ఉత్తరాంధ్రపై నాగబాబు ‘ పడగ ’!
x
విశాఖలో జనసేన శ్రేణుల సమావేశంలో మాట్లాడుతున్న నాగబాబు

ఉత్తరాంధ్రపై నాగబాబు ‘ పడగ ’!

తన ఎమ్మెల్సీ నియోజకవర్గాన్ని ఉత్తరాంధ్రగా డిసైడ్‌ చేసుకున్నానని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు చెప్పారు. పిఠాపురంపై దూకుడు తగ్గించినట్టు భావిస్తున్నారు.

కొణిదెల నాగబాబు.. పవన్‌ కల్యాణ్‌ సోదరుడు.. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి.. అంతకు ముందు సినీనటుడిగానే జనానికి బాగా పరిచయం ఉన్న పేరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, తన సోదరుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి కావడంతో నాగబాబుకు ఒకింత ప్రాధాన్యత పెరిగింది. కొన్నాళ్ల క్రితం ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో అది మరికాస్త అధికమైంది. మార్చిలో ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు వెనువెంటనే తన సోదరుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి ఉరుకులు పరుగులతో వెళ్లారు. ఆ నియోజకవర్గంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలను జనసేన శ్రేణులతో ఏర్పాటు చేయించారు. కానీ పిఠాపురం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ వర్మను పక్కనబెట్టి ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇది అటు టీడీపీ, ఇటు జనసేన నాయకుల మధ్య చిచ్చు రేగడమే కాదు.. టీడీపీ నేతలపై కేసులు నమోదు చేసే వరకు పరిస్థితి వెళ్లింది. నాగబాబు ఎమ్మెల్సీ హోదాలో తొలిసారి పిఠాపురం వెళ్లడం, అక్కడ హంగామా చేయడం, గొల్లప్రోలు మండలంలో జనసేన, టీడీపీ వర్గాలు ఘర్షణలకు పాల్పడి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేయడం వంటి ఘటనలు ఆ రెండు పార్టీల అధిష్టానాలకు తలనొప్పిగా మారింది.


‘పిఠాపురం’లో నాగబాబు సమక్షంలో టీడీపీ, జనసేనల మధ్య ఘర్షణ (ఫైల్‌)

ఆవిర్భావ సభలో అగ్గిరాజేసిన ‘ఖర్మ’ వ్యాఖ్యలు..
మరోవైపు జనసేన ఆవిర్భావ దినోత్సవ (ఫిబ్రవరి 14న) సభలో ‘పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ గెలుపునకు కారణం ఆయన, నియోజకవర్గ ఓటర్ల వల్లే తప్ప తన వల్లేనని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ’ అంటూ టీడీపీ ఇన్‌చార్జి వర్మనుద్దేశించి నాగబాబు చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. ఈ పరిణామాలతో నాగబాబు దూకుడుకు పవన్‌ కల్యాణ్‌ కళ్లెం వేశారన్న ప్రచారం జరిగింది. అందువల్లే అప్పట్నుంచి ఆయన పిఠాపురం నియోజకవర్గానికి దూరంగా ఉన్నారన్న వాదన ఉంది. తొలుత నాగబాబుకు మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జరిగింది. అది ఎందుకో కార్యరూపం దాల్చకుండా ఆలస్యమవుతోంది.
ఇప్పుడు ఉత్తరాంధ్రపై దృష్టి..
ఇన్నాళ్లూ తన సోదరుడు పవన్‌ కల్యాణ్‌ ప్రాతిని«థ్యం వహిస్తున్న పిఠాపురంపై పట్టు సాధించే దిశగా అడుగులు వేసిన నాగబాబు అనూహ్యంగా ఇప్పుడు ఉత్తరాంధ్రపై దృష్టి సారించారు. వారం రోజుల క్రితం జనసేన శ్రేణులతో సమన్వయ కమిటీల సమావేశం పేరుతో ఉత్తరాంధ్రకు వచ్చారు. ఆయన విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడారు. విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయ భేటీలో ‘ఉత్తరాంధ్రలో నా ఎమ్మెల్సీ నియోజకవర్గాన్ని డిసైడ్‌ చేసుకున్నాను. ఇక్కడే ప్లాన్‌ చేస్తున్నాను. నెలకు ఐదు నుంచి పది రోజులు ఇక్కడే ఉంటాను. ఎక్కడ ఉంటానో త్వరలో చెబుతాను’ అని ప్రకటించారు. దీంతో నాగబాబు ఇక ఉత్తరాంధ్ర కేంద్రంగా జనసేన రాజకీయాలు చేస్తారని స్పష్టమైందని ఆ పార్టీ శ్రేణులు నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో జనసేన క్యాడరు కూటమి ప్రభుత్వంలో తమకు గుర్తింపు లేదని, తమకేమీ పనులు జరగడం లేదని అసంతృప్తితో ఉన్నారు. అదే విషయాన్ని ఇటీవల నాగబాబు ఎదుట కూడా వెల్లడించారు. ఉత్తరాంధ్రలో టీడీపీలో తలపండిన సీనియర్‌ నాయకులు ఎందరో ఉన్నారు. దూకుడు స్వభావం ఉన్న నాగబాబు ఉత్తరాంధ్రలో టీడీపీ, జనసేనలను ఎలా సమన్వయం చేయగలుగుతారోనన్న చర్చ జరుగుతోంది.
Read More
Next Story