మోదీ పర్యటన–ట్రాఫిక్‌ మళ్లింపులు
x

మోదీ పర్యటన–ట్రాఫిక్‌ మళ్లింపులు

మోదీ అమరావతి పర్యటన సందర్భంగా భారీ ఎత్తున వాహనాల ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టారు.


మే2న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతికి రానున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ మళ్లింపులకు చర్యలు చేపట్టారు. ప్రజలు, వాహనదారులు, ప్రయాణికులు సహకరించాలని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా కోరారు. మే 2, 2025 ఉదయం 5:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు ట్రాఫిక్‌ మళ్లింపులు అమలులోకి వస్తాయి. అమరావతిలో శంకుస్థాపన కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన సంబంధిత బహిరంగ సభ సజావుగా సాగడానికి జాతీయ, రాష్ట్ర రహదారులపై ట్రాఫిక్‌ రద్దీని నివారించడానికి ప్రజల సౌకర్యం కొరకు ఈ క్రింద విదంగా ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆ మేరకు మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.

ట్రాఫిక్‌ మళ్లింపులు ఇలా
చెన్నై వైపు నుండి విశాఖపట్నంనకు వయా విజయవాడ మీదుగా ఇబ్రహీంపట్నం, నందిగామ, వైపుకు వెళ్ళు భారీ గూడ్స్‌ వాహనాలు ఒంగోలు జిల్లా త్రోవగుంట వద్ద నుండి చీరాల– బాపట్ల – రేపల్లె – అవనిగడ్డ– పామర్రు గుడివాడ హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా విశాఖపట్నం, ఇబ్రహీంపట్నం వైపునకు మళ్ళించనున్నారు. అదే విదంగా విశాఖపట్నం నుండి చెన్నై వైపు వాహనాలు కూడా ఇదే మార్గం గుండా వెళ్లే విధంగా ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టారు. చిలకలూరిపేట వైపు నుండి విశాఖపట్నం వెళ్ళే వాహనాలను చిలకలూరి పేట నుండి జాతీయ రహదారి–16 మీదుగా పెదనందిపాడు, కాకుమాను, పొన్నూరు, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జ్‌ మీదుగా అవనిగడ్డ, పామర్రు గుడివాడ – హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా విశాఖపట్నం వైపు వెళ్లాల్సి ఉంటుంది.
చెన్నై నుండి విశాఖపట్నం వెళ్ళే వాహనాలను బోయపాలెం క్రాస్‌ వద్ద నుండి ఉన్నవ గ్రామం, ఏబిపాలెం, వల్లూరు, పాండ్రపాడు, పొన్నూరు, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జ్‌ మీదుగా అవనిగడ్డ, పామర్రు –గుడివాడ–హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించేందుకు చర్యలు చేపట్టారు.
గుంటూరు నుండి విశాఖపట్నం వైపు వెళ్ళే వాహనాలను బుడంపాడు క్రాస్‌ మీదుగా తెనాలి – వేమూరు– కొల్లూరు – వెల్లటూరు జంక్షన్‌ – పెనుముడి బ్రిడ్జ్‌ మీదుగా అవనిగడ్డ, పామర్రు – గుడివాడ – హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించనున్నారు. గన్నవరం వైపు నుండి హైదరాబాద్‌కు వయా ఆగిరిపల్లి – శోభనాపురం గణపవరం మీదుగాను, మైలవరం జి కొండూరు ఇబ్రహీంపట్నం మీదుగాను వెళ్లే విధంగా ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టారు.
విశాఖపట్నం నుండి హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాలు హనుమాన్‌ జంక్షన్‌ నుంచి నూజివీడు – మైలవరం జి కొండూరు – ఇబ్రహీంపట్నం వైపు భారీ గూడ్స్‌ వాహనాలు వెళ్ళవలెను. అదే విదంగా హైదరాబాద్‌ నుండి విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలు కూడా ఇదే మార్గం గుండా వెళ్లవలసి ఉంటుంది.
మల్టీ–యాక్సిల్‌ గూడ్స్‌ వాహనాలకు ప్రత్యేక సూచనలు చేశారు. చెన్నై నుండి విశాఖపట్నం వెళ్లే ఈ వాహనాలు చిలకలూరిపేట, ఒంగోలు, నెల్లూరు వద్ద జాతీయ రహదారి దగ్గర మళ్లింపు లేకుండా నిలిపివేయబడతాయి. విశాఖపట్నం నుండి చెన్నై వెళ్లే ఈ వాహనాలు హనుమాన్‌ జంక్షన్, పొట్టిపాడు టోల్‌ గేట్‌ వద్ద జాతీయ రహదారి దగ్గర ఆపివేయబడతాయి. ఆగిన అన్ని మల్టీ–యాక్సిల్‌ వాహనాలు 2025 మే 2న రాత్రి 9:00 గంటల తర్వాత ముందుకు సాగడానికి అనుమతించబడతాయని తెలిపారు. ఈ సమయంలో ట్రాఫిక్‌ సజావుగా సాగేలా చూసేందుకు ప్రయాణీకులు సహకరించాలని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ కోరారు.
Read More
Next Story