నెల్లూరులో ఎంపీ వేమిరెడ్డికి ఘోర అవమానం, సభ నుంచి వాకౌట్
x

నెల్లూరులో ఎంపీ వేమిరెడ్డికి ఘోర అవమానం, సభ నుంచి వాకౌట్

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఘోర అవమానం జరిగిందంటూ ఆయన పార్టీ సహచరులు, మండిపడ్డారు. అధికారి తీరును నిరసిస్తూ ఎంపీ సమావేశం నుంచి వాకౌట్ చేశారు.


నెల్లూరు జిల్లా జెడ్పీ సమావేశం రసాభాస పాలైంది. అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఘోర అవమానం జరిగిందంటూ ఆయన పార్టీ సహచరులు, అభిమానులు మండిపడ్డారు. అధికారి తీరును నిరసిస్తూ ఎంపీ వేమిరెడ్డి సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
ఇంతకీ విషయమేమిటంటే..
నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో నవంబర్ 3న అంటే ఆదివారం జిల్లా సమీక్షా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మీటింగ్ కి నెల్లూరు రూరల్ ఆర్డీవో ప్రత్యూష వ్యాఖ్యతగా వ్యవహరించారు. అందర్నీ ఒక్కొక్కర్నీ వేదికపైకి పిలిచి పుష్పగుచ్చాలు అందజేయిస్తున్నారు. ముందు మంత్రుల్ని, ఆ తర్వాత ఎమ్మెల్యేలను పిలిచారు. బోకేలు అందజేశారు. అంతవరకు సజావుగానే సాగినా పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డిని వేదిక మీదకు పిలవడం మరచిపోయారు.
దీంతో ఖిన్నుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన పేరును విస్మరించడంతో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సమావేశం నుంచి అలిగి వెళ్లిపోయారు. మంత్రులు నారాయణ, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని సముదాయించేందుకు ప్రయత్నించారు. తనకు తగిన గౌరవం లేని చోట ఉండలేనని వేమిరెడ్డి పెద్దగానే అనడం అక్కడున్న వారందరికీ వినిపించింది. ఎంపీ వెంట ఆయన భార్య, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కూడా సభ నుంచి వెళ్లిపోయారు. వేమిరెడ్డి విషయంలో అధికారుల తీరును మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తప్పుబట్టారు. మరోసారి ఇలా జరగకూడదని కలెక్టర్‌, అధికారులను మంత్రి ఆదేశించారు. అయితే ఆ అధికారి వివరణ ఇస్తూ వేమిరెడ్డి పేరుకూడా రాసుకున్నానని, చదవడంలో పొరబాటు జరిగిందని చెప్పారు. ఏమైనా ఎంపీకి అవమానం జరిగిందంటూ ఆయన అభిమానులు కన్నెర్ర చేశారు.
Read More
Next Story