వైఎస్సార్సీపీ నుంచి తాత్కాలికంగా నైనా వలసలు ఆగిపోతాయా?
x

వైఎస్సార్సీపీ నుంచి తాత్కాలికంగా నైనా వలసలు ఆగిపోతాయా?

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు వైఎస్సార్‌సీలో నూతనోత్తేజాన్ని తీసుకొచ్చాయి.


ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల లడ్డు తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందనే దుమారం పది రోజులుగా ప్రజల్లో చర్చకు పెద్ద దారి తీసింది. ముఖ్యమంత్రి తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారని వ్యాఖ్యానించడం ఒక్క సారిగా వెంకటేశ్వరుని భక్తులతో పాటు అసలు భక్తేలేని వారిలోనూ చర్చ మొదలైంది. వైఎస్సార్‌సీపీ హయాంలో ఈ కల్తీ వ్యవహారం జరిగిందని సీఎం ఆరోపించారు. ఇందుకు బాధ్యులైన వారిలో ఏ ఒక్కరినీ వదిలేది లేదని కూడా స్పష్టం చేశారు.

సుప్రీం కోర్టు ప్రశ్నలకు నీళ్లు నమిలిన ప్రభుత్వ న్యాయవాది..

ఈ నేపథ్యంలో లడ్డులో వాడిన నెయ్యి వ్యవహారంలో నిజానిజాలు తేల్చాలని పలువరు సుప్రీం కోర్టులో పిటీషన్‌లు దాఖలు చేశారు. ఈ పిటీషన్‌లను పరిశీలించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు నేరుగా ప్రభుత్వ న్యాయవాదికి కొన్ని ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలకు ప్రభుత్వ న్యాయవాది వద్ద సమాధానం లేకపోవడంతో కేసును వాయిదా వేశారు. ఈ ప్రశ్నల పరంపరలో దేవుడిని రాజకీయాల కోసం వాడుకోవడం ఏమిటని అన్న జడ్డి చేసిన కామెంట్‌ దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. కోర్టు వ్యాఖ్యలతో తెలులుగుదేశం ఇరుకున పడింది. వైఎస్సార్‌సీపీ నేతలు విజృంభించి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగ ప్రకటనలు చేశారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలన్నారు. అంతా కోర్టు విధించిన ఆంక్షలను అంతా మర్చిపోయారు. కాని, 24 గంటల్లోనే అందరి నోర్లు మూత పడ్డాయి. వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీలు నాయకులెవ్వరూ లడ్డులో కల్తీ నెయ్యి వ్యవహారం విషయం, కోర్టు కామెంట్స్‌ విషయమై మాట్లాడొద్దని ఆంక్షలు విధించాయి. దీంతో రెండు రోజులుగా పార్టీ నేతలు నిర్దేశించిన వారు తప్ప ఇతరులు ఎవ్వరూ మాట్లాడటం లేదు.

కొద్ది రోజులు మాటల యుద్ధం..

ముఖ్యమంత్రి ప్రకటన దేశ వ్యాపితంగా ప్రకంపనలు సృష్టించింది. దీనితో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్‌సీపీ నాయకుల మధ్య మాటల యుద్దం జరిగింది. చంద్రబాబు మాటలను ఖండిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు తిరుమల లడ్డును, వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకుంటున్నారని అన్నారు. “అన్నీ దేవుడే చూసుకుంటాడు. లడ్డు తయారీలో మంచి నెయ్యి వాడతారు. కల్తీ నెయ్యి కలిపే అవకాశం లేదు. జూన్‌లో రిపోర్టు వచ్చిందని, సెప్టెంబరులో ఎందుకు సీఎం మాట్లాడుతున్నాడు. సీఎం చేసేవన్నీ డైవర్షన్‌ రాజకీయాలు. ఇచ్చిన హామీలు ఎగవేసేందుకు ప్రజలు ఆ విషయం మరిచిపోయి వేరే విషయాలపై చర్చించుకునేందుకు వెంకటేశ్వరుని భక్తుల మనోభావాలపై దెబ్బ వేశారు,” అని జగన్ న్నారు. ఇక ఇదే చర్చ చాలా కాలం కొనసాగేలా చంద్రబాబు ప్లాన్‌ వేశారని అన్నారు.

పార్టీ నుంచి వలసలు తగ్గిపోతాయా?

తమ పార్టీకి లడ్డు ఆరోపణల నుంచి ఒక రకంగా క్లీన్‌ చిట్‌ వచ్చినట్లేననే వైసిపి ధీమాగా ఉంది. అంతేకాదు, చంద్రబాబు నాయుడు ఇరుకున పడటం ఈ పార్టీ వర్గాలలోనూతనోత్సాహం తెచ్చింది. ఎందుకంటే, ఎన్నికలయిపోయినప్పటి తనుంచి వైఎస్ ఆర్ కాంగ్రెనుంచి ఎమ్మెల్యేలు, రాజ్యసభ ఎంపిలు, సీనియర్ నాయకులు,మునిసిపల్ ఛెయిర్మన్ పెద్ద ఎత్తున టిడిపి, బిజెపి, జనసేనల్లో చేరుతున్నారు.ఈ వలసలు ఆగేలా కనిపిండం లేదు. వాటికి ఎలా అడ్డుకట్టు వేయాలోనాయకత్వానికి తెలియడం లేదు. పార్టీ సరైన పంథాలోనే పోతున్నదని, చంద్రబాబు రాజకీయాలు చేసి పార్టీ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడని కార్యకర్తలకు నేతలకు నచ్చ చెప్పాలి. అలాంటి అవకాశం జగన్ కు రానేలేదు. దానితో ఆయన ఎక్కువ కాలంలో బెంగుళూరులోనే ఉంటున్నాడని చెబుతున్నారు. 2014లో ఓడిపోయినపుడు మరుసటి నెల నుంచే పాదయాత్ర మొదలుపెట్టి రాష్ట్రమంతా తిరిగిన నాయకుడు ఇపుడు డీలాపడిపోయాడని అంతా అంటున్నారు. పార్టీ నుంచి వలసలను ఆయన అపలేడనే టాక్ కూడా మొదలయింది. ఇలాంటపుడు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు భరోసా ఇచ్చాయి. నాయకత్వానికి బలం చేకూర్చేలా ఉన్నాయి.

తిరుమల వెంకటేశ్వరుని లడ్డులో కల్తీ జరిగిందని రాజకీయంగా దేవుడిని, ఆయన ప్రస్తాదాన్ని వాడుకునేందుకు ప్రయత్నించిన టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు పార్టీలో భావిస్తున్నారు. ఇప్పటి వరకు వైఎస్సార్‌సీపీ నుంచి వేరే పార్టీల్లో చేరాలని ఊగిసలాటలో ఉన్న పార్టీ నాయకులు పునరాలోచించుకునే పరిస్థితి సుప్రీం కోర్టు తీసుకువచ్చిందని వైసిపి సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు.

“వైఎస్సార్‌సీపీకీ భవిష్యత్తు ఉంది. ఈ వివాదం నుంచి వైసిపి అధినేత బయటపడితే ఇక పార్టీ పుంజుకుంటుంది. ఆయన ఈ దుర్మార్గాన్ని ప్రజల ముందుకు పెట్టేందుకు యాత్ర ప్రారంభించవచ్చు. ఇలాంటపుడు పార్టీని వీడాలనుకుంటున్నవాళ్లు తప్పకుండా వెనకడుగు వేస్తారు,”అని పేరు రాసేందుకు ఇష్టపడని ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు.

సీఎం హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి..

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ హిందూ సమాజానికి బేషరతుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని సుప్రీం కోర్టు చెప్పింది. జగన్‌ మోహన్‌రెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఇవే అంశాలు ప్రస్తావించారు. అయినా టీడీపీ వారిలో మార్పు కనిపించడం లేదన్నారు. డైవర్షన్‌ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని అన్నారు.

సుప్రీ కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటి వరకు వైఎస్సార్‌సీపీ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లాలని ఊగిసలాడుతున్న నాయకులు కొందరు ఏక్‌దమ్‌న ఆగిపోయారు. వారి మాటల్లోనూ తేడా కనిపించింది. కొందరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉందని ఇటీవల ప్రచారం సాగింది. కోర్టు వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాజకీయాల్లో ఎప్పుడూ లేని స్తబ్దత కనిపించింది. ఆచీ తూచీ మాట్లాడుతున్నారే తప్ప ఇంతకు ముందు లాగా మాట్లాడటం లేదు.

సుప్రీ కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ప్రకాశం జిల్లా దర్శి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డిని ఒపీనియన్‌ చెప్పాల్సిందిగా ఫెడరల్‌ కోరగా ఆయన మాటను దాట వేశారు. నేను అన్నం తింటున్నాను, తర్వాత మాట్లాడతానని తప్పుకున్నారు.

ఎవ్వరూ మాట్లాడొద్దు...

మీడియాతో ఎవ్వరూ మాట్లాడొద్దని వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులకు వైఎస్సార్‌సీపీ ఆదేశాలు జారీ చేసింది. సోమవారం సాయంత్రం నాయకులందరికీ ఒక మెసేజ్‌ ఫార్వర్డ్‌ చేసింది. కోర్టు పరిధిలో అంశం ఉన్నందున ఎవ్వరూ మాట్లాడొద్దని చెప్పినట్లు కృష్ణ జిల్లా నందిగామకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌ అన్నారు. మాకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది. అధికార పార్టీ వైఎస్సార్‌సీపీని దెబ్బకొట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మాకు పార్టీ నుంచి మాట్లాడొద్దని ఆదేశాలు ఉన్నాయి. అందుకే మాట్లాడటం లేదని అన్నారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఫోన్‌లు కట్‌ చేశారు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ ఫోన్‌ కాల్‌ను పలుమార్లు కట్‌ చేశారు.

Read More
Next Story