
కొత్త జిల్లాలు..కొత్త ఉత్సాహం..కొత్త పాలన!
ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, బుధవారం (డిసెంబర్ 31, 2025) నుంచే అన్ని కొత్త జిల్లాల్లో పాలనా వ్యవహారాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరికొత్త పాలనా శకం మొదలైంది. గత ప్రభుత్వం చేసిన జిల్లాల విభజనలో దొర్లిన లోపాలను సవరిస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణను పూర్తి చేసింది. కొత్తగా ఏర్పాటైన పోలవరం, మార్కాపురం జిల్లాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 28కి చేరింది. మంగళవారం జారీ చేసిన తుది గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, బుధవారం (డిసెంబర్ 31, 2025) నుంచే అన్ని కొత్త జిల్లాల్లో పాలనా వ్యవహారాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
కొత్తగా రెండు జిల్లాలు.. మదన్ పల్లికి మకుటం
పోలవరం జిల్లా: రంపచోడవరం కేంద్రంగా ఈ జిల్లా ఏర్పాటైంది. ఇందులో రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.
మార్కాపురం జిల్లా: ప్రకాశం జిల్లా నుంచి విడదీసి మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు. ఇందులో మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లు భాగమయ్యాయి.
అన్నమయ్య జిల్లా: ఈ జిల్లా కేంద్రం ఇప్పటివరకు రాయచోటిలో ఉండగా, ఇకపై మదనపల్లె జిల్లా కేంద్రంగా వ్యవహరిస్తుంది. ప్రజల చిరకాల కోరిక మేరకు ఈ మార్పు చేశారు.
5 కొత్త రెవెన్యూ డివిజన్లు
పరిపాలనను ప్రజల ముంగిటకే చేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లను ప్రకటించింది.
అడ్డరోడ్డు జంక్షన్ (అనకాపల్లి జిల్లా)
అద్దంకి (ప్రకాశం జిల్లా)
పీలేరు (అన్నమయ్య జిల్లా)
మడకశిర (శ్రీసత్యసాయి జిల్లా)
బనగానపల్లి (నంద్యాల జిల్లా)
జిల్లాల వారీగా జరిగిన ప్రధాన మార్పుచేర్పులు
| మార్పు చెందిన నియోజకవర్గం/మండలం | పాత జిల్లా | కొత్త జిల్లా | మండలాలు |
| రైల్వేకోడూరు | అన్నమయ్య | తిరుపతి | కోడూరు, పెనగలూరు, చిట్వేలు, పుల్లంపేట మండలాలు తిరుపతిలో కలిశాయి. |
| రాజంపేట | అన్నమయ్య | కడప | రాజంపేట డివిజన్‌తో పాటు ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలు కడపలో విలీనం. |
| మండపేట | అంబేడ్కర్ కోనసీమ | తూర్పుగోదావరి | మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం రాజమహేంద్రవరం డివిజన్‌లోకి వచ్చాయి. |
| అద్దంకి | బాపట్ల | ప్రకాశం | అద్దంకి ఇప్పుడు సొంతంగా రెవెన్యూ డివిజన్‌గా మారింది. |
| కందుకూరు | నెల్లూరు | ప్రకాశం | కందుకూరు నియోజకవర్గం తిరిగి ప్రకాశం జిల్లాలో చేరింది. |
| గూడూరు (కొన్ని మండలాలు) | తిరుపతి | నెల్లూరు | కోట, చిలకూరు, గూడూరు మండలాలు తిరిగి నెల్లూరులో కలిశాయి. |
పాలనలో వేగం.. ప్రజలకు సౌకర్యం
జిల్లాల పునర్వ్యవస్థీకరణ కేవలం మ్యాపుల మార్పు మాత్రమే కాదు, సామాన్యుడికి కలెక్టర్ కార్యాలయం అందుబాటులోకి రావడమే దీని ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
నియామకాలు: కొత్త జిల్లాలకు ఇప్పటికే కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలను కేటాయించారు. పూర్తిస్థాయి సిబ్బంది వచ్చే వరకు ఉమ్మడి జిల్లా అధికారులు పర్యవేక్షిస్తారు.
డిజిటల్ మ్యాపింగ్: కొత్త సరిహద్దుల ప్రకారం రెవెన్యూ రికార్డులు, ఓటర్ల జాబితా మార్పు ప్రక్రియ కూడా వేగవంతమైంది.

