జనసేనలో చేరిన ముద్రగడ కూతురు క్రాంతి
ఎన్నికల్లో తండ్రి ముద్రగడను ఎదిరించి పవన్ కళ్యాణ్‌కు సపోర్టు చేసి ప్రచారం చేసిన క్రాంతి దంపతులు జనసేన పార్టీలో చేరారు.
తండ్రి ముద్రగడ పద్మనాభంపై తిరుగుబాటు చేసి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు జై కొట్టిన క్రాంతి దంపతులు శనివారం జనసేన పార్టీలో చేరారు. జనసేన అధ్యక్షులు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ జనసేన కండువా కప్పి తన పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమె పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేసింది. పవన్ కళ్యాణ్‌ను వ్యతిరేకించిన తండ్రి ముద్రగడను తీవ్రంగానే క్రాంతి వ్యతిరేకించింది. పవన్ కళ్యాణ్ కోసం తండ్రిని తీవ్రంగా వ్యతిరేకించిన కుమార్తెగా వార్తల్లోకి ఎక్కింది. కుమార్తె తీరును కూడా తండ్రి ముద్రగడ తప్పుబట్టారు. ముద్రగడ పద్మనాభంను గతంలో అందరి నాయకుడిగా ప్రజలు భావించినప్పటికీ గత ఎన్నికల్లో కేవలం కాపు కులం నాయకుడిగానే భావించారు.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా ఇప్పటి వరకు క్రాంతి ఎందుకు జనసేన పార్టీలో చేరలేదు? ఇప్పుడే ఎందుకు చేరింది? అనే చర్చ కూడా తెరపైకొచ్చింది. పవన్ కళ్యాణ్ గెలిస్తే.. తన పేరు చివరన రెడ్డి చేరుస్తానని సవాలు విసిరిన ముద్రగడ, తాను చెప్పిన మాట ప్రకారం ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తన పేరు మార్పు కోసం దరఖాస్తులు చేసుకొని గజిట్ నోటిఫికేషన్‌లో ముద్రించేలా చేశారు. ఆయన పేరు ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారి పోయింది. ఎన్నికల సమయంలో తండ్రీ, కూతుళ్ల మధ్య ఇంతటి వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు పార్టీలో చేరడం వెనుక క్రాంతికి ఏదైనా పార్టీ పదవులు ఇచ్చే అవకాశం ఉందా? లేకుంటే కేవలం కార్యకర్తగానే కొనసాగుతారా? అనే చర్చ కూడా జరుగుతోంది. తండ్రిని ఎదిరించిన కుమార్తెగా జనసేన పార్టీలో ఏదైనా పదవి తీసుకో గలిగితే ఆమె తీసుకున్న నిర్ణయానికి సార్థకత ఉంటుందని, లేకుంటే తండ్రిని ఎదిరించిన కూతురుగా తప్ప ఏ సార్థకత ఉండదని చర్చ జరుగుతోంది. క్రాంతి కమ్యునిటీలోను ఆమెకు ప్రత్యేకంగా ఒక వర్గం అంటూ ఏదీ లేదు. ఆమె బలం, బలహీనత రెండూ పవన్ కళ్యాణ్ అనే చెప్పొచ్చు.