CHILHOOD MEMORY|నా.. బాల్యం మోయలేని బరువైన గాయం!?
x

CHILHOOD MEMORY|నా.. బాల్యం మోయలేని బరువైన గాయం!?

నా బాల్య తూర్పు పడమరలెప్పుడు ఆకలితోనే తెల్లారేవి ఆకలితోనే పొద్దుగూకేవి.. నా తల్లిపాలు కూడా త్రుప్తిగా తాగనేలేదు.. నా తండ్రి చేయిపట్టుకొని ఎప్పుడూ నడవనేలేదు..


(సత్య కలకోటి)

ఎక్కడో చదివాను.
బాల్యం అందమైనదని
బాల్యం మధురమైనదని
బాల్యం తిరిగిరానిదని
MY FOOT.
నా పసితనం
నా తల్లిపాలు కూడా త్రుప్తిగా తాగనేలేదు
నా బాల్యం
నా తండ్రి చేయిపట్టుకొని ఎప్పుడూ నడవనేలేదు
నా బాల్య తూర్పు పడమరలెప్పుడు ఆకలితోనే తెల్లారేవి ఆకలితోనే పొద్దుగూకేవి
మా అవ్వ పొత్తిల్లల్లోనే
మమ్ముల పాలు మరిపించడానికి వెలిసిన అంగనువాడీలు
బహుశా మాకు పాలిస్తే
ఊరి దొరల గాజలెలా నిండాలి మరి
అదేంటో...,
ఏ దొరుసానికి పుట్టిన కొడుకులు బిడ్డలు మాతో
ఉప్పుడుపిండో ఉడికిఉడకని ఉప్మనో తినడానికి
ఏ పూట రాలేదు
నా కాలి బొటనవేలితో
ఈ భూమి ఎదలపై అక్కలు ముక్కలుగా నేను అక్షరాలు దిద్దుతున్నప్పుడు
చెప్పుల్లేని కాళ్లతో
తూట్లుపడ్ద లాగుతో
అట్లుపేరిన అంగితో
బడి గోడలకు కూడ తాకడానికి
భయపడే నా బాల్యానికి
పలక బలపం కొనిచ్చి
మా వాడ పక్కపొంటి పొంచివున్న
ఊరి బల్లోకి తోలుకుపోయిండు మా అయ్య.
నన్ను చూడగానే..,
మా బడిపంతులు నోరునొసలు కలిసి
నన్ను వెక్కిరించిన గడియ నాకింకా గుర్తు.
నాకు సదువుజెప్పే సదుద్దేశం సర్కారుకు లేదా
లేక గీ సారుకే లేదా అనే అనుమానం
బడిలో మోగే ప్రతీ గంట నాకు గుర్తుచేసేది
బడి....
నా రక్తమాంసాలకెపుడు నిర్జీవాన్నే తొడిగింది తప్ప
నా మెదడుకెపుడు చైతన్యాన్ని నూరిపోయలేదు
అప్పటికింకా......
ఈ పెభుత్వం నా ముడ్డికో నిక్కరుని
నా చాతికొ బుశొటుని తొడిగే దశలోలేదు
ఎప్పుడో ఒకసారి.
ఏ ఒంటర్ బెల్లులోనో
ఏ శూద్ర స్నేహితుడో కొనుక్కున్న పిప్పరమెంటుని
ఎంగిలికాకుండా అంగిలో మలిచి సగం కొరికిచ్చిన దోస్తానం ఇంకా గుర్తు.
ఆ నిమ్మబిల్లల రుచి ఇప్పటికి నా నాలికమీద తడిగానే ఉంది.
ఈ నా అంటరాని బాల్యానికి
ఒక ఆత్మీయ స్నేహితురాలు ఎప్పుడూ నావెంటే నన్ను హత్తుకొని ఉండేది ఆమె పేరు #ఆకలి.
అప్పటికింకా..
ఏ ప్రభుత్వాలకి నా కడుపు చూసే కండ్లు మొలవలేదు
ఇంకా మధ్యాన్నభోజన పథకాన్ని ప్రకటించలేదు.
నిర్లక్ష్యంగా నిర్లజ్జగా
నన్ను దూరంగా నిలబెట్టి
నా పలకమీద పెట్టిస్తున్న ప్రతీ అక్షరానికి
నన్ను నిర్దాక్ష్యనంగా నిందించే
పంతులు ముఖాన్ని తలుచుకుంటు
నా గుడిసె దిగిటిలో వెలిగే దీపంకింద
ప్రతిఅక్షరాన్ని పదిలంగా దిద్దుకునేవాన్ని
అప్పటికింకా....
ఏ సర్కార్.
నా వాడ సూర్లకింద కరెంట్ లైట్లు వెలిగించలేదు.
బడిలోని చింతబరిగెలన్ని
కులంతక్కువ వీపులమీదనే సంతకాలు చేసేవి
ఆ దెబ్బలు తాళలేక
నా సాయితగాళ్లెందరో బడిదొంగలై
మా ఊరి పెద్దదొరలకు చిన్నపాలెగాళ్లైండ్లు
అప్పటికింకా
ఏ ఉచిత నిర్భంధ విద్య నేర్పే చట్టాలు పుట్టుకరాలేదు.
ఎక్కడో చదివాను.
బాల్యం అందమైనదని
బాల్యం మధురమైనదని
బాల్యం తిరిగిరానిదని
MY FOOT
నేనెపుడు నా తల్లిపాలు తృప్తిగా తాగలేదు
వాళ్లు తాగనివ్వలేదు
నేనెపుడు నా తండ్రిచేయి పట్టుకొని నడవలేదు
వాళ్లు నడవనివ్వలేదు
నా బాల్య తూర్పు పడమరలెప్పుడు
ఆకలితో చీకటిపడేవి
ఆకలితోనే తెల్లారేవి.
నా....
బాల్యం మోయలేని బరువైన గాయం
____సత్య కలకోటి👣


Read More
Next Story