
నమో అంటే నరేంద్ర మోదీ కాదట
రాష్ట్రానికి పరిశ్రమలు ఆకర్షించడానికి మూడు కీలక కారణాలు ఉన్నాయని లోకేష్ అంటున్నారు.
ఇది వరకు నమో అంటే నరేంద్ర మాదీ అని మంత్రి నారా లోకేష్ అభివర్ణించారు. కానీ ఇప్పుడు కాదంటున్నారు. నమోకు కొత్త పదం జోడించారు. 'నమో' అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రమే కాదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు-మోదీల కలయికని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేశ్. నారా చంద్రబాబు నాయుడులోని నాయుడు, నరేంద్ర మోదీలోని మోదీ కలిపి నమోగా లోకేష్ పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి లోకేశ్, రాష్ట్రానికి పరిశ్రమలు ఆకర్షించడానికి మూడు కీలక కారణాలు ఉన్నాయని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు లీడర్‌షిప్, వేగవంతమైన అనుమతుల ప్రక్రియ, పరిశ్రమలకు అనుకూల ఎకోసిస్టమ్ వీటిలో ముఖ్యమైనవని వివరించారు. మంచి సంబంధాలు, డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఏపీకి పెట్టుబడులు తీసుకువస్తున్నాయని ఆయన అన్నారు.
పెట్టుబడులకు వేగవంతమైన సౌకర్యాలు కీలకం
పెట్టుబడులకు వేగవంతమైన సౌకర్యాలు, సులభమైన ప్రక్రియలు కీలకమని లోకేశ్ వెల్లడించారు. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి గ్లోబల్ కంపెనీలు ఏపీని ఎంచుకోవడానికి ఇదే కారణమని తెలిపారు. ఐటీ, తయారీ, సేవలు, పర్యాటక రంగాల్లో రాష్ట్రం గణనీయమైన ప్రాగతి సాధిస్తోందని ఆయన అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగాలని అధికారులకు సూచించారని వివరించారు. పలు రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లు నడుస్తున్న నేపథ్యంలో, వికసిత్ భారత్ విజన్ మేరకు ఏపీ ముందుకు సాగుతోందని లోకేశ్ చెప్పారు.
2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం
2047 నాటికి భారతదేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే ప్రధాని మోదీ విజన్‌లో, ఏపీ 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా పయనిస్తోందని మంత్రి లోకేశ్ తెలిపారు. స్పష్టమైన లక్ష్యాలు, వేగవంతమైన పాలసీల అమలు ద్వారా ప్రగతి సాధిస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్రాల మధ్య పోటీ పెట్టుబడులు ఆకర్షించడానికి సహాయపడుతుందని, ఇది భారతదేశానికి మేలు చేస్తుందని చెప్పారు. గూగుల్ (15 బిలియన్ డాలర్లు), ఆర్సెలార్ మిట్టల్ (1.5 లక్షల కోట్లు) వంటి పెద్ద పెట్టుబడులు ఏపీ భవిష్యత్తును మారుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
విశాఖలో సీఐఐ సదస్సు: 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాలు
విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న 30వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌పై లోకేశ్ ప్రత్యేకంగా మాట్లాడారు. సదస్సు నిర్వహణకు ఏపీకి అవకాశం ఇచ్చిన సీఐఐకి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం, విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులకు ఇది గొప్ప అవకాశమని అన్నారు. క్వాంటమ్, ఏఐ, మెటీరియల్ సైన్స్ వంటి రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సదస్సులో 410 ఎంఓయూలు జరిగి, 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడుల ద్వారా 7.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని లోకేశ్ చెప్పారు. సమ్మిట్‌లో 45 దేశాల నుంచి 300 మంది పారిశ్రామిక వ్యవస్థాపకులు పాల్గొంటారని, అన్ని ఎంఓయూలు 12 నెలల్లోగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

