నాని..చిన్నిల లడాయి
x

నాని..చిన్నిల లడాయి

సోషల్‌ మీడియా వేదికగా కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చుకుంటున్న కేశినేని సోదరులు.


అన్నతమ్ముడిని చార్లెస్‌ శోభరాజ్‌ అంటే..తమ్ముడు అన్నను చిప్‌ దొబ్బిన సైకో అంటూ దిమ్మతిరి మైండ్‌ బ్లాంక్‌ అయ్యే కౌంటర్‌ ఇచ్చాడు. ఇది సినిమా స్టోరీ కాదు. నడుస్తున చరిత్ర. ఫ్యామిలీ పొలిటికల్ రివేంజ్ ఎపిసోడ్.

కేశినేని శ్రీనివాస్‌ అన్న. కేశినేని శివనాథ్‌ తమ్ముడు. కేశినేని శ్రీనివాస్‌ నానిగా ఫేమస్‌. కేశినేని శివనాథ్‌ చిన్నిగా సుపరిచితులు. అన్న నాని మాజీ ఎంపీ. తమ్ముడు సిట్టింగ్‌ ఎంపీ. ఇద్దరూ సొంత సోదరులే. ఒకే తల్లి కడుపున పుట్టిన వారే. 2022 వరకు ఇద్దరూ కలిసే ఉన్నారు. చివరి వరకు అలాగే ఉంటారని అంతా భావించారు. కానీ ఆధపత్య పోరు ఇద్దరినీ విడదీశాయి. వాప్యార లావాదేవీలు ఇరు కుటుంబాలను ఎడబాటు చేశాయి.

2024 నాటికి ప్రత్యర్థులుగా మారారు. ఒకరిపై ఒకరు కాలువు దువ్వుకున్నారు. తొడలు కొట్టి మీసాలు మెలేశారు. అన్న వైసీపీ నుంచి తమ్ముడు టీడీపీ నుంచి బరిలోకి దిగారు. హోరా హోరీగా తలపడ్డారు. కానీ ఎన్నికల రింగ్‌లో తమ్ముడు గెలిచాడు. అన్న ఓడాడు. అన్న ఇక పాలిటిక్స్‌ చేయను అన్నాడు. రాజకీయాలకు దూరంగా ఉంటానన్నాడు. ఏడాది పాటు అలాగే ఉన్నాడు. ఇప్పటికీ అలానే ఉన్నాడు. కానీ తప్పు చేస్తే సహించను అంటున్నాడు. అవినీతిని ప్రశ్నిస్తా అంటున్నాడు. కూటమి ప్రభుత్వం, తమ్ముడు చిన్ని అక్రమాలకు పాల్పడుతున్నారని గళం విప్పడం మొదలు పెట్టాడు. ఇసుక వ్యాపారం.. ఫ్లై యాష్‌ తోలకం.. గ్రావెల్‌ అమ్మకం.. భూ దందాలు.. బ్రోకరేజీలు.. పేకాట గృహాలు.. రేషన్‌ బియ్య మాఫియా దగ్గర వసూళ్లకు పాల్పడుతూ విజయవాడలోని ఎన్టీఆర్‌ భవన్‌ను శోభరాజ్‌ భవన్‌గా మార్చేశారని తమ్ముడి ఎంపీ చిన్ని మీద విమర్శలు ఎక్కుపెట్టాడు. అంతకుముందు చిన్ని అక్రమాలపై ఏకంగా సీఎం చంద్రబాబుకే నాని బహిరంగ లేఖ రాశాడు.
తమ్ముడు రంగంలోకి దిగాడు. కౌంటర్‌ ఇవ్వడం మొదలెట్టాడు. చిప్‌ దొబ్బిన సైకో అంటూ అన్న నానిపై విరుచుకు పడ్డాడు. 1991–2010 వరకు 20 సంవత్సరాలు మీ భాగస్వామ్యంలో విభేదాలను లెక్కలు చూపించకుండా వ్యాపారంలో నీ భాగస్వాములతో ఉన్న వివాదాలను కొంతమంది కుహనా నాయకులతో కలిసి రాష్ట్ర అభివృద్ధికి అడ్డుకునే నీ కుళ్లు రాజకీయాలను చూపించకు అంటూ ఓ రేంజ్‌లో ప్రతి విమర్శలు గుప్పించారు. ఎవరికి ఎవరు గత 20 సంవత్సరాల భాగస్వామ్యంలో సైకోకే తెలియాలి అంటూ అన్నకు దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చాడు.
అయితే అన్న ఊరుకో లేదు. మళ్లా స్పందించాడు. ఈ సారి తమ్ముడితో పాటు తమ్ముడి స్నేహితుడు సతీష్‌ అబ్బూరి మీద భాణం ఎక్కుపెట్టాడు. నువ్వు.. నీ మిత్రుడు చార్లెస్‌ శోభరాజ్‌తో కలిసి 21 సెంచురీ ద్వారా ఎంతో మందిని మోసం చేసింది వాస్తవం, ఇప్పుడు ప్రజా సంపద దోచుకుందామని యుఆర్‌ఎస్‌ఏ పెట్టింది కూడా నిజం, చేసేది పచ్చి మోసాలు పైగా బెదిరింపులు అంటూ కాస్త ఘాటుగా విమర్శలు ఎక్కుపెట్టాడు. తమ్ముడు ఎలా ఊరుకుంటాడు. అసలే సిట్టింగ్‌ ఎంపీ. అధికారంలో ఉన్నవాడు. పార్టీ అదికారంలో ఉంది. ఆశీర్వదించిన పెద్దలు అండగా ఉన్నారు. అందుకని అన్నకు కాస్త ఝలక్‌ ఇచ్చాడు. 100 కోట్లకు అన్న మీద పరువు నష్టం దావా వేశాడు. దీనికి సంబంధించిన నోటీసులు కూడా అన్నకు అందేలా చూశాడు.
అయితే అన్న దానికి అదర లేదు. బెదర లేదు. అవే మాటలు పలికారు. వంద కోట్లకు కాదు.. లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా.. ప్రజల సంపదను దోచుకునే వారిపై నా పోరాటం ఆగదు అంటూ తమ్ముడికి అన్న కౌంటర్‌ ఇచ్చాడు. అంతేకాదు తగ్గేదే లే అంటూ పుష్ప సినిమాలో అల్లూ అర్జున్‌ చెప్పిన దాని కంటే రెట్టింపు వాయిస్‌తో భయంతో బెదిరింపులకు లోంగేదే లేదు అంటూ మీసం మెలేసి బాలకృష్ణ తొడ కొట్టినట్లు చెప్పాడు.
దీనికి అధికారంలో ఉన్న ప్రతాపాన్ని చూపించేందుకు తమ్ముడు మరో అస్త్రాన్ని ప్రయోగించాడు. తన పార్టీ విద్యార్థి సంఘం నాయకులతో విజయవాడ పోలీసు కమిషనేరట్‌ పరిధిలోని నున్న పోలీసు స్టేషన్‌లో ఓ కేసు నమోదు చేయించారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే కుట్రలో భాగంగా ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని)పై నాని అసత్య ఆరోపణలు చేస్తున్నారని, పులివెందుల ఎమ్మెల్యే జగన్‌తో కలిసి రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలో ఫిర్యాదులు ఇప్పించారు.
తమ్ముడు చర్యలకు అన్న మరో సారి తనదైన స్టైల్‌లో కౌంటర్‌ ఇచ్చాడు. బాబు చార్లెస్‌ శోభరాజ్‌ నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, పెట్టించినా నువ్వు చేసే అవినీతి, అక్రమాలు, దందాలు, దోపిడీ, మోసాలు బయట పెట్టకుండా ఉండే ప్రసక్తే లేదు అంటూ తమ్ముడికి అన్న మరో సారి కౌంటర్‌ ఇచ్చాడు. దీనిపై తమ్ముడు ఏ విధంగా స్పందిస్తాడనేది సర్వత్రా అసక్తి కరంగా మారింది. ఇద్దరి మధ్య సోషల్‌ మీడియా వేదికగా ఓ రేంజ్‌లో యుద్ధం జరుగుతోంది. ఎప్పుడు ఏ మలుపు చోటు చేసుకుంటుందో అనేది అంతుబట్టడం లేదని విజయవాడ ప్రజలు చర్చించుకుంటున్నారు.
Read More
Next Story