వైసీపీ వాళ్లతో నాగబాబు తిట్లు తిన్నాడు..మంత్రి పదవి ఇస్తున్నాం
x

వైసీపీ వాళ్లతో నాగబాబు తిట్లు తిన్నాడు..మంత్రి పదవి ఇస్తున్నాం

రేషన్‌ బియ్యం మాయమైంది, వాటికి డబ్బులు చెల్లించింది నిజం. ఇంట్లో ఆడవాళ్ల పేరుతో గోడౌన్‌ కట్టెందెవరని మాజీ మంత్రి పేర్నినానిపై పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు.


తన అన్న నాగబాబుపైన, ఆయనకు కేటాయించే మంత్రి పదవిపైన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నాగబాబు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వాళ్లతో తిట్లు తిన్నారు. నాతో పాటు ఈక్వల్‌గా పార్టీ కోసం పని చేశారు. కష్ట సమయాల్లో పార్టీ కోసం నిలబడ్డారు. అందుకే నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించామని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. తొలుత ఎమ్మెల్సీగా ఎంపిక చేసి, తర్వాత మంత్రి పదవి గురించి ఆలోచన చేస్తామన్నారు. నాగబాబు విషయంలో, ఇతర జనసేన నేతలకు పదవులు ఇవ్వడంలో కులం కానీ, బంధుప్రీతి కానీ చూడలేదని, పార్టీ కోసం పని చేశారా? పనిమంతుడా కాదా? అనే విషయాలను చూసుకోవాలన్నారు.

తొలుత ఎంపీగా నాగబాబును ప్రకటించి, తర్వాత తప్పించామని పేర్కొన్నారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, పార్టీ కోసం పని చేశారు, ప్రతిభ ఉంది కాబట్టి వారికి పదవులు ఇచ్చామన్నారు. కందుల దుర్గేష్‌ది ఏ కులమో తనకు తెలియదన్నారు. తమకు ఏమాత్రం బ్యాక్‌గ్రౌండ్‌ లేక పోయినా అన్నయ్య చిరంజీవి ఎదిగారు, మా తర్వాత తరానికి ఒక బ్యాక్‌గ్రౌండ్‌ ఏర్పడిందని అన్నారు. కష్ట నష్టాల్లో తనతో ప్రయాణించి, పార్టీ కోసం పని చేసిన వారిని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.

మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం రేషన్‌ బియ్యం మాయమైన కేసు గురించి ఆయన మాట్లాడుతూ.. పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్‌లో రేషన్‌ బియ్యం మాయమైంది నిజమని, వాటికి డబ్బులు చెల్లించింది కూడా నిజమేనని అన్నారు. ఇంట్లో ఆడవాళ్ల పేరుతో గోడౌన్‌ కట్టిందెవరని ప్రశ్నించారు. నాని చేసిన తప్పులే ఆయన కుటుంబాన్ని రోడ్డుపైకి తెచ్చాయని మండిపడ్డారు. నాడు బూతులు తిట్టి, నేడు నీతులు చెబితే ఎలా అని పేర్ని నానిని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులను పేర్ని నాని తిట్టలేదా? అని ప్రశ్నించారు. మంగళగిరిలో మీడియాతో సోమవారం జరిగిన చిట్‌ చాట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.
Read More
Next Story