అరకుగా మారిన నర్సీపట్నం పార్లమెంట్
నర్సీపట్నం తొలి ఎస్టీ పార్లమెంట్. తరువాత పార్వతీపురం ఏర్పడింది. అనంతరం అరకును ఏర్పాటు చేశారు. వై కిశోర్‌చంద్రదేవ్ కేంద్రంలో మంత్రిగా పనిచేశారు
తొలిసారి ఎన్నికలు జరిగినప్పుడు అరకు పార్లమెంట్ స్థానంలో నర్సీపట్నం (ఎస్టీ) ఉండేది. 1952లో జరిగిన ఎన్నికల్లో ఎం మత్సరాజు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా కారం బాపన్న దొర స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 1,347 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి మత్సరాజు గెలుపొందారు. ఆయన ఆ తరువాత గూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. నర్సీపట్నం ఐదేళ్లు మాత్రమే పార్లమెంట్‌గా ఉంది. ఆ తరువాత 1957లో గొలుగొండ ద్విసభ్య నియోజకవర్గంగా ఏర్పడింది. ఎంఎస్ మూర్తి, కెవి పడాల్‌లు కాంగ్రెస్ తరపు పోటీ చేయగా సీపీఐ తరపున గోవిందరావు, ఎస్ సీతారామయ్యలు పోటీ చేశారు. ఒక సీట్లో మూర్తి, మరో సీట్లో పడాల్ గెలుపొందారు. పడాల్ ఒకసారి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. మూర్తి అనకాపల్లి నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ఆ తరువాత గొలుగొండ రద్దయింది.
1952 నుంచి పార్వతీపురం పార్లమెంట్‌గా ఉంది. ఇక్కడి నుంచి మొదటిసారి ఎన్ రామశేషయ్య స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఎస్‌ఎస్ పాత్రుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పుడు కాంగ్రెస్ కానీ, సీపీఐ కానీ ఇక్కడ పోటీ చేయలేదు. రామశేషయ్య గెలిచి పాత్రుడు ఓడిపోయారు. ఆ తరువాత 1957లో జరిగిన ద్విసభ్య లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఇద్దరు పోటీ పడ్డారు. బిడ్డిక సత్యనారాయణ, వివి గిరి పోటీ పడగా సత్యనారాయణ గెలుపొందారు. డి సూరిదొర, వి కృష్ణమూర్తి నాయుడు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ పడగా సూరిదొర గెలిచారు. ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు రెండు సీట్లు గిరిజనులే గెలుచుకోగా జనరల్ సీట్లలో పోటీ చేసిన వివి గిరి, కృష్ణమూర్తి నాయుడులు ఓటమి చెందారు. ఆ తరువాత రోజుల్లో వివి గిరి కేంద్రమంత్రిగా, రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. పార్వతీపురంలో కాంగ్రెస్ పార్టీ నాలుగు సార్లు, కాంగ్రెస్ ఐ నాలుగు సార్లు, తెలుగుదేశం పార్టీ రెండు సార్లు, వైఎస్సార్ కాంగ్రెస్ రెండు సార్లు గెలిచాయి.
1962లో తిరిగి బి సత్యనారాయణ కాంగ్రెస్ తరపున పోటీ చేసి స్వతంత్ర పార్టీ అభ్యర్థి వి నరసింహారావును ఓడించారు. ఆ తరువాత 1967లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వి నరసింహారావు గెలవగా కాంగ్రెస్ తరపున పోటీ చేసిన బి సత్యనారాయణ ఓడిపోయారు. 1971లో వారిద్దరి మధ్యే పోటీ జరిగింది. కాంగ్రెస్ నుంచి బి తస్యనారాయణ గెలవగా స్వతంత్ర పార్టీ నుంచి వి నరసింహారావు ఓడిపోయారు. 1977, 1980, 1984ల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వైరిచర్ల కిశోర్‌చంద్రదేవ్ పోటీ చేసి టీడీపీ మిత్రపక్షంగా గెలిచారు. విచిత్రం ఏమిటంటే మూడు సార్లు మూడు పార్టీల తరపున పోటీ చేశారు. 77లో కాంగ్రెస్ తరపున పోటీ చేయగా 80లో కాంగ్రెస్ యు తరపున పోటీ చేశారు. ఆ తరువాత కాంగ్రెస్ ఎస్ తరపున పోటీ చేశారు. చరణ్‌సింగ్ క్యాబినెట్‌లో కొద్దికాలం మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. అనంతరం 1989, 1991ల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కిశోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ ఎస్ తరపున పోటీ చేయగా ఆయనపై శత్రుచర్ల విజయరామరాజు కాంగ్రెస్ ఐ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత కిశోర్‌చంద్రదేవ్ కాంగ్రెస్ ఐలో చేరి రాజ్యసభకు ఎంపికయ్యారు. 2004లో పార్వతీపురం నుంచి 2009లో కొత్తగా ఏర్పడిన అరకు నుంచి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికయ్యారు. మొత్తం ఐదు సార్లు గెలిచారు. 2011లో కేంద్ర గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయలేదు. తిరిగి 2019లో జరిగిన ఎన్నికల్లో గొడ్డేటి మాధవిపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గొడ్డేటి మాధవి మొదటిసారి పోటీ చేసి విజయం సాధించారు. మాధవి మాజీ ఎమ్మెల్యే దేముడు కుమార్తె. అరకు నియోజకవర్గంగా ఏర్పడిన తరువాత మూడు సార్లు ఎన్నికలు జరిగితే రెండుసార్లు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. పార్వతీపురం ఎస్టీ పార్లీమెంట్ నియోజకవర్గం 2009లో రద్దయింది. ప్రస్తుతం అరకు పార్లమెంట్‌గా కొనసాగుతోంది.
Next Story