ముద్రగడకు నామకరణమట.. వెరల్‌గా మారిన ఆహ్వాన పత్రిక
x

ముద్రగడకు నామకరణమట.. వెరల్‌గా మారిన ఆహ్వాన పత్రిక

పిఠాపురం నుంచి పవన్‌ కల్యాణ్‌ గెలవడం ఖాయమని, ముద్రగడ పద్మనాభంకు నూతన నామకరణ మహోత్సవం పేరుతో ఇన్విటేషన్‌.


ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ చూసినా ప్రస్తుతం పిఠాపురం, పవన్‌ కల్యాణ్, ముద్రగడ పద్మనాభం పేర్లు వినిపిస్తున్నాయి. పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ని ఓడించడమే తన ప్రధాన లక్ష్యమని, ఒక వేళ పవన్‌ కల్యాణ్‌ గెలిస్తే ముద్రగడ పద్మనాభంకు బదులుగా ముద్రగడ పద్మనాభ రెడ్డి గా తన పేరును మార్చుకుంటానని చాలెంజ్‌ చేశారు. పిఠాపురంలో రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదు కావడంతో ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పిఠాపురం అసెంబ్లీ నియోజక వర్గంలో ఎన్నడూ లేనంతగా పోలింగ్‌ జరగడం, అది జనసేన అధినేతకు ప్లస్‌ కావడం, దీంతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇక్కడ నుంచి అధిక మెజారిటీతో గెలవడం ఖాయమనే చర్చ రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం తన పేరు మర్పు అనేది మరో సారి తెరపైకి రావడంతో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఆహ్వాన పత్రిక
ముద్రగడ పేరు మార్పుకు సంబంధించి రూపొందించిన ఆహ్వాన పత్రిక సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దానిలో ఏముందంటే.. ముద్రగడ పద్మనాభంకు 2024 జూన్‌ 4 మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు నూతన నామకరణ మహోత్సవరం జరుగుతుందని గుర్తు తెలియని వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో ఒక ఆహ్వాన పత్రికను ట్రెండింగ్‌లోకి తెచ్చారు. కాపు సోదర, సోదరీమణులందరికీ ప్రత్యేక ఆహ్వానమండీ అని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ ఘన విజయం సాధించడం ఖాయమని, అలా జరిగితే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని పెద్దాయన మాట ఇచ్చారని, ఆయన మాటపై నిలబడుతారనే నమ్మకం మాకు ఉందండీ. కావున అందరూ వచ్చి ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయాల్సిందని ప్రార్థన. అంటూ గమనిక అనే కాలంలో మీ ఉప్మాలు, కాఫీలు మీరే తెచ్చుకోవాలంటూ వెటకారంగా ఆహ్వాన పత్రికపై ముద్రించారు. తాజాగా ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
రికార్డు స్థాయిలో పోలింగ్‌ శాతం
గత రెండు ఎన్నికల కంటే ఈ సారి అధికంగా పోలింగ్‌ శాతం పిఠాపురంలో నమోదైంది. 2014 ఎన్నికల్లో 79.44 శాతం పోలింగ్‌ నమోదు కాగా 2019 ఎన్నికల్లో 80.92 శాతం పోలింగ్‌ నమోదైంది. వీటిని బద్దలు కొడుతూ 2024 ఎన్నికల్లో ఏకంగా 86.63 శాతం పోలింగ్‌ నమోదు కావడం విశేషం. పిఠాపురం నుంచి ఈ సారి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ ఎన్నికల్లో బరిలోకి దిగడంతో అన్ని వర్గాల వారు ఓటేసేందుకు ఆసక్తి చూపారని స్థానికుల్లో చర్చ సాగుతోంది. దీనికి తోడు మెగా ఫ్యామిలీ, సినీ నటులు ముమ్మరంగా ప్రచారం చేయడం పవన్‌కు కలిసొచ్చిందనే టాక్‌ ఉంది. ప్రత్యేకించి యువత, వృద్ధులు భారీ స్థాయిలో గంటల కొద్ది క్యూ లైన్‌లలో నిలబడి ఓట్లేసారని, ఇతర రాష్ట్రాలతో పాటు ఇరత దేశాల్లో ఉన్న ఓటర్లు కూడా తమ విధిగా వచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారనే చర్చ స్థానికుల్లో ఉంది. వీరిలో అధిక శాతం మంది ఓటర్లు పవన్‌ వైపు మొగ్గు చూపారనే చర్చ కూడా సాగుతోంది. ఈ నేపధ్యంలో పిఠాపురం నుంచి పవన్‌ కల్యాణ్‌ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమనే టాక్‌ అటు స్థానికుల్లోను, ఇటు ఎన్డీఏ కూటమి వర్గాల్లోను నడుస్తోంది.
Read More
Next Story