పిడుగు పడిన ప్రమాదంలో ఆదివారం ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీ ట్యాంకరుకు మంటలు అంటుకున్న సంగతి తెలిసిందే. పిడుగు ధాటికి ట్యాంకరు పైకప్పు ఊడి కింద పడింది. ఆ వెనువెంటనే మంటలు ఎగసిపడ్డాయి. ట్యాంకరు ఉంచి ఎగసి పడుతున్న మంటలను అదుపు చేయడానికి పదుల సంఖ్యలో అగ్నిమాపక శకటాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. తొలుత విశాఖ నగరంతో పాటు పారిశ్రామిక వాడలోని అగ్నిమాపక శకటాలు ప్రమాద స్థలానికి హుటాహుటీన వెళ్లాయి. వీటికి తోడు తూర్పు నావికాదళం కూడా వాటికి సహాయంగా రంగంలోకి దిగింది. అత్యాధునిక ఫైర్ ఫైటర్లు గంటల తరబడి ప్రయత్నించడంతో అర్థరాత్రి దాటాక పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది. పిడుగుపాటుకు గురైన సమాయానికి స్టోరేజి ట్యాంకరులో 7,500 కీలోలీటర్ల మిథనాల్ ఉంది. అగ్ని కీలల్లో ఐదు వేల కిలోలీటర్ల మిథనాల్ కాలిపోయింది. ఈలోగా పెట్రో రంగ నిపుణులు ట్యాంకు దిగువ భాగం నుంచి అతి జాగ్రత్తగా ట్యాంకులో నుంచి కొంతమేర మిథనాల్‌ను పైపుల ద్వారా తరలించగలిగారు. అయినప్పటికీ ఇంకా మిగిలి ఉన్న సుమారు రెండు వేల కిలోలీటర్ల మిథనాల్ మండుతూనే ఉంది.
మంటలను అదుపులోకి తెస్తున్న అగ్నిమాపక శకటాలు
రంగంలోకి నేవీ హెలికాప్టర్..
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ నేవీకి చెందిన సీకింగ్ హెలికాప్టర్‌ను సోమవారం రంగంలోకి దించింది. ఈ హెలికాప్టర్ అండర్‌స్లంగ్ ఫైర్ బకెట్‌తో మంటలను ఆర్పుతోంది. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న ఐఎన్‌ఎస్ డేగా నుంచి పెద్ద మొత్తంలో నీరు, ఫోమ్ (నురుగ)ను తెచ్చి మంటలు ఎగసిపడుతున్న ట్యాంకరు పై భాగం నుంచి జార విడుస్తోంది. దీంతో సోమవారం సాయంత్రానికి కొంతమేర అగ్ని కీలలకు తగ్గుముఖం పట్టాయి. మిథనాల్ ట్యాంకరు నుంచి పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చే వరకు ఫైర్ ఫైటింగ్‌ను కొనసాగిస్తాం’ అని నేవీ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. మరోవైపు అగ్నిమాపక శకటాలు కూడా మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ట్యాంకరులో మిగిలి ఉన్న మిథనాల్ పూర్తిగా కాలిపోయే మంటలు కొనసాగుతాయని, ఆపై అగ్నిజ్వాలలు పూర్తిగా అదుపులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.
కంపెనీ పరిసరాల్లో 50 స్టోరేజీ ట్యాంకులు..
ఈస్ట్ ఇండియా కంపెనీ పరిసరాల్లో దాదాపు 50 వరకు స్టోరేజీ ట్యాంకులున్నాయి. ఇతర దేశాల నుంచి వివిధ రకాల ముడి చమురు, అనుబంధ ఉత్పత్తులను కొన్ని కంపెనీలు విశాఖ పోర్టుకు దిగుమతి చేసుకుని ఇక్కడ నుంచి బయటకు తరలిస్తుంటాయి. విశాఖ పోర్టు నుంచి ఒకేసారి వేల కిలోలీటర్ల రవాణా సాధ్యం కాదు కాబట్టి పోర్టు ఏరియాలోనే ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీలో నిల్వ చేస్తుంటారు.
మిథనాల్‌కు మండే స్వభావం డీజిల్, పెట్రోల్‌తో పోల్చుకుంటే తక్కువగా ఉంటుంది. మిథనాల్ ఆయిల్ కామన్ సాల్వెంట్ కావడంతో దీని నుంచి పలు రకాల ఉత్పత్తులను తయారు చేస్తారు. దీనికి మండే గుణం ఉన్నా మంటల వల్ల కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఆక్సిజన్‌గా మారుతున్నందున కొంతమేర ప్రమాద తీవ్రత తగ్గుతుందని సంబంధిత నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ప్రమాదం సంభవించిన ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీకి సమీపంలోనే డీజిల్ ట్యాంకులు కూడా ఉన్నాయి. మంటలు ఈ డీజిల్ ట్యాంకులకు అంటుకోకుండా అగ్నిమాపక సిబ్బంది తక్షణ చర్యలు తీసుకున్నారు. అలాగే దీనికి కాస్త చేరువలో హెచ్‌పీసీఎల్ ఎల్‌పీజీ ప్రాజెక్టు, హెచ్‌పీసీఎల్ అడిషనల్ ట్యాంకు ప్రాజెక్టు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)లు ఉన్నాయి. ఈ ట్యాంకు మంటలు వాటికి అంటుకున్నా, లేక ఒకవేళ ఇదే పిడుగు అక్కడ పడినా ఊహకు అందని పెను విస్ఫోటం జరిగేది. భారీ ప్రాణ నష్టం కూడా వాటిల్లేది. కాగా ట్యాంకుపై పిడుగు పడే సమయంలో ఆ పరిసరాల్లో సుమారు 80 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. అదృష్టవశాత్తూ వారికేమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.