ఎసైన్షియా పేలుడు మీద సిట్టింగ్ జడ్జి  విచారణకు డిమాండ్
x

ఎసైన్షియా పేలుడు మీద సిట్టింగ్ జడ్జి విచారణకు డిమాండ్

నష్ట పరిహారాన్ని ప్రమాద కారకులైన యాజమాన్యాల నుండి వసూళ్లు చేసి బాధిత కుటుంబాలకు అందించే చట్టాల్ని శాసనసభ ద్వారా చేసి అమలు చేయాలి: సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ.


-వై. సాంబశివరావు


అనకాపల్లి పారిశ్రామిక ప్రాంతంలో 18 మంది మరణానికి, 50 మంది క్షత గాత్రులు కావడానికి కారణమైన తాజా పారిశ్రామిక ప్రమాదం దేశ పారిశ్రామిక రంగంలో జరిగిన అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటి. దీనికి ప్రత్యక్ష కారకులైన పారిశ్రామిక పెట్టుబడిదారీ వర్గాలతో పాటు వారికి నగ్న సేవ చేసే ప్రభుత్వాలు కూడా బాధ్యత వహిస్తాయి. ఈ జంట వర్గాలకు వ్యతిరేకంగా కార్మికవర్గంతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా సమాంతరంగా పోరాడాల్సిన ఆవశ్యకతను తాజా పారిశ్రామిక ప్రమాదం గుర్తింపజేస్తున్నది. ఈ తాజా ప్రమాదం గత సాంప్రదాయ డిమాండ్లు సరిపోవని, వాటితో పాటు కొత్త డిమాండ్లని కూడా ముందుకు తేవాల్సిన కొత్త అవసరాన్ని వెల్లడిస్తున్నది.

ఇలాంటి అమానుషమైన ఘోర పారిశ్రామిక ప్రమాదాలు జరిగిన సమయాల్లో ప్రజల్లో వెల్లడయ్యే తీవ్ర ఆగ్రహావేశాల్ని చల్లార్చడానికి తాత్కాలికంగా కొన్ని కంటితుడుపు చర్యల్ని చేపట్టడం ప్రభుత్వాలకు ఒక అలవాటుగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాద స్థలాలకు పర్యటనలు చేపట్టడం, బాధిత ప్రజల్ని పరామర్శించి ఓదార్చడం, మృతులకు, క్షతగాత్రులకు నష్ట పరిహారం ప్రకటించడం, దర్యాప్తులు జరిపిస్తామని ప్రకటనలు చేయడం ఒక ఆనవాయితీగా మారింది. నిజం చెప్పాలంటే, ఈ నేరస్త పారిశ్రామిక యాజమాన్యాలకి ఏ ప్రభుత్వాలు కొమ్ముకాసిన ఫలితంగా విశృంఖలంగా ఈ తరహా ఘోరమైన ప్రమాదాలు జరుగుతున్నాయో, అదే నేర ప్రభుత్వాల ఓటు బ్యాంకు పెంపుదలకు ఇలాంటి ఘోర ప్రమాదాలు ఒక సాధనంగా మారుతున్నాయి. ఇవి వాటికి రాజకీయ వరంగా మారిన పరిస్థితులను మా పార్టీ దృష్టికి తీసుకుంటున్నది. నిజానికి ప్రాణ నష్టాలు, క్షతగాత్రుల వంటి నష్టాలతో పాటు ఈ ప్రమాదాలు జరిగిన ప్రాంతాల ప్రజలకు, ముఖ్యంగా ఆయా పరిశ్రమలలో పని చేసే కార్మిక వర్గంలో సంభవించే మానసిక సామాజిక సంక్షోభ ప్రభావం లెక్కకట్టలేనిది. ఈ నష్టాల తీవ్రతాను కూడా మా పార్టీ దృష్టిలోకి తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదాల పునరావృతం కాకుండా ఉండాలంటే, ముఖ్యంగా ప్రజల ఎదుట ప్రభుత్వాల్ని జవాబుదారీ స్థానంలోకి నెట్టాలంటే ఈ ప్రమాదాల సమయాల్లో పెట్టే డిమాండ్ల స్వభావంలో కూడా మౌలిక మార్పు రావాలి. సీపీఐ ఎం.ఎల్. న్యూడెమోక్రసీ పార్టీ డిమాండ్లు ఇవి:

1. పార్లమెంటు, శాసనసభలు చేసే చట్టాల పరిధి నుండి తప్పించి, విశేష, విశృంఖల అధికారాల్ని పారిశ్రామిక యాజమాన్యాలకు కట్టబెట్టిన "సెజ్ లు" నేడు కార్మికవర్గానికి యమకూపాలుగా మారాయి. ఈ వరస ప్రమాదాల పరంపర నేపథ్యంలో సెజ్ ల్ని రద్దు చేయాలని మా పార్టీ డిమాండ్ చేస్తున్నది.

2. ఇలా ప్రమాదాలు జరిగిన పారిశ్రామిక యజమానుల మీద వెంటనే హత్యా నేరంతో క్రిమినల్ కేసుల్ని నమోదు చేసి విచారణ చేపట్టాలి.

3. మనుషుల ప్రాణాలకు అత్యున్నతంగా విలువకట్టి భారీ నష్ట పరిహారం ప్రకటించి ఆ సొమ్మును సంబంధిత పారిశ్రామిక యజమానుల నుండి రికవరీ చేయడానికి తగు చట్టం శాసనసభ ద్వారా చేసి కఠినంగా అమలుకు పూనుకోవాలి. దీనితో పాటు ప్రభుత్వం కూడా నేరుగా ఎక్సగ్రెషియా చెల్లించాలి.

4. కొత్త లేబర్ కోడ్లు ప్రారంభ దశలోనే నిర్లక్ష్యం పెరిగి ఇలా ప్రమాదాల పెరుగుదలకు దారి తీస్తుందంటే, మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధమవుతోంది. అందుకే లేబర్ కోడ్లను రద్దు చేయాలి .

5. తాజా ఎసెన్సియ ఫార్మా ప్రమాదం పై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి చేత సమగ్ర విచారణ చేపట్టాలి.

ఈ డిమాండ్ల ప్రాతిపదికన రాష్ట్రంలో పౌర ప్రజాతంత్ర ఉద్యమ నిర్మాణం జరగాలని మా పార్టీ భావిస్తున్నది. ఇదో ఉద్యమంగా మారడం ద్వారా మాత్రమే పారిశ్రామిక నేరస్త యాజమాన్యాలకు నగ్నంగా కొమ్ముకాసే విధానాల్ని మార్చుకోవాల్సిన దుస్థితికి ప్రభుత్వాలు నెట్టబడతాయి. ఈ తరహా విశాల ఉద్యమ నిర్మాణానికి రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు ముందుకు రావాలి.


(వై. సాంబశివరావు, అధికార ప్రతినిధి, సీపీఐ ఎం.ఎల్. న్యూడెమోక్రసీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ)



Read More
Next Story