ఎన్నికల ప్రచారంలోకి నారా బ్రాహ్మణి.. భర్తల కోసం భార్యల పాట్లు
x

ఎన్నికల ప్రచారంలోకి నారా బ్రాహ్మణి.. భర్తల కోసం భార్యల పాట్లు

భర్తల గెలుపు కోసం భార్యలు బరిలోకి దిగారు. జోరుగా ఎన్నికల ప్రచారాలు కొనసాగిస్తున్నారు. మరి వారి ప్రచారాలు భర్తల గెలుపు దోహదపడతాయా..


ఆంధ్రలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ప్రధాన పార్టీలన్నీ విజయమే లక్ష్యంగా ప్రచారాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భర్తల గెలుపు కోసం భార్యలు కూడా రంగంలోకి దిగారు. చంద్రబాబు కోసం నారా భువనేశ్వరి ప్రత్యేక కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు నిర్వహిస్తూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా అత్త బాటలోనే నారా బ్రాహ్మణి కూడా ఎంటర్ అయ్యారు. తన భర్త నారా లోకేష్ విజయం కోసం మంగళగిరిలో ప్రచారం ప్రారంభించారు. ప్రజల కోసం నారా చంద్రబాబు, నారా లోకేష్ ఏం చేశారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తారు. అన్న విషయాలను ఆమె ప్రజలకు, మహిళలకు వివరించారు.


‘‘మహిళా సాధికారతే నారా చంద్రబాబు, నారా లోకేష్ లక్ష్యం. ప్రజల కోసం పని చేయడంలో చంద్రబాబుకు ఎవరూ సాటిరారు. రాష్ట్ర అభివృద్ధి బాబుతోనే సాధ్యం’’ అని నారా బ్రాహ్మణి వ్యాఖ్యానించారు. తాజాగా ఆంధ్ర ఎన్నికల ప్రచారంలోకి ఎంట్రీ ఇచ్చిన నారా బ్రాహ్మణి శనివారం మంగళగిరిలోని యర్రబాలెంలో ప్రచారం చేశారు. ఇందులో భాగంగా సంధ్య స్పైసెస్ కంపెనీలోని కూలీలతో ఆమె మాట్లాడారు. ఈ సందర్బంగానే మహిళా సాధికారత, అభివృద్ధి, కూలీలు బతుకులు మారాలంటే చంద్రబాబు గెలవాలని చెప్పారు. టీడీపీ హయాంలో మహిళలకు ఎంతో సంక్షేమం జరిగిందని, ఆస్తిలో మహిళలకు కూడా సమాన హక్కు ఉంటుందని చెప్పిన నేత ఎన్‌టీఆర్ అని ఆమె గుర్తు చేశారు. అదే విధంగా మహిళా సాధికారతే ధ్యేయంగా, రాష్ట్ర అభివృద్ధే ఆశయంగా సాగే నాయకుడు చంద్రబాబు అని ఆమె వివరించారు.

‘‘డ్వాక్రా సంఘాల్లో ప్రస్తుతం కోటి మంది మహిళలు ఉన్నారు. చిన్న గ్రూపులుగా మొదలైన డ్వాక్రా ఇప్పుడు ఈ స్థాయిలో ఉందంటే అందుకు చంద్రబాబే కారణం. ఉమ్మడి ఆంధ్రలో ఒక మహిళ ప్రతిభా భారతికి స్పీకర్ పదవి ఇచ్చిన సీఎం ఆయనే. మహిళల విద్యకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకులు కాకూడదని ఆలోచించి, అందుకోసం ‘కలలకు రెక్కలు’ కార్యక్రమం తీసుకొచ్చారు. ఆ పథకం ద్వారా ఎంత పెద్ద చదువుకైనా బ్యాంకుల ద్వారా అతి తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలు, ప్రొఫేషనల్ కోర్సులను ప్రవేశపెట్టి యువతకు ఎన్నో అవకాశాలు కల్పించిన ఘన చంద్రబాబుది. పేద ప్రజలకు కష్టాలు కనిచూపు మేర కనిపించకూడదని కలలు కన్న సీఎం చంద్రబాబు. ఆ లక్ష్యాన్ని సాధించడానికే ఆయన ఈసారి సూపర్ 6 తో మీ ముందుకు వస్తున్నారు. మహిళల ఆదాయాన్ని పెంచి వారికి ఆర్థిక చేయూత అందించాలని నారా లోకేష్ కూడా స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేస్తున్నారు. మంగళగిరి ప్రజల కోసం సొంత నిధులతో 29 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు లోకేష్. రాబోయే ఎన్నికల్లో మీరంతా వారిని ఆశీర్వదిస్తే మరింత మెరుగైన సంక్షేమం అందుతుంది’’ అని బ్రాహ్మణి తెలిపారు.


బ్రాహ్మణి శ్రమ ఫలించేనా?

మంగళగిరిలో 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున నారా లోకేష్ బరిలోకి దిగనున్నారు. ఆయనను వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య ఢీకొట్టనున్నారు. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలని లోకేష్ కసరత్తులు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేతిలో 5,337 ఓట్ల తేడాతో లోకేష్ ఓటమి పాలయ్యారు. దానికి తోడు ఈసారి తనపై మహిళ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎట్టిపరిస్థితుల్లో ఓడిపోకూడదని లోకేష్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే తన ప్రచార జోరును పెంచేశారు. ఇప్పుడు ఆయనకు మద్దతుగా నారా బ్రాహ్మణి కూడా బరిలోకి దిగారు. దీంతో నారా బ్రాహ్మణి ప్రచారం లోకేష్‌కు ఎంతవరకు కలిసి వస్తుంది? లోకేష్‌ను గెలుపు మెట్టు ఎక్కిస్తుందా లేదా? అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. అయితే వీటికి సమాధానం తెలియాలంటే మనం జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.

ప్రచారంలోకి ఎంట్రీ ఇవ్వనున్న భారతి

అతి త్వరలోనే వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గెలుపు కోసం ఆయన భార్య భారతి కూడా ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నెల 25న జగన్.. పులివెందులలో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్త ప్రచారంలో బిజీ కానున్నారు. ఈ నేపథ్యంలో కడపలో పార్టీ ప్రచారా బాధ్యతలను భారతీ చేపట్టనున్నారని, జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ ర్యాలీలు, సభలు నిర్వహించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే విధంగా ఎప్పుడు ఎక్కడ సభలు నిర్వహించాలి అన్న విషయాలపై ఆమె ఇప్పటికే పార్టీ పెద్దలతో కూడా చర్చలు చేస్తున్నారని సమాచారం.

తమ వల్ల కాదనే భార్యల సహాయమా!

ఎన్నికల ప్రచారాల్లో భార్యలు ఎంట్రీ ఇవ్వడంతో అనేక వాదనలు వినిపిస్తున్నాయి. తమ గెలుపుపై సదరు నేతలకు నమ్మకాలు లేవని, అందుకనే మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి తమ భార్యల సహాయం కోరి, వారిని ప్రచార బరిలోకి దించుతున్నారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ప్రజలకు రెండు ప్రధాన పార్టీలపై పెద్దగా నమ్మకాలు లేవని, ఆ విషయం గ్రహించే ఆయా నేతలు తమ భార్యల సహాయం కోరుతున్నారని, మహిళా సింపతి ద్వారా ఎన్నికల గెలవాలని అనుకుంటున్నారన్న విమర్శలు కూడా ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.

Read More
Next Story