రుషికొండ ప్యాలెస్లోకి ప్రజలను అనుమతిస్తారా?
ప్రభుత్వ ఆలోచనను వెల్లడించిన మంత్రి లోకేష్. నెలకు రూ.కోటి నిర్వహణ భారం. ప్రవేశ రుసుముతో ఈ భారాన్ని తగ్గించుకునే యోచన. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం.
రుషికొండ ప్యాలెస్.. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయింది ఈ ప్యాలెస్. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నివాసం కోసం సుమారు రూ.500 కోట్లు వెచ్చించి కట్టించినట్టు చెబుతున్న ఈ విలాసవంతమైన భవంతి ఆ ప్రభుత్వం గద్దెదిగిన తర్వాత వివాదాల్లో చిక్కుకుంది. కూటమి ప్రభుత్వం వచినప్పట్నుంచి అది నిరుపయోగంగా పడి ఉంది. ఇప్పుడా ప్యాలెస్ ను ప్రజలు సందర్శించేందుకు మార్గం సుగమం అవుతోందా?
విశాఖ సాగరతీరంలోని రుషికొండపై పర్యాటక శాఖ రిసార్టులుండేవి. వైసీపీ
ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రిసార్టులను కూల్చేసి 9.88 ఎకరాల్లో అత్యంత ఖరీదైన, సుందరమైన భవంతిని నిర్మించారు. రాజప్రాసాదాన్ని తలదన్నేలా ఏడు బ్లాకుల్లో భవనాలను కట్టారు. రెండోసారి తాను మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖను రాజధానిని చేసి అక్కడ నుంచే పాలన సాగిస్తానని జగన్మోహన్రెడ్డి పదేపదే చెబుతూ వచ్చారు. అందుకనుగుణంగానే రుషికొండపై సౌధాలను నిర్మించారన్న ప్రచారం ఉంది. దీనికి సుమారు రూ.500 కోట్లు వెచ్చించారు. అప్పటివరకు ఎంతటి వారైనా దాని ఛాయలకు కూడా కట్టడి చేశారు. దీని నిర్మాణం పూర్తయ్యే సరికి వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక తొలుత భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆ ప్యాలెస్లోకి మీడియాతో అడుగుపెట్టడం ద్వారా ఆ సౌధంలో ఉన్న సౌకర్యాలు, సౌందర్యాలు బాహ్య ప్రపంచానికి తేటతెల్లం అయ్యాయి. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వెళ్లి ఆ ప్యాలెస్ తీరుతెన్నులను చూసి నోరెళ్లబెట్టారు. అనంతరం ఈ భవంతిలో దేనికెంత ఖర్చు చేశారో ఓ లిస్టును విడుదల చేశారు. దీంతో అప్పటివరకు అత్యంత రహస్యంగా ఉన్న ఈ రాజప్రాసాదం గురించి టీవీల్లో చూసిన వారు ఔరా! అంటూ అవాక్కయ్యారు.
ఇన్నాళ్లూ ఎటూ తేల్చుకోలేని కూటమి సర్కారు..
ముఖ్యమంత్రి చంద్రబాబు రుషికొండ ప్యాలెస్ లోకి అడుగు పెట్టిన తర్వాత దీనిని దేనికి ఉపయోగించాలో మంత్రులు, నిపుణులు, మేథావులు, ప్రజలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని మూడు నెలల క్రితం చెప్పారు. అప్పట్నుంచి దీనిపై ఎటూ తేల్చుకోలేక పోయారు. దీంతో ఈ భవంతిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తాజాగా లోకేష్ ఏమన్నారంటే..
ఇటీవల విశాఖ పర్యటనకు వచ్చిన మంత్రి లోకేషను రుషికొండ ప్యాలెస్పై ప్రభుత్వ నిర్ణయాన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనిపై తొలుత ఆయన దాన్నేం ఏచేయాలో మాకే అర్థం కావడం లేదు.. అంటూనే 'ప్రజల కోసం ఈ ప్యాలెస్ను ఓపెన్ చేయాలని అనుకుంటున్నాం' అని వెల్లడించారు. దీనికి కొనసాగింపుగా ' ఒక ముఖ్యమంత్రి నివాసానికి రూ.వెయ్యి కోట్లు వృధా చేస్తారా? ప్యాలెస్ కట్టడానికి రూ.500 కోట్లు, ఎన్జీటీ పెనాల్టీ కింద రూ.200 కోట్లు, కూల్చివేసిన పాత భవనాల విలువ రూ.300 కోట్లు కలిపి రూ.వెయ్యి కోట్లు దుర్వినియోగం చేశారు. ఒక వ్యక్తి బతకడానికి ఇన్ని కోట్లు వెచ్చిస్తారా? అందుకే.. ప్రజా ధనాన్ని ఎలా దుర్వినియోగం చేశారో ప్రజలు చూడాలి. వారికి తెలియాలనే ఉద్దేశంతోనే ప్రజలను అందులోకి ప్రవేశం కల్పించాలని నిర్ణయించాం' అని వివరించారు. దీంతో త్వరలోనే జగన్ నిర్మించిన ఈ రుషికొండలోకి జనాన్ని అనుమతించడం ఖాయమని తేలిపోయింది. కాగా ఈ ప్యాలెస్ నిర్వహణ వ్యయం నెలకు రూ.కోటి అవుతోంది. అందువల్ల ఈ ప్యాలెస్ను సందర్శించాలనుకునే వారి నుంచి ప్రవేశ రుసుము వసూలు చేసి నిర్వహణ భారాన్ని తగ్గించుకోనున్నట్టు తెలుస్తోంది.
ఈ ప్యాలెస్లో ఇవన్నీ చూడొచ్చు..
ప్రజలను రుషికొండ ప్యాలెస్ లోకి అధికారికంగా అనుమతిస్తే అక్కడున్న అత్యాధునిక సదుపాయాలను చూడొచ్చు. ఈ ప్యాలెస్లో ప్రెసిడెన్షియల్ స్యూట్, స్యూట్ రూములు, డీలక్స్ స్యూట్లు, కాన్ఫరెన్స్ హాళ్లు, బాంకెట్ హాళ్లు, రిక్రియేషనల్ లాంజి, బిజినెస్ సెంటర్, ప్రైవేటు స్కూట్ రూములు, రెస్టారెంట్లు వంటివి ఉన్నాయి. నభూతో అన్నట్టు.. బాత్ టబ్ లు, ఇటాలియన్ మార్బుల్ గోడలు, గచ్చులు, సువిశాల పడక గదులు, కారిడార్లు, పువ్వులు, ఆకులను పోలిన ఐదు రెక్కల సీలింగ్ ఫ్యాన్లు, షాండ్లియర్లు, ఎన్నెన్నో కళాఖండాలు, మసాజ్ టేబుల్, ఇంపోర్టెడ్ సోఫాలు, మంచాలు, కుర్చీలు, మతి పోగొట్టే పరదాలు, గృహాలంకరణ వస్తువులు ఇలా ఒకటేమిటి? అన్ని వినూత్నంగా, విభిన్నంగా దర్శనమిస్తాయి. అంతేనా? ల్యాండ్ స్కేపింగ్, హోం థీయేటర్ స్క్రీన్, అడ్వాన్స్డ్ సౌండ్ సిస్టం
ఇంకా మరెన్నో కళ్లు చెదిరే సదుపాయాలున్నాయి. ఇక ఈ ప్యాలెస్ కి జనాన్ని అనుమతించడమే తరువాయి!