ఆంధ్రా కొత్త చీఫ్ సెక్రెటరీ నీరబ్ గురించి నాలుగు ముక్కలు
x

ఆంధ్రా కొత్త చీఫ్ సెక్రెటరీ నీరబ్ గురించి నాలుగు ముక్కలు

శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో సిఎస్ చాంబరులో వేద పండితుల ఆశిస్సుల మధ్య నీరబ్ కుమార్ ప్రసాద్ సిఎస్ గా బాధ్యతలు స్వీకరించారు.


అమరావతి, జున్ 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.నీరబ్ కుమార్ ప్రసాద్ ను సిఎస్ గా నియమిస్తూ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ జిఓఆర్టి సంఖ్య 1034 ద్వారా ఆదేశాలు జారీ చేసింది. ఆయన 1987 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. నీరబ్ చాలా చురుకైనా ఆఫీసర్ అని పేరు. ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత ప్రధాన కార్యదర్శి పోస్టు బాగా వార్తలె కెక్కింది. కొందరు ప్రధాన ాకార్యదర్శులు పదువుల్లో ఉండగా వార్తలకెక్కితే, మరికొందరు రిటైరయ్యాక వార్తలకెక్కారు. సాధారణంగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శులు రావడం పోవడం చాలా నిశబ్దంగా జరిగేది. ఇప్పటి ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన కార్యదర్శులు రాజకీయ చర్చనీయాంశం అవుతున్నారు. నీరబ్ టెన్యూర్ ఎలా ఉంటుందో చూడాలి.


శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో సిఎస్ చాంబరులో తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు, విజయవాడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానాల వేద పండితుల ఆశిస్సుల మధ్య నీరబ్ కుమార్ ప్రసాద్ సిఎస్ గా బాధ్యతలు స్వీకరించారు.


బాధ్యతలు స్వీకరించిన పిదప ఆయన మాట్లాడుతూ ముందుగా సిఎస్ గా పనిచేసే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయనున్న ఎన్.చంద్రబాబు నాయుడు వారికి కృతజ్ణతలు తెలిపారు.


సహచర కార్యదర్శులు,శాఖాధి పతులు,ఇతర అధికారులు,సిబ్బంది సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్ళేందుకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా పనిచేసి వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలను క్షేత్ర స్థాయిలో మరింత సమర్ధవంతంగా అమలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లోను ముందంజలో నిలిపేందుకు తన సాయశక్తులా కృషి చేస్తానని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు.

ఈకార్యక్రమంలో జిఏడి కార్యదర్శి సురేశ్ కుమార్,స్పెషల్ సిఎస్ లు గోపాల కృష్ణ ద్వివేది,రజత్ భార్గవ,కె.విజయానంద్,పిసిసిఎఫ్ వై.మధుసూదన్ రెడ్డి,ముఖ్య కార్యదర్శులు కె.సునీత,ప్రవీణ్ ప్రకాశ్,ప్రద్యుమ్న,ఐటి కార్యదర్శి కె.శశిధర్,సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్, కార్యదర్శి,గనుల శాఖ కార్యదర్శి శ్రీధర్,పౌరసరఫరాలశాఖ కమీషనర్ హెచ్.అరుణ్ కుమార్,హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయకుమార్,దేవాదాయ శాఖ కమీషనర్ ఎస్.సత్య నారాయణ,ఇఎఫ్ఎస్టి స్పెషల్ సెక్రటరి డా.చలపతి రావు,ఇంకా పలువురు ఉన్నతాధికారులు, ఇతర అధికారులు,ఉద్యోగులు,ఉద్యోగ సంఘాల ప్రతినిధులు,సిఎస్ కార్యాలయ అధికారులు, సిబ్బంది సిఎస్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉద్యోగ ప్రస్ధానం:
బిటెక్.మెకానికల్ ఇంజనీరింగ్ చేసి సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ 1988లో పశ్చిమ గోదావరి జిల్లాలో అసిస్టెంట్ కలక్టర్(ట్రైనీ)గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టి 1990లో తూర్పు గోదావరి సబ్ కలక్టర్ గా,రంపచోడవరం సబ్ కలక్టర్ గాను,1991లో ఏటూరు నాగారం పిఓ ఐటిడిఏగా,1992లో కృష్ణా జిల్లా పిడి డిఆర్డిఏగాను పనిచేశారు.1993లో కృష్ణా జిల్లా జాయింట్ కలక్టర్ గా,1996లో ఖమ్మం కలక్టర్ గా,1998లో చిత్తూరు కలక్టర్ గా పనిచేశారు.

1999లో యువజన సంక్షేమశాఖ డైరెక్టర్ మరియు శాప్ ఎండిగా పనిచేసి 2000 ఏడాదిలో కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్ పై వెళ్ళారు.2005లో రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ విసి అండ్ ఎండిగా,2007లో పరిశ్రమల శాఖ కమీషనర్ గా,2009లో మత్స్యశాఖ కమీషనర్ గా,ఎపి ఎస్ హెచ్సి ఎండిగా పనిచేశారు.

అదే విధంగా 2012లో రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి సంస్థ కమీషనర్ గా,రాష్ట్ర విభజన అనంతరం 2014లో జిఏడి ముఖ్య కార్యదర్శి గాను,2015లో వైఏటిసి ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు.2017లో కార్మిక ఉపాధి కల్పన మరియు శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా,2018లో టిఆర్అండ్బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, 2019లో రాష్ట్ర పర్యావరణ,అటవీ,శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు.

అనంతరం 2019 నవంబరు నుండి చీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సిసిఎల్ఏ)గా పనిచేసి,2022 ఫిబ్రవరి 23 నుండి రాష్ట్ర పర్యావరణ,అటవీ,శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.



Read More
Next Story