
కంపుకొడుతున్న పార్టీల బురదరాజకీయం
టన్నెల్లో మూడురోజులుగా చిక్కుకున్న ఎనిమిదిమందిని సురక్షితంగా బయటకు తీసుకురావటానికి ప్రభుత్వం చేయని ప్రయత్నంలేదు
మామూలురోజుల్లో రాజకీయపార్టీలు ఎన్ని రాజకీయాలు చేసినా జనాలు పట్టించుకోరు. కాని అవతల ఎనిమిదిమంది ప్రాణాల మీదకు వచ్చిన సమయంలో కూడా పార్టీలు బురదరాజకీయాలే చేస్తామంటే ఎలాగ ? శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ (ఎస్ఎల్బీసీ)(SLBC) టన్నెల్లో ఎనిమిదిమంది ప్రాణాలు గాలిలో దీపంలాగ కొట్టుమిట్టాడుతున్నాయి. అసలా 8 మంది పరిస్ధితి ఎలాగుందో కూడా ఎవరికీ తెలీదు. టన్నెల్లో మూడురోజులుగా చిక్కుకున్న ఎనిమిదిమందిని సురక్షితంగా బయటకు తీసుకురావటానికి ప్రభుత్వం చేయని ప్రయత్నంలేదు. అయినా టన్నెల్లోపల పరిస్ధితి సహకరించకపోవటంతో చేస్తున్న ప్రయత్నాలు ఏవీ ఫలించటంలేదు. దాంతో ఏమిచేయాలో తెలీక రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం దిక్కులుచూస్తున్నది. సరిగ్గా ఇలాంటిసమయంలో బీఆర్ఎస్(BRS) కీలకనేతలు కేటీఆర్, కవిత బురదరాజకీయానికి తెరలేపారు.
టెన్నెల్లో జరిగిన ప్రమాదానికి రేవంత్ కమీషన్ల కక్కుర్తే కారణమని ట్విట్ట(Twitter)ర్ వేదికగా ఆరోపణలతో రెచ్చిపోయారు. అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి కమీషన్లకు రేవంత్ అలవాటుపడిపోయారంటు ఆరోపించారు. రేవంత్ వసూలుచేస్తున్న కమీషన్ల కక్కుర్తివల్లే ఇపుడు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగిందన్నారు. ఇప్పటికైనా కమీషన్లకు కక్కుర్తిపడకుండా ప్రమాదంలో ఉన్న ఎనిమిందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు రేవంత్ ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రయత్నంచేయాలని హితవు చెప్పారు. రేవంత్ కమీషన్లకు కక్కుర్తిపడటం ఏమిటో ? ఎవరిదగ్గర కమీషన్లు తీసుకున్నాడో మాత్రం చెప్పలేదు. ఎప్పుడైతే కేటీఆర్9KTR), కవిత(Kavitha)లు రేవంత్ ఆరోపణలు గుప్పించారో వెంటనే కాంగ్రెస్ ఎంఎల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) ఎదురు ఆరోపణలతో రెచ్చిపోయారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదానికి కేసీఆరే కారణమన్నారు. తన హయాంలో కమీషన్లు తీసుకున్న కేసీఆర్(KCR) నాసిరకం పనులు చేయించటమే ఇపుడు టెన్నెల్లో ప్రమాదానికి కారణమైందని రెచ్చిపోయారు. కమీషన్లు తీసుకోకుండా అప్పట్లో కేసీఆర్ చిత్తశుద్దితో పనులుచేయించి ఉంటే ఇపుడు టన్నెల్లో ప్రమాదం జరిగుండేదికాదన్నారు. కేటీఆర్, కవితలపై తీన్మార్ ఎదురు ఆరోపణలతో రెచ్చిపోగానే మరికొందరు నేతలు కూడా బీఆర్ఎస్ కీలకనేతలపై అవినీతి ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎస్ఎల్బీసీ టన్నెల్లో చివరిసారిగా పనులు జరగటం, ఆగిపోవటం రెండూ కేసీఆర్ హయాంలోనే. కేసీఆర్ హయాంలోనే టన్నెల్లో సొరంగం పైకప్పుకు సిమెంటుతో గ్రౌటింగ్ చేశారు. గ్రౌటింగ్ అంటే పై కప్పునుండి పెచ్చులు ఊడిపడకుండా సిమెంటుతో బలమైన పూత పూయటం. టన్నెల్లో పరిస్ధితులు సహకరించకపోవటంతో పనులను దాదాపు ఐదేళ్ళక్రితమే ఆపేశారు. అప్పట్లో నిలిపేసిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకాలానికి మొదలుపెట్టారు. అదికూడా లోపలపరిస్ధితులపై అధ్యయనంచేసి పనులు చేసుకోవచ్చని జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఐఎస్) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే.
పనులు మొదలుపెట్టిన నాలుగురోజులకే సొరంగం పై కప్పునుండి నీళ్ళు లీకేజీ మొదలై, రాళ్ళు, మట్టి జారిపడటం మొదలైంది. ఒకవైపు పనులు జరుగుతుండగానే మరోవైపు నీటి లీకేజీ పెరిగిపోయి, రాళ్ళు, మట్టి పడటం పెరిగిపడటంతోనే ప్రమాదం జరిగింది. పనులుచేయటానికి పరిస్ధితులు అనుకూలంగా ఉన్నాయని జీఎస్ఐ ఎలా సర్టిఫికేట్ ఇచ్చిందో అర్ధంకావటంలేదు. పనులు మొదలైన నాలుగురోజులకే నీటి లీకేజీ పెరిగిపోవటమే కాకుండా మట్టి, రాళ్ళు పడ్డాయంటే జీఎస్ఐ ఏమి పరీక్షలు చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ? జీఎస్ఐ గ్రీన్ సిగ్నల్ మీద నమ్మకంతోనే కాంట్రాక్టు సంస్ధ పనులు మొదలుపెట్టింది.
ఇపుడు జరిగిన ప్రమాదానికి ఎక్కువభాగం సాంకేతిక లోపాలే ముఖ్య కారణం. అసలు విషయాన్ని వదిలేసి పార్టీలు బురదరాజకీయాలకు తెరలేపటం జనాలకు కంపుకొడుతోంది. 14మాసాల క్రితం అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం జేపీ అసోసియేట్స్ కాంట్రాక్టు సంస్ధ(JP Associates) నుండి కమీషన్లు తీసుకోవటం నిజమనే అనుకుందాం. మరి పదేళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కమీషన్లు తీసుకోకుండానే ఎస్ఎల్బీసీ పనులు చేసుకునేందుకు కాంట్రాక్ట్ సంస్ధను అనుమతించిందంటే ఎవరైనా నమ్ముతారా ? మంత్రులు లేదా కాంగ్రెస్ నేతలు తమ మీద ఎక్కడ అవినీతి ఆరోపణలు చేస్తారో ? నాసిరకం పనులు, ప్రమాదానికి తమను ఎక్కడ బాధ్యులను చేస్తారో అన్న ఆందోళనతోనే అన్నా, చెల్లెళ్ళు కేటీఆర్, కవితలు ముందుజాగ్రత్తగా రేవంత్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వంపై ఆరోపణలు చేయటానికి ఇది సమయంకాదని కేటీఆర్, కవితలు ఆలోచించకపోవటమే విచిత్రంగా ఉంది. బీఆర్ఎస్ ఆరోపణలు మొదలుపెట్టింది కాబట్టి కాంగ్రెస్ కు ఎదురుదాడి మొదలుపెట్టింది.
ఇప్పటికే కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో అవినీతి, అక్రమాలు, నాసిరకం పనులపై కేసీఆర్, హరీష్ రావు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ హయాంలోనే మొదలైన కాళేశ్వరం(Kaleswaram), మేడిగడ్డ(Medigadda) ప్రాజెక్టులు బీఆర్ఎస్ హయాంలోనే దెబ్బతిన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రాజెక్టులకు వేసిన పిల్లర్లు. డ్యా ప్లాట్ ఫాంలు పగుళ్ళిచ్చేసిన విషయం అందరుచూసిందే. అందుకనే పై రెండుప్రాజెక్టులు వాడకానికి ఎంతమాత్రం పనికిరావని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటి నిపుణులు చెబుతున్నది. పై రెండుప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి, అవకతవకలు, అక్రమాలకు కేసీఆర్, హరీషే బాధ్యత వహించాల్సుంటుందని మంత్రులు ఇప్పటికే చాలాసార్లు తేల్చిచెప్పారు. పై రెండు ప్రాజెక్టుల్లో అవినీతి, అక్రమాల్లో ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ తమను ఎక్కడ విచారిస్తుందో ? తప్పుపడుతుందో అన్న టెన్షన్ కేసీఆర్, హరీష్ లో ఉండటం సహజం.
ఈ నేపధ్యంలోనే ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదం కూడా కేసీఆర్ కు ఎక్కడ చుట్టుకుంటుందో అన్న ఆందోళనతోనే కొడుకు, కూతురు ముందుజాగ్రత్తగా రేవంత్ పై అవినీతి ఆరోపణలు చేస్తున్నట్లే అనుమానంగా ఉందని తీన్మార్ ఎద్దేవాచేశాడు. ఏదేమైనా ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం నేపధ్యంలో పార్టీల బురదరాజకీయం జనాలకు కంపుకొడుతుందోన్నది వాస్తవం. ఇప్పటికైనా తమ బురదరాజకీయాలను పక్కనపెట్టి జరగాల్సిన పనులు చూస్తే బాగుంటుంది.