
మొంథా ముంచేసింది..ఆదుకోండి
మొంథా తుపాను నష్టంపై కేంద్ర బృందానికి ఆర్టీజీఎస్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
మొంథా తుపాను రాష్ట్రంలో అంచనాలకు మించి అపార నష్టం కలిగించిందని, కేంద్ర ప్రభుత్వం ఉదారత చూపి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని కోరింది. మొంథా తుపాను వల్ల రూ.6384 కోట్ల నష్టం వాటిల్లిందని, రూ.901.4 కోట్లు తక్షణ సాయం చేసి ఆదకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. మొంథా తుపాన్ వల్ల వాటిల్లిన నష్టం మదింపు వేయడానికి కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చింది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పాసుమీబసు, కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కె. పొన్నుస్వామీల నేతృత్వంలోని 8 మంది సభ్యులతో కూడిన కేంద్ర బృందం సోమవారం ముందుగా అమరావతిలోని సచివాలయానికి వచ్చింది.
ఈ బృందానికి సచివాలయంలోని ఆర్టీజీఎస్ లో అధికారులు స్వాగతం పలికారు. అనంతరం మొంథా తుపాను కలిగించిన నష్టం గురించి రెవెన్యూ శాఖ చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.జయలక్ష్మీ , ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్‌లు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. మొంథా తుపాన్ రాష్ట్రంలోని 24 జిల్లాల్లో విధ్వంసం సృష్టించిందని తెలిపారు. అంచనాలకు మించిన అపార నష్టం కలిగించిందని జయలక్ష్మీ చెప్పారు. వ్యవసాయరంగానికి మొంథా తుపాను తీవ్ర నష్టం కలిగించిందన్నారు. కోత దశకు వచ్చిన పంటలను తుపాను ముంచెత్తిందని దానివల్ల రైతులకు జీవనాధారమైన పంటలు నీట మునిగిపోయి కోలుకోలేని దెబ్బతీసిందన్నారు. 1.61 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మినుము, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్లు చెప్పారు.
అలాగే 6,250 హెక్టార్లలో ఉద్యానవన పంటలు , 17.72 హెక్టార్లలో మల్బరీ తోటలకూ నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ తుపాన్ కారణంగా మత్స్యకారులు కూడా బాగా దెబ్బతిన్నారన్నారు. 3063 హెక్టార్లలో చేపల చెరువులు ధ్వంసమయ్యాయని వివరించారు. తుపాను కారణంగా 4,566 ఇళ్లు దెబ్బతిన్నాయని, 1853 పాఠశాలలకు కూడా నష్టం వాటిల్లిందని వెల్లడించారు. ఆర్ అండ్ బీ శాఖకు సంబంధించి 4,794 కిలోమీటర్ల రోడ్లు, 311 వంతెనలు, కల్వర్టు దెబ్బతిన్నయాన్నారు. జలవనరుల శాఖకు సంబంధించి 3437 మైనర్ ఇరిగేషన్ పనులు, 2417 మేజర్ మరియు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులకు నష్టం వాటిల్లిందన్నారు. ఈ వర్షాల వల్ల 58 అర్బన్ లోకల్ బాడీస్‌కు కూడా నష్టం వాటిల్లిందని చెప్పారు. ఈ విపత్తు కలిగించిన విధ్వంసం నుంచి బాధితులు కోలుకోవడానికి కేంద్ర ఉదారంగా వ్యవహరించాలని కోరారు. తుపానుకు సర్వం కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధితులు మళ్లీ కోలుకోవడానికి కేంద్రం అందించే సహాయం, సహకారం ఎంతో కీలకమని అన్నారు.
680 డ్రోన్లు ఉపయోగించాం
రాష్ట్ర ప్రభుత్వం తుపాను ఎదుర్కోవడానికి ఎంతో ముందస్తు ప్రణాళికతో వ్యవహరించడం వల్ల పెద్దగా ప్రాణ నష్టం జరగకుండా నివారించగలిగామని అధికారులు వివరించారు. సహాయక కార్యక్రమాలు కూడా యుద్ధప్రాతిపదికన చేపట్టామని తెలిపారు. బుడమేరు వరదల అనుభవంతో ఈ సారి వరద సహాయక చర్యల కోసం 680 డ్రోన్లు ఉపయోగించామని చెప్పారు. అక్టోబరు 27-29 వ తేదీల మధ్య 82.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని ఇది సాధారణ వర్షపాతం కంటే 9 రెట్టు ఎక్కువన్నారు. 443 మండలాల్లో ఈ తుపాన్ ప్రభావం చూపించిందని, ఈ విపత్తు కారణంగా 3 మృతి చెందారని, 9,960 ఇళ్లు నీట మునిగాయని, 1,11,402 మంది నిరాశ్రయులయ్యారని తెలిపారు. తుపాను సహాయక చర్యల్లో 12 ఎన్డీఆర్ ఎఫ్, 13 ఎస్డీఆర్ ఎఫ్ బృందాలను, 1,702 వాహనాలను, 110 మంది ఈతగాళ్లను వినియోగించామని వెల్లడించారు. 22 జిల్లాల్లో 2,471 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి1,92,441 మందికి పునరావాసం కల్పించామన్నారు.
Next Story

