
కర్నూలులోనే జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి
రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు.
జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కర్నూలు జిల్లాలోనే ఏర్పాటు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ని కోరడాన్ని రాయలసీమ సాగునీటి సాధన సమితి స్వాగతిస్తోందని బొజ్జా దశరథరామిరెడ్డి తెలిపారు.
శుక్రవారం నంద్యాల పట్టణంలోని రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ … ఉమ్మడి కర్నూలు జిల్లాలోని జూపాడు బంగ్లా ప్రాంతంలో ప్రభుత్వానికి చెందిన సుమారు 1,800 ఎకరాల విస్తారమైన భూమి అందుబాటులో ఉందని, అలాగే కేసీ కెనాల్, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీటి వసతి కల్పించే పూర్తి అవకాశం ఉన్న ఈ ప్రాంతంలోనే ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి గతంలోనే ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అనేక రకాల పంటలు, ఉద్యానవన పంటలు పండే రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయ విద్యా, పరిశోధనలకు విస్తృత అవకాశాలు ఉన్నప్పటికీ, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయకుండా కేవలం 100 ఎకరాల భూమి మాత్రమే ఉన్న గుంటూరు జిల్లా “లాం” ఫార్మ్‌కు తరలించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఈ నేపద్యంలో రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అనేక కార్యక్రమాలు నిర్వహించి, ప్రభుత్వానికి పలు మార్లు విజ్ఞాపన పత్రాలు అందించిన విషయాన్ని కూడా బొజ్జా గుర్తు చేశారు.
జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పడితే, దానికి అనుబంధంగా వ్యవసాయ కళాశాలలు, పరిశోధనా కేంద్రాలు ఏర్పడి రాయలసీమ వ్యవసాయ రంగానికి దిశానిర్దేశం చేసే కేంద్రంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉందని బొజ్జా వివరించారు.
ఏదేమైనా, ఇప్పటికైనా ముఖ్యమంత్రి జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం అంశాన్ని కేంద్రం ముందు ఉంచిన నేపథ్యంలో, ఈ విశ్వవిద్యాలయాన్ని తప్పనిసరిగా రాయలసీమలో, ముఖ్యంగా జూపాడు బంగ్లా ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నామని బొజ్జా దశరథరామిరెడ్డి తెలిపారు.
అదేవిధంగా, రాయలసీమ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి, జూపాడు బంగ్లా వద్దే ఈ జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే బాధ్యత తమదేనని గుర్తించాలి అని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు ఏరువ రామచంద్రారెడ్డి, చెరుకూరి వెంకటేశ్వరనాయుడు, న్యాయవాది అసదుల్లా, భాస్కర్ రెడ్డి, జానోజాగో మహబూబ్ భాష, కొమ్మా శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Next Story

