రాయలసీమకు ఇచ్చే నీళ్ల కంటే సముద్రంలో కలిసేవే ఎక్కువ
x

రాయలసీమకు ఇచ్చే నీళ్ల కంటే సముద్రంలో కలిసేవే ఎక్కువ

తుంగభద్ర నీటిని మళ్లించుకునేందుకు గుండ్రేవుల వద్ద రిజర్వాయర్ నిర్మించడం ఒక పరిష్కారం అంటున్నారు డా. ముచ్చుకోట సురేష్ బాబు

శ్రీశైలం నుంచి రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సరఫరా చేస్తున్న కృష్ణా జలాల కంటే ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలో కలుస్తున్న జలాలే అధికం.

ఈ నీటిని ఒడిసి పట్టి దుర్భిక్ష ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లో పీహెచ్‌పీ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచారు. శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగుల మేర ఉన్నప్పుడే పీహెచ్‌పీ ద్వారా ప్రస్తుతం ఉన్న డిజైన్‌ మేరకు 44 వేల క్యూసెక్కులను తరలించవచ్చు.

అయితే ఆ మేరకు శ్రీశైలం నీటి మట్టం ఏడాదికి సగటున 15 నుంచి 20 రోజులు కూడా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్, శ్రీశైలం కుడి గట్టు కాలువ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దుర్భిక్ష ప్రాంతాలకు వరదాయిని 'శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 854 అడుగుల్లో ఉంటేనే రాయలసీమ, నెల్లూరు ప్రాజెక్టులకు కనీసం ఏడు వేల క్యూసెక్కులైనా నీళ్లందుతాయి.

కానీ 800 అడుగుల నుంచి తెలంగాణ సర్కార్‌ నీటిని తరలిస్తుండటం వల్ల జలాశయంలో నీటి మట్టం మెయింటెయిన్‌ చేయడం కష్టమవుతోంది. కృష్ణా బోర్డు కేటాయింపులు ఉన్నా సరే నీళ్లందని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మన వాటా నీటిని వినియోగించుకుని సాగు, తాగునీటి కష్టాలను అధిగమించేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడితే, అది దుర్భిక్ష ప్రాంతాలకు కల్పతరువు. కృష్ణ జలాలపై రాయలసీమకున్న హక్కులను, శ్రీశైలం జలాశయంలో కేటాయింపులను సద్వినియోగం చేసుకునేందుకు ఉద్దేశించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రశ్నర్థకంగా మారింది.

తెలంగాణ నుండి అభ్యంతరాలు అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసులతో అర్ధాంతరంగా నిలిచిపోయింది. కృష్ణ బోర్డు పరిధిలోకి వచ్చిన 36 ప్రాజెక్టుల్లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేటర్ కూడా ఉంది. శ్రీశైలం 800 అడుగులు నుంచి పోతిరెడ్డిపాడు దిగువ భాగంలోకి కాల్వద్వారా రోజు మూడు టిఎంసిల నీటిని తరలించేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేసారు. శ్రీశైలం కుడిగట్టు కాలువతో పాటు తెలుగు గంగ, గాలేరు నగరికి కృష్ణ జలాల్లో కేటాయింపుల మేరకు 102 టిఎంసిల నీరు వరద సమయంలో 30 రోజుల్లో తరలించేందుకు వీలుగా పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని ప్రభుత్వం పెంపుదల చేసింది.

గత రెండు దశాబ్దాలుగా రాయలసీమలోని ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులలో కొన్ని పూర్తయినా వాటికి నీళ్లివ్వాలన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేటర్ సామర్థ్యం పెంచటమే మార్గమని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ అభ్యంతరం తో పాటు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ప్రాజెక్టు ముందుకు కదలాలంటే అటవీ పర్యావరణ అనుమతులు తప్పనిసరి, బోర్డు పరిథిలో పోతిరెడ్డిపాడు ఉన్నంత మాత్రాన అనుమతులు ఉన్నట్లు కాదు.

పునర్విభజన చట్టంలోని 11 వ షెడ్యూలులో ప్రస్తావించిన ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి వచ్చాయి. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు కు నీటిని తరలించే ప్రాజెక్టుకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం సవరించిన డిపిఆర్ ప్రస్తుతం అపెక్స్ కౌన్సిల్ పరిశీలనలో ఉంది. పర్యావరణ అనుమతులు వస్తే తప్ప అపెక్స్ కౌన్సిల్ అనుమతించే అవకాశం లేదు. రాయలసీమ జిల్లాలకు కృష్ణ నీరు రావాలంటే ఇదొక్కటే మార్గం. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలంలో 881 అడుగులు ఉన్నప్పుడు 44 వేల క్యూసెక్కులు, 854 అడుగులు ఉన్నప్పుడు 6 వేల క్యూసెక్కులు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎప్పుడో తప్ప ఆ స్థాయిలో శ్రీశైలం నీటి మట్టం ఉండదు.

శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి మట్టం 841 అడుగులకు తగ్గిపోతే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించడం సాధ్యం కాదు. అందువల్లనే 800 అడుగుల నుంచే నీటిని తరలించేలా ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేసారు. పోతిరెడ్డిపాడు నుంచి వినియోగించుకుంటున్న నీటి కన్నా శ్రీశైలం నుంచి కృష్ణలోకి పరవళ్లు తొక్కుతూ ప్రకాశం బ్యారేజి మీదుగా సముద్రం లోకి కలుస్తున్న నీరు శాతం కనిష్టంగా రెండు రేట్లు, గరిష్టంగా 20 రెట్లు అధికంగా ఉంటుంది. వరదజలాలతో పాటు రెండు రాష్ట్రాల కేటాయింపుల మేరకు వాడుకోలేకపోతున్న నీళ్లు కూడా ఉన్నాయి.

ప్రభుత్వం తెలంగాణ అభ్యంతరాలను సాంకేతికంగా నివృత్తి చేసి రాయలసీమ ఎత్తిపోతలను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అత్యంత కరువు పీడిత అనంతపురం జిల్లాకు కాస్త దప్పిక తీర్చడానికి వీలుగా బచావత్ ట్రిబ్యునల్ తుంగభద్ర జలాశయం నుంచి కె.సి.కెనాల్ కు కేటాయించిన 10 టిఎంసిలను పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(పిఎబిఆర్)కు కేటాయించి, ఆ మేరకు కె.సి.కెనాల్ కు శ్రీశైలం జలాశయం నుండి 10 టీఎంసీల నీటిని సర్దుబాటు చేయాలన్న చిరకాల కోరికను మన్నించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అఖిల పక్ష సమావేశం ఏకగ్రీవ౦గా తీర్మానం చేసింది. ఆ మేరకు 2005 ఆగస్టు 14న ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

కృష్ణా నదిలో వరద ప్రవాహం 30 రోజులకు మించి ఉండటం లేదని, చెన్నై నగరానికి సరఫరా చేయాల్సిన 15, యస్.ఆర్.బి.సి.కి 19 మరియు కె.సి.కెనాల్ కు 10, మొత్తం 44 టియంసిల నికరజలాలతో పాటు తెలుగు గంగకు 29, గాలేరు - నగరి సుజల స్రవంతి పథకానికి 38 కలిపి 67 టిఎంసిల మిగులు జలాలు, అలాగే త్రాగు నీటి అవసరాలకు స్థూలంగా 112 టిఎంసిలను 30 రోజుల్లో సరఫరా చేయాలంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను 44,000 క్యూసెక్కుల సామర్థ్యానికి విస్తరించడానికి 2005 లో జరిగిన అఖిలపక్ష సమావేశం ఆమోద ముద్ర వేసింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి పూర్తి స్థాయిలో నీటిని తరలించాలంటే శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటి మట్టం ఉంటే తప్ప సాధ్యం కాదు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996 జూన్ 15న జారీ చేసిన జి.ఓ.నెం.69 అవరోధంగా ఉన్నాయన్న భావన బలంగా ఉన్నది. దాని ప్రకారం కనీస నీటి మట్టం 834 అడుగులుగా నిర్ధారించబడింది. అంత కంటే దిగువకు నీటి మట్టం పడిపోతే కేవలం త్రాగు నీటి అవసరాలకే నీటిని విడుదల చేయాలి. కానీ, ఆ నిబంధన తరచూ ఉల్లంఘనలకు గురవుతున్నది. 834 అడుగుల నీటి మట్టం లేకపోతే హంద్రీ - నీవా సుజల స్రవంతికి మల్యాల దగ్గర నిర్మించిన ఎత్తిపోతల నుండి నీటి సరఫరా సాధ్యం కాదు.

అందుకే కె.సి.కెనాల్ మరియు హంద్రీ - నీవాకు నీటిని తరలించడానికి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని 2008లోనే నిర్మించ తలపెట్టారు. ఈ పథకం ద్వారా 810 అడుగుల నీటి మట్టం దగ్గర నుంచే నీటిని తీసుకెళ్లవచ్చు. అప్రోచ్ కెనాల్ నిర్మాణం కూడా పూర్తైతే 798 అడుగుల నీటి మట్టం నుండి కూడా నీటిని తీసుకెళ్ళవచ్చని చెబుతున్నారు. అందులో ఉన్న ప్రమాదాన్ని కూడా గుర్తెరిగి మాట్లాడితే బాగుంటుంది. ఆ నీటి మట్టం దగ్గర అసలు నీటి లభ్యత ఎంత? శ్రీశైలం జలాశయంలో ఒండ్రుమట్టి చేరిపోతూ నీటి నిల్వ సామర్థ్యం కూడా తరిగిపోతున్న నేపథ్యంలో ఇది సాధ్యమేనా!

రాయలసీమకు నీళ్ళిచ్చి మాకు ఇవ్వలేదన్నఅపోహ నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టుదారులలో, వచ్చిన నీళ్ళ అన్నింటినీ రాయలసీమకు మళ్ళించుకు పోతున్నారన్న దుష్ప్రచారం నిరంతరం విద్వేషాలు రెచ్చగొట్టే దుష్టశక్తులకు అవకాశం కల్పించడానికి ఉపయోగపడుతుంది. అంతే కానీ, ఆచరణలో రాయలసీమకు నేడున్న పరిస్థితుల్లో పై నుంచి శ్రీశైలం జలాశయంలోకి ప్రవాహం పెరిగితే తప్ప సాధ్యం కాదని అందరికీ విధితమే.

శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ పెరిగితే ముచ్చుమర్రి నుండి నీటిని తరలించడానికి వీలవుతుంది. ఆ మేరకు తప్పని సరిగా హర్షించ తగ్గ చర్యే. మిగిలి ఉన్న నిర్మాణ పనులను కూడా సత్వరం పూర్తి చేసి, వినియోగంలోకి వస్తే ప్రజలు హర్షిస్తారు. శాస్త్రీయమైన, హేతుబద్ధమైన ఆలోచనలను, ధృక్పథాన్ని పెంపొందించాల్సిన ప్రభుత్వం పుష్కరాలు, పూజలు, పునస్కారాలు, జలహారతులు వగైరా కార్యక్రమాల ద్వారా మూఢనమ్మకాలను, అశాస్త్రీయ భావాలను పెంపొందించే రీతిలో వ్యవహరించడం కూడా ఏ మాత్రం సమర్థనీయం కాదు. పైపెచ్చు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే.

తుంగభద్ర నదీ జలాలు దాదాపు ప్రతి ఏడాది 50, 60 టియంసిలు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతున్నాయి. శ్రీశైలం జలాశయానికి చేరిన నీటిని మళ్ళీ ఎత్తిపోతల పథకాల ద్వారా కె.సి.కెనాల్ కు, హంద్రీ - నీవాకు తరలించాల్సి వస్తున్నది. సుంకేసుల ఆనకట్టకు పై భాగంలో తుంగభద్రా నదిపై 15-20 టియంసిల సామర్థ్యంతో గుండ్రేవుల రిజర్వాయరును నిర్మిస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్న ప్రతిపాదన ఉన్నది. దానిపై తక్షణం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి.

Read More
Next Story