భద్రాద్రి రామయ్యకు చంద్రబాబు ఐదూర్ల  కానుక
x

భద్రాద్రి రామయ్యకు చంద్రబాబు ఐదూర్ల కానుక

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ఆలయం చుట్టూ ఉన్న ఐదుగ్రామాలను వెనక్కు ఇచ్చేయటానికి చంద్రబాబు అంగీకరించారు.


ఐదూర్లు ఇవ్వమని పాండవులు బతిమలాడినా మహాభారతంలో నాటి దుర్యోధనుడు అంగీకరించలేదు. కాని ఇపుడు ఐదూర్లు ఇవ్వమని రేవంత్ రెడ్డి అడగ్గానే చంద్రబాబునాయుడు ఓకేచేసేశారు. అప్పటి ఐదూర్లకు ఇప్పటి ఐదూర్లకు తేడా ఏమిటంటే అప్పటిది పురాణకాలం, ఇది ప్రజాస్వామ్యం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ఆలయం చుట్టూ ఉన్న ఐదుగ్రామాలను వెనక్కు ఇచ్చేయటానికి చంద్రబాబు అంగీకరించారు. నిజంగా ఈ విషయం భద్రాద్రి రాముడు కూడా సంతోషించే విషయమనే చెప్పాలి.

ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణా-ఏపీ మధ్య నలుగుతున్న విభజన సమస్యల పరిష్కారం కోసం మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీ అయిన విషయం తెలిసిందే. పదేళ్ళుగా పేరుకుపోయిన చాలా సమస్యల పరిష్కారానికి మూడంచెల కమిటీలను ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయమైంది. మొదటిదేమో వివిధ శాఖల ఉన్నతాధికారులతో. రెండో కమిటి ఏమో చీఫ్ సెక్రటరీలు ఇద్దరితోను. మూడో కమిటి ఏమిటంటే రెండు రాష్ట్రాల మంత్రులతో. సమస్యల పరిష్కారం కోసం మూడు దశల్లోని కమిటీలు చిత్తశుద్దితో పనిచేస్తే కొన్ని సమస్యలైనా పరిష్కారమవుతాయి. సమస్యల పరిష్కారానికి చర్చలకు మించిన వేదిక లేదు కాబట్టి శుభపరిణామమనే చెప్పాలి.




కమిటీలు, చర్చలను పక్కన పెట్టేస్తే సమావేశంలో ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరిగింది. అదేమిటంటే భద్రాచలం ఆలయం చుట్టూ ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణాకు తిరిగి ఇచ్చేయమని రేవంత్ అడగారు. దానికి చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు. ఐదు గ్రామాలను ఇచ్చేయటానికి పుచ్చుకోవటానికి న్యాయపరమైన సమస్యలు లేకుండా చూసుకుని ముందుకెళదామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఐదుగ్రామాలు ఇవ్వాలన్నా, తీసుకోవాన్నా ముందుగా రెండు రాష్ట్రాల క్యాబినెట్లు ఆమోదించిన తర్వాత అసెంబ్లీల్లో తీర్మానాలు చేయాలి. ఆ తీర్మానాలను రెండు ప్రభుత్వాలు కేంద్రహోంశాఖకు పంపాలి. అక్కడ కేంద్రహోంశాఖ పరిశీలించి పార్లమెంటులో బిల్లు పెట్టి ఓకే చేయించాలి. ఇందుకు ప్రధానమంత్ర సానుకూలంగా స్పందించాలి. ప్రధాని సానుకూలంగా స్పందించటాన్ని పక్కనపెట్టేస్తే ఇవ్వటానికి ముందు ఏపీ ప్రభుత్వం అంగీకరించాలి. ఈ విషయంలోనే చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.

అసలు సమస్యేమిటి ?

రెండు రాష్ట్రాలు విడిపోయినపుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తెలంగాణాలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేశారు. ఈ ఏడు మండాలాల్లో భద్రాచలం మండలం కూడా ఒకటి. ఇపుడు సమస్య ఏమిటంటే బద్రాచలం మండలంలోని ఐదు గిరిజన గ్రామాలు ఏటపాక, పిచ్చుకలపాడు, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం ఏపీ పరిధిలోకి వెళిపోయాయి. అసలు సమస్యంతా ఇక్కడే మొదలైంది. ఎలాగంటే భద్రాచలం ఆలయం మాత్రం తెలంగాణాలో ఉండిపోతే ఆలయం చుట్టూ ఉన్న ఐదు గ్రామాలు మాత్రం ఏపీ పరిధిలోకి వెళ్ళిపోయాయి. దీనివల్ల సమస్య ఏమిటంటే భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధి చేయాలంటే తెలంగాణా ప్రభుత్వం అవకాశం లేకుండాపోయింది. ఆలయంకు ఉన్న సుమారు 900 ఎకరాల భూములు కూడా పురుషోత్తమపట్నం గ్రామంలోనే ఉంది. గ్రామం మొత్తం ఏపీ పరిధిలోకి వెళిపోయింది కాబట్టి ఆలయం భూములు కూడా ఏపీ ప్రభుత్వానికి సొంతమైపోయాయి.

దీంతో పాటు మరో సమస్య కూడా భద్రాచలం పట్టణాన్ని పట్టి పీడిస్తోంది. అదేమిటంటే గార్బేజ్ (చెత్త) సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది. భద్రాద్రి రాముడి దర్శనానికి రోజూ వేలాదిమంది భక్తులు ఎక్కడెక్కడి నుండో వస్తుంటారు. ఈ కారణంగా పారిశుధ్యం సమస్యతో పాటు పట్టణంలోని లక్షలమంది నివాసముంటున్న జనాల ఇళ్ళల్లోని విసర్జితాలను ఎక్కడికి తరలించాలన్నది కూడా పెద్ద సమస్య అయిపోయింది. ఎందుకంటే ఆలయంతో పాటు పట్టణం చుట్టూతా ఉన్న గ్రామాలు ఏపీ పరిధిలో ఉండటంతో గార్బేజ్, విసర్జితాలను గ్రామాల శివార్లలో వేయటానికి ఏపీ ప్రభుత్వం అంగీకరించటంలేదు. దాంతో పట్టణంలో పారిశుధ్యం సమస్య పెరిగిపోతోంది. వేరేదారేక చెత్త మొత్తాన్ని పట్టణం అధికారులు గోదావరి నదీ ప్రాంతాల్లోనే వదిలేస్తున్నారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో గార్బేజ్, దుర్గంధం కారణంగా అనారోగ్యాలు పెరిగిపోతున్నాయి.

గ్రామాల పరిస్ధితి ఏమిటి ?




నిజానికి పై ఐదుగ్రామాలను తీసుకోవటం వల్ల ఏపీకి వచ్చిన ఉపయోగం ఏమీలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అధికారులు కూడా ఐదుగ్రామాల జనాలను పదేళ్ళుగా పట్టించుకోవటంలేదు. దీంతో సమస్యల పరిష్కారం కోసం దిక్కులు చూస్తున్నారు. విభజన ఎంత అనాలోచితంగా జరిగిందనేందుకు ఒక ఉదాహరణ. అదేమిటంటే పై ఐదుగ్రామా జనాలు కలెక్టర్ను, ఎస్పీని కలవాలన్నా ఇతర ఉన్నతాధికారులను కలవాలంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని పాడేరుకు వెళ్ళాలి. విశాఖపట్నంను విడదీసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాడేరు జిల్లా ఏర్పాటుచేసింది. ఐదుగ్రామాల సమస్యలు ఉన్నతాధికారులను కలవాలంటే 400 కిలోమీటర్లు ప్రయాణంచేసి పాడేరుకు వెళ్ళాల్సిందే. అంటే రానుపోను 800 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. విభజనకు ముందు ఐదుగ్రామాల ప్రజలు సమస్యల పరిష్కారం కోసం భద్రాచలంలోనే ఉన్న ఐటీడీఏ ఉన్నతాధికారులు, సబ్ కలెక్టర్, అడిషినల్ ఎస్పీని కలిసేవారు.

పంచాయితీల తీర్మానాలు



తమ సమస్యలన్నింటినీ ప్రస్తావిస్తు ఐదుగ్రామ పంచాయితీలు చాలాకాలం క్రితమే తీర్మానాలు చేశాయి. ఏమనంటే తమ గ్రామాలను ఏపీ ప్రభుత్వంలోనుండి తప్పించి తిరిగి తెలంగాణా ప్రభుత్వంలోనే విలీనం చేయాలని. అయితే పంచాయితీల తీర్మానాలను పట్టించుకున్న దిక్కేలేదు. ముఖ్యమంత్రుల భేటీ రూపంలో అప్పటి తీర్మానాలకు ఇప్పుడు ఊపిరి వచ్చింది మళ్ళీ.

మంత్రి ఏమిచెప్పారు




ఐదుగ్రామాల సమస్యలపై తెలంగాణా ఫెడరల్ తో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతు ‘ఐదు గ్రామాల వల్ల ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి ఉపయోగం లేకపోగా తెలంగాణా ప్రధానంగా భద్రాచలం ఆలయంతో పాటు పట్టణానికి చాలా ఇబ్బందులు పెరిగిపోతున్న’ట్లు చెప్పారు. ‘ఏపీలో కలిసిపోయిన ఐదుగ్రామాలను వెంటనే తెలంగాణాలో వీలీనం చేసే విషయాన్ని చంద్రబాబుతో మాట్లాడాలని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి ఇచ్చాన’ని చెప్పారు. ఇదే విషయాన్ని చంద్రబాబుతో కూడా మాట్లాడినట్లు మంత్రి చెప్పారు. ‘చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించార’ని మంత్రి చెప్పారు. ‘ఐదుగ్రామాలను ఏపీ ప్రభుత్వం తెలంగాణాకు ఇచ్చేయటం వల్ల ఆలయం అభివృద్ధితో పాటు పట్టణం అభివృద్ధి మీద కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుంద’న్నారు.

Read More
Next Story