తొందరలోనే భువనేశ్వరి, బ్రాహ్మణి ఎంట్రీ ?
..‘వీలుంటే భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి కూడా’..‘బాలయ్య అండగా ఉంటారు’
‘నేను వేసిన పునాదిపైనే తెలంగాణా అభివృద్ధి’..‘వారంలో ఒకరోజు తెలంగాణా టీడీపీపై దృష్టిపెడతా’..‘మరో రోజు లోకేష్ అందుబాటులో ఉంటారు’..‘వీలుంటే భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి కూడా’..‘బాలయ్య అండగా ఉంటారు’..ఇది చంద్రబాబునాయుడు ఎన్టీయార్ ట్రస్ట్ భవన్లో నేతలు, కార్యకర్తల ముందు చేసిన ప్రకటన. తెలంగాణాలో పార్టీ వ్యవహారాలు మొత్తాన్ని కుటుంబమే చూసుంటుందని స్పష్టంగానే చెప్పేశారు. మొన్నటి ఎన్నికల్లో ఏపీలో భువనేశ్వరి రాష్ట్రంలో తిరిగి ప్రచారంచేశారు. అలాగే లోకేష్ పోటీచేసిన మంగళగిరి నియోజకవర్గంలో బ్రాహ్మణి ప్రచారంచేసిన విషయం తెలిసిందే. దాంతో భార్య, కోడలు సామర్ధ్యంపై చంద్రబాబులో నమ్మకం పెరిగినట్లుంది. ఏపీలో అధికారంలోకి వచ్చేశారు కాబట్టి తెలంగాణానే నెక్స్ట్ టార్గెట్ గా పెట్టుకున్నారు.
గతంలో ఎప్పుడూ పాలిటిక్స్ లో భువనేశ్వరి యాక్టవ్ పార్ట్ తీసుకోలేదు. కుప్పం వ్యవహారాలను మాత్రమే సమీక్షించేవారు. ఎన్టీయార్ ట్రస్ట్ ద్వారా కృష్ణాజిల్లాలో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యేవారంతే. మొదటిసారిగా భువనేశ్వరి పూర్తిస్ధాయిగా రాజకీయాల్లోకి వచ్చింది మాత్రం చంద్రబాబు అరెస్టు తర్వాతే. స్కిల్ స్కామ్ లో అరెస్టయి చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నపుడు భువనేశ్వరి ‘నిజం గెలివాలి’ పేరుతో యాత్రచేశారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన అభిమానుల కుటుంబాలను ఓదార్చి ఆర్ధికసాయం చేయటానికి భువనేశ్వరి కొన్నిప్రాంతాల్లో పర్యటించారు. ఆ సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఫుల్లుగా ఆరోపణలతో విరుచుకుపడ్డారు. అంతకుముందు రాజమండ్రిలోనే క్యాంపు వేసిన భువనేశ్వరి, బ్రాహ్మణి పార్టీ నేతలతో రోజూ మాట్లాడేవారు. ఆ తర్వాతే నిజంగెలవాలి అనే యాత్ర మొదలైంది.
చంద్రబాబు జైలునుండి రిలీజై ఎన్నికలు ఊపందుకున్నపుడు కూడా భువనేశ్వరి కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారంచేశారు. దాంతో భువనేశ్వరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించినట్లయ్యింది. ఇదేసమయంలో మంగళగిరిలో బ్రాహ్మణి కూడా విస్తృతంగా ప్రచారంచేశారు. 2019 ఎన్నికల్లో కూడా బ్రాహ్మణి మంగళగిరిలో ప్రచారంచేశారు. తాజా ఎన్నికల ప్రచారంతో అత్తా, కోడళ్ళిద్దరూ ప్రజాజీవితంలోకి ప్రత్యక్షంగా అడుగుపెట్టినట్లయ్యింది. భువనేశ్వరి, బ్రాహ్మణి మాటతీరు, బాడీ ల్యాంగ్వేజ్, మాట్లాడిన సబ్జెక్టులు, జనస్పందన తదాతరాలన్నింటినీ విశ్లేషించిన తర్వాతనే ఎన్టీయార్ ట్రస్ట్ భవన్లో నేతలు, కార్యకర్తలతో మాట్లాడినపుడు లోకేష్ తో పాటు భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా పార్టీ యాక్టివిటీస్ ను చూసుకుంటారని ప్రకటించినట్లున్నారు.
చంద్రబాబు తాజా ప్రకటనతో బుడ్డోడు దేవాన్ష్ తప్ప కుటుంబంలో అందరు పాలిటిక్స్ లో బిజీ అయిపోవటం ఖాయమనే అనిపిస్తోంది. ఎందుకైనా మంచిదని బావమరది కమ్, వియ్యంకుడు నందమూరి బాలకృష్ణను భువనేశ్వరి, బ్రాహ్మణికి తోడుగా ఉంటారని ప్రకటించారు. నిజానికి బాలకృష్ణకన్నా భువనేశ్వరి, బ్రాహ్మణే బాగా మాట్లాడుతారు. బాలకృష్ణ ఎక్కడ పాల్గొంటే అక్కడంతా కంపే అవుతుందని పార్టీలో అందరికీ తెలుసు. కాగితం చూడకుండా బాలకృష్ణ ఒక్కనిముషం కూడా మాట్లాడలేరని అందరికీ తెలుసు. ఆ మాట్లాడేది కూడా ఒకదానితో సంబంధంలేకుండా మరోటి మాట్లాడేయటం బాలయ్య అలవాటు. కాబట్టి ఏరకంగా చూసుకున్నా భువనేశ్వరి, బ్రాహ్మణికి బాలయ్య తోడు అవసరమే లేదు.
ప్రాంతీయపార్టీ అంటేనే కుటుంబపార్టీ అని అందరికీ తెలిసిందే. ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రాంతీయపార్టీలు అధినేతల ప్రైవేటు ఆస్తులే. తమిళనాడులో డీఎంకే, కర్నాటకలో జేడీ, ఏపీలో వైసీపీ, మహారాష్ట్రలో ఎన్సీపీ, యూపీలో ఎస్పీ, బీఎస్పీ లాంటి ఉదాహరణలు చాలా రాష్ట్రాల్లో కనబడుతాయి. అధినేత నిర్ణయాన్ని ప్రశ్నించేత సీన్ మిగిలిన నేతలకు ఉండదు. ఇష్టమున్నా లేకపోయినా అధినేత నిర్ణయాన్ని పాటించాల్సిందే. లేకపోతే పార్టీని వదిలేసి బయటకు పోవాల్సిందే తప్ప వేరేదారిలేదు. కాబట్టి చంద్రబాబు తాజా ప్రకటనతో తెలుగుదేశంపార్టీపై కుటుంబపార్టీ అని మిగిలిన తమ్ముళ్ళకు పూర్తి క్లారిటి వచ్చేసుంటుంది. ఎలాగూ టీడీపీ కుటుంబపార్టీ అన్న విషయం అందరికీ తెలిసిందే కాబట్టి చంద్రబాబు తాజాగా పార్టీలోకి భువనేశ్వరి, బ్రాహ్మణి ఎంట్రీ విషయాన్ని బహిరంగంగా ప్రకటించినట్లున్నారు. తనకు కూడా వయసు అయిపోతోంది కాబట్టి తెలంగాణాలో పార్టీని బలోపేతం చేస్తే లోకేష్ భవిష్యత్తుకు ఢోకా ఉండదని అనుకున్నట్లున్నారు. అందుకనే లోకేష్ కు తోడుగా భువనేశ్వరి, బ్రాహ్మణిని రంగంలోకి దింపేస్తున్నారు. బహుశా తొందరలోనే జరగబోయే గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో అత్తా, కోడళ్ళ ప్రచారం ఉంటుందేమో చూడాలి.