ప్రతి జిల్లాలో నార్కోటిక్ కంట్రోల్ సెల్
గంజాయి, మాదక ద్రవ్యాలను అంతం చేసేందుకు ప్రతి జిల్లాలో నార్కోటిక్ కంట్రోల్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని ఏపీ హోమ్ మంత్రి అనిత చెప్పారు.
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో నార్కోటిక్ కంట్రోల్ సెల్‌ను ఏర్పాటు చేస్తామని తద్వారా గంజాయి, డ్రగ్స్ లేకుండా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ హోమ్ శాఖ మంత్రి అనిత చెప్పారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. డ్రగ్స్ కేసులను చేదించే విధంగా పోలీస్ వ్యవస్థను మరింతగా పటిష్టం చేస్తామన్నారు. అంతేకాకుండా స్టేట్ టాస్క్ ఫోర్స్ విభాగం ద్వారా నిఘా వ్యవస్థను మెరుగు పరుస్తామన్నారు. డ్రోన్లు, శాటిలైట్లు, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఏఐ ఆధారిత సీసీటీవీలను వినియోగంలోకి తెస్తామని, తద్వారా డ్రగ్స్‌ను కట్టడి చేస్తామన్నారు. గంజాయి సాగుపైనా, మాదక ద్రవ్యాలపైన టెక్నాలజీని ఉపయోగించి ఉక్కు పాదం మోపుతామన్నారు. గంజాయి స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు వ్యూహాత్మక చెక్ పోస్టులు, హాట్ స్పాట్‌లు, ప్రత్యేక ఎన్టీపీఎస్ బీట్లు ఏర్పాటు చేస్తామన్నారు. విద్యా సంస్థల నుంచి గంజాయిని, అంతం చేస్తామన్నారు. గంజాయి, డ్రగ్స్ ఆచూకీ తెలిపిన వారికి ప్రత్యేక బహుమతులు, రివార్డులిస్తామని, దీని కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేస్తామన్నారు. సైబర్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి డ్రగ్ నెట్‌వర్క్‌ను బద్దలు కొడతామన్నారు.