ఈపీఎఫ్‌లో కొత్త మార్పులు
x

ఈపీఎఫ్‌లో కొత్త మార్పులు

25 శాతం కనీస నిల్వ నిబంధన వల్ల లాభం ఏమిటి? నిబంధనల్లో వచ్చిన ముఖ్య మార్పులు ఏమిటి?


ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌) వ్యవస్థలో ఇటీవల వచ్చిన మార్పులు ఖాతాదారులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. ఉద్యోగులు తమ నిధులను సులభంగా ఉపసంహరించుకునేందుకు నిబంధనలను సరళీకరించిన ఈపీఎఫ్‌వో (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్), అదే సమయంలో విశ్రాంత జీవితానికి అవసరమైన కనీస నిల్వలను నిర్ధారించేలా చర్యలు తీసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) ఆమోదంతో అమల్లోకి వచ్చిన ఈ మార్పులు, గతంలోని సంక్లిష్టతలను తొలగించి, ఉద్యోగుల ఆర్థిక స్థిరత్వాన్ని పటిష్ఠపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ మార్పులు ఖాతాదారులకు ఎలా ఉపయోగపడతాయి? 25 శాతం కనీస నిల్వ నిబంధన వల్ల ఏమి లాభం? నిబంధనల్లో వచ్చిన ముఖ్య మార్పులు ఏమిటి? అనే అంశాలు ఖాతా దారులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

సంక్లిష్టతలు తగ్గి, సౌలభ్యాలు పెరిగిన విధానం

గతంలో ఈపీఎఫ్ నిధుల ఉపసంహరణకు 13 రకాల సంక్లిష్ట నిబంధనలు ఉండేవి. ఇప్పుడు వీటిని కేవలం మూడు సరళమైన వర్గాలుగా మార్చారు. వివాహం/విద్య/వైద్యం, ఇంటి నిర్మాణం/కొనుగోలు, ఇతర అత్యవసరాలు. ఈ మార్పు వల్ల ఖాతాదారులు తమ అవసరాలకు అనుగుణంగా సులభంగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు విద్యా అవసరాల కోసం గతంలో కనీసం 7 ఏళ్ల సర్వీసు అవసరమయ్యేది, ఇప్పుడు 12 నెలల సర్వీసుతోనే ఉపసంహరణ సాధ్యమవుతోంది. ఇంటి నిర్మాణానికి గతంలో 5 ఏళ్లు, ఇప్పుడు 1 ఏడాది సరిపోతుంది.

మరో ముఖ్య మార్పు

ఉద్యోగ విరమణ లేదా ఉద్యోగ రహిత స్థితిలో నిధుల ఉపసంహరణ సమయాన్ని పొడిగించారు. గతంలో ఉద్యోగం మానేసిన ఒక నెల తర్వాత 75 శాతం, రెండు నెలల తర్వాత మిగతా 25 శాతం తీసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు, ఉద్యోగ రహిత స్థితి 12 నెలలు కొనసాగితే పూర్తి నిధులు (100 శాతం) ఉపసంహరించుకోవచ్చు. పింఛను (ఈపీఎస్) కోసం 36 నెలలు వేచి ఉండాలి. ఇంకా క్లెయిమ్‌ల సంఖ్యను పెంచారు. విద్య కోసం 10 సార్లు, వివాహం కోసం 5 సార్లు వరకు ఉపసంహరణలు అనుమతించారు. గతంలో మూడు కలిపి మాత్రమే అవకాశం ఉండేది.

ఆటో-సెటిల్‌మెంట్ వ్యవస్థను మరింత విస్తరించారు. రూ.5 లక్షల వరకు క్లెయిమ్‌లను ఎలాంటి పత్రాలు సమర్పించకుండానే పరిష్కరిస్తారు. ఇది గతంలో రూ.1 లక్ష వరకు మాత్రమే ఉండేది. అదనంగా, 'విశ్వాస్' స్కీమ్‌ను ప్రవేశపెట్టి, వివాదాలు/కోర్టు కేసులను తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు.

అత్యవసరాలకు సులభత, దీర్ఘకాలిక సురక్ష

ఈ మార్పులు ఖాతాదారులకు రెండు విధాలుగా ఉపయోగపడతాయి. మొదటిది అత్యవసర సమయాల్లో నిధులకు త్వరిత యాక్సెస్. ఉదాహరణకు వైద్య చికిత్స, విద్యా ఖర్చులు లేదా ఇంటి కొనుగోలు వంటి అవసరాలకు తక్కువ సర్వీసు కాలంతోనే ఉపసంహరణ సాధ్యమవుతోంది. ఇది మధ్యతరగతి ఉద్యోగులకు పెద్ద ఊరటనిస్తుంది, ఎందుకంటే గతంలో సంవత్సరాల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. రెండవది దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం. 100 శాతం ఉపసంహరణ అనుమతి ఉన్నప్పటికీ, కనీస నిల్వ నిబంధన వల్ల ఖాతాలో కొంత మొత్తం మిగిలి ఉంటుంది. ఇది వడ్డీ ఆదాయాన్ని పెంచి, పదవీ విరమణ సమయంలో మెరుగైన కార్పస్‌ను అందిస్తుంది.

అయితే ఈ మార్పులు కొంత వివాదాస్పదమయింది. ఉద్యోగ రహిత సమయాన్ని 12 నెలలకు పొడిగించడం వల్ల, తక్షణ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి ఇబ్బంది కలుగుతుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఇది ఉద్యోగులను ఆర్థిక క్రమశిక్షణకు అలవాటు చేసి, విశ్రాంత జీవితానికి సామాజిక భద్రతను పెంచుతుందని వాదిస్తోంది. మొత్తంగా 30 కోట్ల మంది ఈపీఎఫ్ సభ్యులకు ఈ మార్పులు ఎక్కువగా లాభదాయకమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు.

25 శాతం కనీస నిల్వ

సీబీటీ నిర్ణయం ప్రకారం ఖాతాలోని మొత్తం నిధుల్లో కనీసం 25 శాతం నిల్వలను మిగిల్చి, మిగతా 75 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. ఈ 25 శాతం మొత్తాన్ని ఒక సంవత్సరం తర్వాత తీసుకునే అవకాశం ఉంది. కానీ పూర్తి ఉపసంహరణకు 12 నెలలు వేచి ఉండాలి. ఈ నిబంధన వల్ల ఖాతాదారునికి సర్వీసు కాలం నిరంతరాయంగా కొనసాగుతుంది. పూర్తి నిధులు తీసుకుంటే పింఛను (ఈపీఎస్) సర్వీసు సున్నాకు చేరుతుంది. భవిష్యత్తులో పింఛను అర్హత తగ్గుతుంది. కానీ 25 శాతం మిగిల్చడం వల్ల సర్వీసు కొనసాగి పదవీ విరమణ సమయంలో మెరుగైన పింఛను (రూ.7 వేల వరకు) అందుతుంది.

ఉదాహరణకు ఒక ఉద్యోగి రూ.10 లక్షల నిధులు ఉన్న ఖాతా నుంచి 75 శాతం (రూ.7.5 లక్షలు) తీసుకుంటే, మిగతా రూ.2.5 లక్షలు 8.25 శాతం వడ్డీతో పెరుగుతాయి. ఇది చక్రవడ్డీ తరహాలో 9.5-10 శాతం రాబడిని ఇస్తుంది. ఆదాయపన్ను రహితం. ఇలా వృద్ధాప్యంలో ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. ఈ నిబంధన ఉద్యోగులను ఇష్టానుసార ఉపసంహరణల నుంచి కాపాడి, దీర్ఘకాలిక పొదుపును ప్రోత్సహిస్తుంది. అయితే తక్షణ అవసరాలున్నవారికి ఇది సవాలుగా మారవచ్చు. కానీ మొత్తంగా ఇది భవిష్యత్తు సురక్షితం చేసే అడుగు.

నిబంధనల్లో వచ్చిన మార్పులు

ముఖ్య మార్పులు సరళీకరణపై దృష్టి సారించాయి. ఉద్యోగి-యజమాని రెండు వాటాలు (12 శాతం వరకు) కలిపి 100 శాతం ఉపసంహరణ అనుమతి, తక్కువ సర్వీసు అవసరాలు, పెరిగిన క్లెయిమ్ సంఖ్య, ఇవి ఖాతాదారులకు సానుకూలం. అదనంగా స్వచ్ఛంద జమలు (వీపీఎఫ్) ప్రోత్సహించి, వడ్డీ ఆదాయాన్ని పెంచుతున్నారు. ఉద్యోగ మార్పుల సమయంలో ఖాతా ట్రాన్స్‌ఫర్‌ను తప్పనిసరి చేసి, సర్వీసు నిరంతరాయతను నిర్ధారిస్తున్నారు.

మొత్తంగా ఈ మార్పులు ఉద్యోగులను తక్షణ అవసరాలకు సిద్ధంగా ఉంచుతూనే, విశ్రాంత జీవితానికి ఆర్థిక బలాన్ని అందిస్తాయి. అయితే ఉద్యోగులు ఇష్టానుసార ఉపసంహరణలు చేయకుండా, ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. ఇది భవిష్యత్తు సంక్షోభాల నుంచి కాపాడుతుంది.

Read More
Next Story