోట ఉంచడానికి సహాయపడుతుంది. ఈ ప్రక్రియ కోసం ఈపీఎఫ్‌వో ‘అనుబంధం-కే’ సర్టిఫికెట్‌ జారీ చేస్తుంది. ఇందులో పీఎఫ్‌ బ్యాలెన్స్‌, వడ్డీ, సర్వీసు వివరాలు, ఉద్యోగ వివరాలు ఉంటాయి.

ఇప్పుడు ఈ సర్టిఫికెట్‌ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుందని ఈపీఎఫ్‌వో ప్రకటించింది. చందాదారులు మెంబర్‌ పోర్టల్‌లోని ఆన్‌లైన్‌ సర్వీసుల ద్వారా ‘క్లెయిమ్‌ ట్రాకింగ్’ విభాగంలో ‘అనుబంధం-కే’ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఉద్యోగి కొత్త సంస్థలో చేరినప్పుడు ‘ఫారం 13’ సమర్పించి, తొలి చందా జమ అయిన తర్వాత గత సర్వీసు, నిల్వలు ఆటోమేటిక్‌గా బదిలీ అవుతాయి.

యూపీఎస్‌ ఆదేశాలు తాత్కాలికంగా నిలిపివేత

ఈపీఎఫ్‌వో ఉద్యోగులను యూనిఫైడ్‌ పింఛను పథకం (యూపీఎస్‌)లోకి మార్చేందుకు మార్చి 28, 2025న జారీ చేసిన ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ పథకాన్ని సెంట్రల్‌ బోర్డు ఉద్యోగులకు అమలు చేసే ప్రతిపాదన ఇంకా పరిశీలనలో ఉందని సంస్థ తెలిపింది.

పార్ట్‌ పేమెంట్లకు అనుమతి

ఈపీఎఫ్‌వో తుది క్లెయిమ్‌లలో పార్ట్‌ పేమెంట్లను అనుమతించే నిర్ణయం తీసుకుంది. పూర్తి చందా జమ కాని సందర్భాల్లో క్లెయిమ్‌లను తిరస్కరించకూడదని స్పష్టం చేసింది. ఉదాహరణకు ఒక ఉద్యోగి ఐదేళ్ల సర్వీసులో మూడేళ్ల చందాలు మాత్రమే చెల్లించినట్లయితే, గతంలో అధికారులు పూర్తి చందా లేని కారణంతో క్లెయిమ్‌ను తిరస్కరించేవారు. ఇక నుంచి ఈపీఎఫ్‌ చట్టంలోని పేరా 10.11 పార్ట్‌2ఏ ప్రకారం పార్ట్‌ పేమెంట్లు చేయడం ద్వారా చందాదారులకు సౌలభ్యం కల్పిస్తారు. మిగిలిన చందా వసూలు చేసి, ఆ మొత్తాన్ని తుది పేమెంట్‌ కింద చెల్లించేలా చర్యలు తీసుకుంటారు.

ఈపీఎఫ్‌వో ఈ సంస్కరణల ద్వారా చందాదారులకు సేవలను మరింత సులభతరం చేయడంతో పాటు పారదర్శకతను పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ఆన్‌లైన్‌ సర్వీసుల విస్తరణ, అధికార వికేంద్రీకరణ, పార్ట్‌ పేమెంట్ల అనుమతి వంటి చర్యలు ఉద్యోగులకు పీఎఫ్‌ సేవలను సమర్థవంతంగా అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Read More
Next Story