లోకేష్ తమిళనాడు టూరుపై పేలుతున్న పంచ్‌లు
x

లోకేష్ తమిళనాడు టూరుపై పేలుతున్న పంచ్‌లు

తమిళనాడులో బీజేపీ తరపున ప్రచారానికి సిద్ధమవుతున్న నారా లోకేష్.. విమర్శలు, ప్రశ్నలు, పంచులు వేస్తున్న నెటిజన్స్. అసలు విషయం ఏంటంటే..



టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. తమిళనాడు కోయంబత్తూరుకు బయలుదేరారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన తమిళనాడులో బీజేపీ తరపున ప్రచారం చేయనున్నారు. దేశ, రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని లోకేష్.. తమిళనాట ప్రచారం చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈరోజు షెడ్యూల్ ఇలా ఉంది. ఆయన గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో కోయంబత్తూరుకు వెళ్లనున్నారు. ఆయన ఆయన బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలైతో సమావేశమవుతారు. ఆ తర్వాత కోయంబత్తూరులో బీజేపీ తరపున పోటీకి దిగనున్న అభ్యర్థి అన్నామలైకు మద్దతుగా లోకేష్.. ప్రచారం చేస్తారు. తెలుగువారు ఎక్కువగా స్థిరపడిన ప్రాంతాల్లో లోకేష్ ప్రచారం కొనసాగనుంది. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి 7 గంటలకు పీలమేడు ప్రాంతంలో బీజేపీ నిర్వహించనున్న బహిరంగ సభలో లోకేష్ పాల్గొంటారు. అదే విధంగా శనివారం ఉదయం 8 గంటలకు సింగనల్లూర్ ఇందిరా గార్డెన్స్‌లో తెలుగు పారిశ్రామివేత్తలతో లోకేష్ సమావేశమవుతారు. అందులో బీజేపీ గెలుపుకు సహకరించాలని, అందుకు అన్నామలైను ఎంపీ ఎన్నుకోవాలని అక్కడి తెలుగువారిని కోరనున్నారు. ప్రచారం పూర్తయిన వెంటనే ఆయన తిరిగి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. ఆ తర్వాత శనివారం సాయంత్రం మంగళగిరిలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమాలకు హాజరవుతారు. అయితే లోకేష్ తమిళనాడు పర్యటనపై తెగ విమర్శలు వస్తున్నాయి.

మంగళగిరిలోనే గతిలేని లోకేష్.. తమిళనాడుకు వెళ్లి ఏం ఉద్దరిస్తారట అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వైసీపీ నేతలు కూడా లోకేష్ తమిళనాడు పర్యటనపై దొరికిందే ఛాన్స్ అన్నట్లు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేలుస్తున్నారు. మంగళగిరిలోనే గతిలేనమ్మ.. తమిళనాడులో ఏం చేస్తుందంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. ‘‘2024లో ఎన్నికల తాను బరిలోకి దిగనున్న మంగళగిరి ఎమ్మెల్యే నియోజకవర్గంలోనే లోకేష్ విజయం ప్రశ్నార్థకం. గట్టిగా ప్రచారం చేసినా కూడా అవకాశాలు తక్కువే. 2014లో గెలిచి మూడు శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన లోకేష్ 2019 ఎన్నికలప్పుడు చతికిలబడ్డారు. వైసీపీ అభ్యర్థి చేతిలో చిత్తయ్యారు. త్వరలో జరిగే ఎన్నికల్లో మరోసారి ఆయన మంగళగిరి నుంచే పోటీ చేయనున్నారు. కానీ ఈసారి కూడా లోకేష్ గెలుస్తారన్న నమ్మకం టీడీపీ కేడర్‌లోనే లేదు. అటువంటి లోకేష్.. తన సీటుకే గ్యారెంటీ లేదు కానీ పక్క రాష్ట్రంలో పక్క పార్టీ నేత సీటుకు భరోసా కల్పించడానికి సిద్ధమవుతున్నారు’’అని విమర్శిస్తున్నారు. మరికొందరైతే వ్యంగ్యాస్త్రాలు కూడా మూకుమ్మడిగా సంధిస్తున్నారు.

‘‘తమిళనాట ప్రచారానికి పరమ పరాక్రమవంతుడు లోకేష్ సిద్ధమయ్యాడు. ఆయన వచ్చి తమిళంలో ప్రసంగాలు ఇచ్చి పడేస్తుంటే.. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక తమిళ తంబీలు తెల్ల ముఖం వేస్తారు. తినడానికి తిండి లేదు కానీ వంద మందికి అన్న దానం చేయడానికి బయలుదేరాడంట వెనకాటికి లోకేష్ లాంటి వ్యక్తే. ఇప్పుడు మంగళగిరిలో తన విషయమే ఖరారు కాలేదు కానీ.. తమిళనాడులో ప్రభంజనంలా మారుతున్న అన్నామలైకి ఓటు వేయాలని ఈ రాజకీయ ఉద్దండుడు వెళ్లి కోరతాడట. ఈయన ప్రచారం చేస్తే కానీ అన్నామలైకి పడే ఓట్లు కూడా వెనక్కి వెళ్లి అలమరాలో దాక్కోవు. తెలుగులో ఒక సామెత ఉంది.. ముందు ఇల్లు చక్కబెట్టి ఆ తర్వాత ఊరు చక్కబెట్టాలని, ఈయనకు ఇంటికే గతి లేదు కానీ పక్క ఊరిని చక్కబెట్టడానికి వెళ్తున్నాడు’’ అంటూ సోషల్ మీడియాలో లోకేష్‌పై జోకులు పేల్తున్నాయి. అంతేకాకుండా ప్రశ్నల మిషన్ గన్స్ కూడా నిర్విరామంగా పేల్తున్నాయి. అసలు తమిళనాడు కోయంబత్తూరులో ప్రజల సమస్యలు లోకేష్‌కు తెలుసా? మంగళగిరిలో సమస్యలైనా ఆయనకు తెలుసా? లోకేష్‌కు తెలుగే రాదు.. తమిళనాడులో ప్రసంగాలు ఇచ్చేంత తమిళం వచ్చా? అక్కడ ఈయన ఎవరికి తెలుసని వెళ్లి ప్రచారం చేస్తారు? ఈయన ముఖం చూసి ఏ ఒక్కరైనా గుర్తు పడతారా? అంటూ వ్యంగ్యంతో కూడా ప్రశ్నలను సంధిస్తున్నారు. మరి వీటికి లోకేష్ ఎలా సమాధానమిస్తారో చూడాలి.


Read More
Next Story