ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్లపాటు బియ్యం మాఫియా రెచ్చిపోయిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ నోవాటెల్ హోటల్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తమ స్వలాభం కోసం దేశ భద్రతను పణంగా పెట్టిందన్నారు. కాకినాడ పోర్టుకు చెడ్డపేరు తీసుకురావడంతోపాటు దానిని స్మగ్లింగ్ డెన్‌గా మార్చేసిందన్నారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఒక పెద్ద నెట్ వర్క్ ఏర్పాటు చేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిందన్నారు. కాకినాడ సీపోర్టు యాజమాన్యాన్ని అరబిందో కోసం 41.12 శాతం వాటాను రాయించుకున్నారు. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఒక్క కాకినాడ పోర్టు నుంచే రూ. 48,537 కోట్లు విలువ చేసే బియ్యం ఎగుమతి అయ్యిందంటే బియ్యం మాఫియా ఏ విధంగా చెలరేగిపోయిందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. అరబిందోను భయపెట్టి పార్టనర్‌షిప్ ఎలా కట్టపెట్టారో ప్రజలకు తెలపాలన్నారు. ఈ రేషన్ మాఫియాను అరికట్టే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దళారుల వ్యవస్థను కూడా పూర్తిగా అరికడతామన్నారు. బియ్యం మాఫియా వెనుక ఎంత పెద్ద శక్తులు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాతతన సొంత నియోజకవర్గం తెనాలిలోతనిఖీలు చేశానన్నారు. అనంతరం విజయవాడలోని గొల్లపూడి గోదాములో తనిఖీలు నిర్వహించానన్నారు. రెండు చోట్ల చాలా అవకతకవలు గుర్తించామన్నారు. సమస్యను లోతుగా అధ్యయనం చేయాలని చాలా కసరత్తు చేశామన్నారు. ఈ ఏడాది జూన్ 28న కాకినాడలోని 13 గోదాముల్లో తనిఖీలు చేసి, 51,427 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశాం. అందులో పరీక్షల తరువాత 25,386 మెట్రిక్ టన్నులు రేషన్ బియ్యంగా నిర్ధారణ అయ్యిందన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ నియమించి రేషన్ మాఫియాతో సంబంధం ఉన్నా 13 కంపెనీలపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. కేసులు నమోదైన 13 కంపెనీలు హైకోర్టును ఆశ్రయించి బియ్యం రిలీజ్ చేయాలని కోరాయి. కోర్టు ఆదేశాల మేరకు నాన్ పీడీఎస్ రైస్‌ను ముందుగా రిలీజ్ చేశామన్నారు. రూ.84 కోట్ల బ్యాంకు గ్యారెంటీలతో పీడీఎస్ రైస్‌ను రిలీజ్ చేశామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పెద్ద నెట్వర్క్ ఏర్పాటు
రాష్ట్రంలో 29 వేల రేషన్ డిపోలు ఉన్నాయి. ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు వినియోగదారులకు సరుకును సక్రమంగా అందించేవి. స్వలాభం కోసం రాష్ట్ర ఖజానా నుంచి రూ.1600 కోట్లు ఖర్చు చేసి రేషన్ డోర్ డెలివరీ పేరిట 9,360 వ్యాన్లు కొనుగోలు చేశారన్నారు. ఈ వ్యాన్లు ద్వారా ఒక పెద్ద నెట్ వర్క్ ఏర్పాటు చేసి రేషన్ బియ్యం స్మగ్లింగ్ మొదలుపెట్టారన్నారు. రాష్ట్రంలో 1.48 కోట్ల మందికి ప్రతి నెల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ అందిస్తున్నాయన్నారు. ఇందుకోసం రూ.12,800 కోట్లు ఖర్చు చేస్తోంది. కిలో బియ్యానికి ప్రభుత్వానికి రూ.43.40 ఖర్చు అవుతుంటే, వాటిని రూ.10 చొప్పున కార్డుదారుల నుంచి ఈ మాఫియా కొనుగోలు చేసి కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు. ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యం తరలించి కోట్ల ప్రజాధనం కొల్లగొట్టిందన్నారు.
ఒక కాకినాడ పోర్టు నుంచే 1,31,18,346 మెట్రిక్ టన్నుల బియ్యం
కాకినాడ పోర్టు మీదే కూటమి ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టింది అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దానికి కారణం ఉంది. గత ఐదేళ్లలో కాకినాడ పోర్టులోకి ఎవరినీ అనుమతించలేదు. సామాన్యుల సంగతి పక్కనపెడితే జర్నలిస్టులనూ లోపలికి అనుమతించలేదన్నారు. అక్కడ ఏం జరుగుతుందో బాహ్య ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. పకడ్బందీగా వ్యూహం రచించి ఆఫ్రికా దేశాలకు బియ్యం ఎగుమతులు చేసి కోట్లు కూడబెట్టారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఏ పోర్టులో జరగని విధంగా కాకినాడ పోర్టులో బియ్యం ఎగుమతి జరిగిందన్నారు.
మన రాష్ట్రంలో గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో గంగవరం పోర్టు నుంచి 2,20,289 మెట్రిక్ టన్నులు, కృష్ణపట్నం పోర్టు నుంచి 23,51,218 మెట్రిక్ టన్నులు, విశాఖపట్నం పోర్టు నుంచి 38,02,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతులు జరిగితే, ఒక్క కాకినాడ పోర్టు నుంచే 1,31,18,346 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతులు జరిగాయన్నారు. ఒక్క కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి జరిగిన బియ్యం విలువే రూ. 48,537 కోట్లు అంటే బియ్యం మాఫియా ఏ విధంగా రెచ్చిపోయిందో అర్థం చేసుకొవచ్చన్నారు.
అరబిందో కంపెనీకి అసలు బాస్ ..
కాకినాడ సీ పోర్ట్ నుంచి అరబిందో రియాల్టికి 41.12 శాతం వాటా ట్రాన్స్ ఫర్ అయ్యింది. అది ఎలా జరిగిందో ప్రజలకు తెలియాలి. కార్పొరేట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కెవిరావు కుటుంబం నుంచి 41.12 శాతం వాటా రాయించుకున్నారన్నారు. జీఎంఆర్ నుంచి ఎస్‌ఈజెడ్ లాక్కున్నారు. అరబిందో రియాల్టి కంపెనీకి అసలైన బాస్ ఎవరో ప్రజలకు తెలియాలన్నారు. గతంలో కూడా బియ్యం ఎగుమతులు ఈ పోర్టు నుంచి జరిగాయన్నారు. కానీ ఈ స్థాయిలో ఎప్పుడు జరగలేదన్నారు. అరంబిందో కంపెనీ పోర్టు టేకోవర్ చేసిన తరువాత ఊహించని తీరిలో 1,31,18,346 మెట్రిక్ టన్నులు బియ్యం ఎగుమతి చేశారంటే ఏ మేరకు దందా జరిగిందో ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు.
కూటమి ప్రభుత్వం ఏనాడు ఒక వ్యక్తిపైనో, కుటుంబంపైనో కక్ష సాధింపుకు పాల్పడలేదు. వ్యవస్థలో పాతుకుపోయిన కుళ్లును ప్రక్షాళన చేయడానికి ప్రయత్నం చేస్తోంది. పేదలకు అందాల్సిన బియ్యాన్ని ఒక పెద్ద నెట్ వర్క్ ఏర్పాటు చేసి కొల్లగొడుతున్నారు. ఉపాధి కల్పించే రైస్ మిల్లులను గుప్పెట్లో పెట్టుకున్నారు. కాకినాడ సీ పోర్టును చేతుల్లోకి తీసుకున్నారు. ప్రజాధనం దళారుల చేతుల్లోకి వెళ్తున్నప్పుడు అరికట్టాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు. కాకినాడ పోర్టుపై వస్తున్న ప్రశ్నలకు మాజీ ముఖ్యమంత్రి జగన్ జవాబు చెప్పాలని మంత్రి నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.