
ఈపీఎఫ్‌వోలో మరిన్ని కీలక మార్పులు
ఈపీఎఫ్వో నిబంధనలు సడలించి ఉపసంహరణలు మరింత సులభతరం చేసింది. దేశంలో 7 కోట్ల మందికి లాభం చేకూరుతుంది.
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తన సేవలను మరింత వినియోగదారుల అనుకూలంగా మార్చుతూ కీలక నిర్ణయాలు తీసుకుంది. పాక్షిక ఉపసంహరణలను సరళీకృతం చేసి, అర్హత కలిగిన నిల్వల నుంచి 100 శాతం వరకు డబ్బు తీసుకునే అవకాశం కల్పించింది. అంతేకాకుండా, ఖాతాలో 25 శాతం చందాను కనీస నిల్వగా నిర్వహించాలని స్పష్టం చేసింది. దీంతో మిగిలిన 75 శాతాన్ని పూర్తిగా ఉపసంహరించుకునే వెసులుబాటు లభిస్తుంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సోమవారం ఈ నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. ఫలితంగా దేశవ్యాప్తంగా 7 కోట్ల మంది చందాదారులు ప్రయోజనం పొందనున్నారు.
ఉపసంహరణ నిబంధనల్లో సరళీకరణ
గతంలో పాక్షిక ఉపసంహరణల కోసం 13 రకాల సంక్లిష్ట నియమాలు అమల్లో ఉండేవి. వీటిని విలీనం చేసి మూడు ప్రధాన విభాగాలుగా వర్గీకరించారు.
అత్యవసర అవసరాలు: అనారోగ్యం, విద్య, వివాహం వంటి కారణాలు ఇందులోకి వస్తాయి.
గృహ సంబంధిత అవసరాలు: ఇంటి నిర్మాణం, మరమ్మత్తులు మొదలైనవి.
ప్రత్యేక పరిస్థితులు: ఇకపై ఎలాంటి నిర్దిష్ట కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ప్రకృతి విపత్తులు, సంస్థ మూసివేత, ఉద్యోగ నష్టం వంటి వివరాలు తప్పనిసరి కాగా, ఇప్పుడు అవి అవసరం లేదు. దీంతో క్లెయిమ్‌ల తిరస్కరణలు, ఫిర్యాదులు తగ్గుతాయి.
ఈ మూడు కేటగిరీల కింద చందాదారులు తమ అర్హత నిల్వల నుంచి (ఉద్యోగి, యజమాని వాటాలు కలిపి) 100 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. అంతేకాకుండా వివాహం, విద్య కోసం ఉపసంహరణల సంఖ్యను పెంచారు. గతంలో సర్వీసు కాలంలో మూడుసార్లు మాత్రమే అవకాశం ఉండగా, ఇప్పుడు విద్య కోసం 10 సార్లు, వివాహానికి 5 సార్లు తీసుకోవచ్చు. పాక్షిక ఉపసంహరణకు కనీస సర్వీసు కాలాన్ని 12 నెలలకు తగ్గించారు.
ఇతర ముఖ్య మార్పులు
ఈపీఎఫ్‌వో 3.0: సేవలను కోర్ బ్యాంకింగ్ తరహాలో నిర్వహించేందుకు, పీఎఫ్ సర్వీసులను ఆధునీకరించేందుకు ఈపీఎఫ్‌వో 3.0కు సీబీటీ ఆమోదం తెలిపింది. దీన్ని విడతలవారీగా అమలు చేయనున్నారు.
వేచి ఉండే కాలం పెంపు: ముందస్తు ఉపసంహరణ తుది సెటిల్‌మెంట్‌కు వేచి ఉండే కాలాన్ని 2 నెలల నుంచి 12 నెలలకు పెంచారు. ముందస్తు పింఛను నిధి (ఈపీఎస్) ఉపసంహరణకు 2 నెలల నుంచి 36 నెలలకు పొడిగించారు.
జరిమానాల తగ్గింపు: ఆలస్యమైన పీఎఫ్ చెల్లింపులపై జరిమానాలను తగ్గించారు. ఇతర వ్యాజ్యాలు పరిష్కరించేందుకు 'విశ్వాస్' పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ఆరు నెలలు అమల్లో ఉంటుంది. అవసరమైతే మరో ఆరు నెలలు పొడిగించవచ్చు.
పింఛనుదారులకు సౌకర్యం: ఈపీఎస్ 95 పింఛనుదారులకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (డీఎల్‌సీ) సేవలను ఇంటి వద్దే అందించనున్నారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ)తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.50 ఖర్చును ఈపీఎఫ్‌వో భరిస్తుంది.
అక్టోబరు ఈసీఆర్ గడువు: అక్టోబరు నెలకు ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ (ఈసీఆర్) చెల్లింపు గడువును 22వ తేదీ వరకు పొడిగించారు.
ఈ మార్పులతో వేతన జీవుల ఖాతాల్లో నిల్వలపై మంచి వడ్డీ రేటు పొందే అవకాశం పెరుగుతుందని ఈపీఎఫ్‌వో అధికారులు తెలిపారు. మొత్తంగా ఈ నిర్ణయాలు చందాదారులకు ఆర్థిక సౌలభ్యం, సరళతను అందిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.