వాలంటీర్ల గుండెల్లో మొదలైన గుబులు.. ప్రభుత్వం ముందు కొత్త డిమాండ్
వాలంటీర్ వ్యవస్థను కూటమి సర్కార్ కొనసాగిస్తుందా లేదా? అన్నది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ముందుకు సరికొత్త డిమాండ్ వచ్చింది.
వాలంటీర్ వ్యవస్థను కూటమి సర్కార్ కొనసాగిస్తుందా లేదా? అన్నది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. వాలంటీర్ వ్యవస్థను తప్పకుండా కొనసాగిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ఎన్నికల ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఈ అంశంపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. దానికి తోడు అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై 1వ తేదీన పింఛన్‌లను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సహాయంతో ఇంటి దగ్గరే పింఛన్‌లను అందించారు. ఇప్పుడు ఆగస్టు 1వ తేదీ వస్తున్న క్రమంలో మరోసారి వాలంటీర్ల అవసరం లేకుండానే లబ్ధిదారులకు ఇంటి దగ్గరే పింఛన్ అందించేలా సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంతో వాలంటీర్లలో ఆందోళన అధికం అయింది. ఈ నేపథ్యంలోనే అగ్నికి ఆజ్యం పోసినట్లు వారి ఆందోళనను మరింత అధికం చేసే సరికొత్త డిమాండ్ ఒకటి తెరపైకి వచ్చింది. అదే వాలంటీర్ వ్యవస్థ రద్దు.
ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం ఈ మేరకు డిమాండ్‌ను కూటమి ప్రభుత్వం ముందు ఉంచింది. వైసీపీ హయాంలో వచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాల్సింది తీర్మానించిన క్రమంలోనే సర్పంచుల సంఘం ఈ డిమాండ్ చేసిందని సంఘం అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. అదే విధంగా అమరావతి నిర్మాణం కోసం ప్రతి సర్పంచ్ కూడా తన వంతు సహాయంగా ఒక నెల జీతాన్ని విరాళంగా అందించాలని కూడా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే వాలంటీర్ వ్యవస్థ రద్దు సహా మొత్తం 16 డిమాండ్లతో సర్పంచుల సంఘం.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వినతి పత్రం అందించారు. ఈ విషయంపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. దీంతో వాలంటీర్ వ్యవస్థ విషయంలో ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉంటుందనేది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది: మంత్రి
అయితే గతంలో అసెంబ్లీ సాక్షిగా తమ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తప్పకుండా కొనసాగిస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి వివరించారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని వాలంటీర్లకు వేతనాలు పెంచే ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర ఉంది. వాలంటీర్లు నిశ్చింతగా ఉండొచ్చు’’ అని వ్యాఖ్యానించారు. అంతకన్నా ముందే వాలంటీర్ వ్యవస్థ విషయంలో తమ ప్రభుత్వం చర్చలు చేస్తోందని, చర్చల తర్వాత వాలంటీర్లకు అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా వ్యాఖ్యానించారు. మరి ఇప్పుడు సర్పంచుల సంఘం నుంచి వచ్చిన కొత్త డిమాండ్ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.