మోదీ మత రాజకీయాలు.. జగన్‌ కుల రాజకీయాలు..
x

మోదీ మత రాజకీయాలు.. జగన్‌ కుల రాజకీయాలు..

ఒకరు దేశ ప్రధాని.. మరొకరు రాష్ట్ర ముఖ్యమంత్రి. వీరి ఆలోచనలు మతం, కులం మధ్య చిచ్చు రగిల్చేలా ఉన్నాయని మేధావి వర్గం ఆందోళన చెందుతోంది.


భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో చేస్తోన్న వ్యాఖ్యలు దేశ ప్రజలకు ఏమని సందేశం ఇస్తున్నాయో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ముస్లింలు చొరబాటు దారులని, ఎక్కువ మంది పిల్లలను కనే వారని ఈ నెల 21న రాజస్థాన్‌లోని బాంస్వాడలో ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యానించారు. మతం, కులం తెగల ఆధారంగా ఓట్లు అడగరాదని, మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలను చేయరాదని, ఎన్నికల సంఘం నియమావళి చెబుతోంది. అయినా మతాన్ని కులాన్ని పాలకులు వాడుకుంటూనే ఉన్నారు. ప్రజల సంపదను, మైనారిటీలకు పంచిపట్టాలని కాంగ్రెస్‌ చూస్తోందని, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అది జరుగుతుందని, మహిళల మంగళసూత్రాలను కూడా కాంగ్రెస్‌ పార్టీ వదిలి పెట్టదని మోదీ అనడంతో ఎన్నికల ప్రచారంలో మరింత దుమారం రేగింది. ఇదంతా ఓటర్లను రెచ్చగొట్టే ప్రసంగమేనని ప్రధాని నరేంద్ర మోదీపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని 16 ఫిర్యాదులు అందాయి. 18 ఏళ్ల క్రితం నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఎస్సీ,ఎస్టీలు, మైనారిటీలు, ప్రత్యేకించి ముస్లింలు అభివృద్ధి ఫలాలను అందుకోవాలని, అందుకోసం నూతన పథకాలను రూపొందించాలని, వారందరికీ వనరులపై మొదటి హక్కు ఉండాలన్నారు. దీనిని వక్రీకరిస్తూ ప్రధాని మోదీ మాట్లాడారని కాంగ్రెస్‌ వారు ప్రధానిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. భారత దేశంలో 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారని, వీరంతా చొరబాటుదారులు ఎలా అవుతారని కాంగ్రెస్‌ వారు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ప్రసంగాలన్నీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకే వస్తాయని, ప్రధానిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, కమ్యునిస్టు పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి.

దేశంలో బిజెపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట ముస్లిం సామాజిక వర్గంపై విషపూర్తితమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉందని ముస్లిమ్‌ నాయకులు అంటున్నారు. అయితే భారత రాజ్యాంగాన్ని గౌరవించి అమలు చేసే ప్రధానమై వ్యక్తిగా మోదీ ఉన్నారని, ఆయన తన బాధ్యతలను మరచి లౌకిక రాజ్యాంగాన్ని అలౌకిక రాజ్యాంగమనే స్థితికి తీసుకొనిపోతున్నారని, దీనిని అరికట్టడంలో రాజ్యాంగ వ్యవస్థలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని రాజ్యాంగ పరిరక్షణ సమితి నాయకులు అంటున్నారు. ఎన్నికల సమయంలో విద్వేషపూరిత ప్రసంగాలకు తావివ్వకూడదనే విషయం ప్రధానికి తెలియంది కాదనేది ప్రజాస్వామ్య వాదుల వాదన.
పైగా ఎన్నికల్ల సభల్లోనే ముస్లిం ఓట్లు మాకు అవసరం లేదని బిజెపీ నేతలు మాట్లాడటం కూడా ఈ దేశంలో ఇప్పటికే చాలా సార్లు చర్చలకు కారణమైంది. ఎవరు ఎన్ని ఆక్షేపణలు చేసినా బిజెపీ వారు అనుకున్నది అనుకున్నట్లు మతాన్ని అడ్డం పెట్టుకొని ముందుకు పోతున్నారని, దీనిని ఆపకుంటే భవిష్యత్‌లో ప్రజాస్వామ్యం అనే భావనకు అర్థం మారి పోతుందని ప్రజాస్వామిక వాదులు వాపోతున్నారు.
రాజధాని నగరమైన ఢిల్లీలోనే కేంద్ర ప్రభుత ఆధ్వర్యంలో ముస్లింలు నివసించే ప్రాంతాన్ని బుల్డోజర్లతో తొక్కించి మా పాలన ముస్లింలను అణచి వేయడమేనని స్పష్టం చేసింది. రాజ్యాంగం ఇచ్చిన హక్కును భారత ప్రభుత్వంలో పాలకులుగా ఉన్న బిజెపీ వారు దుర్వినియోగానికి పాల్పడ్డారని లౌకిక వాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారే తప్ప వారి చేష్టలకు అడ్డుకట్ట వేయలేక పోతున్నారని చర్చ కూడా సాగుతోంది. మంచి పాలన అందిస్తున్న ఢిల్లీ నగరంలోని పాలకులనే తొక్కిపెట్టి ప్రభుత్వ సంస్థలను గుప్పెట్లోకి తీసుకొని జైళ్ల పాలు చేయడాన్ని ప్రజాస్వామిక వాదులు, ఢీల్లీ ప్రజలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నా, ప్రధాని మోదీ మాత్రం పెదవి విప్పలేదు. అంటే బిజెపీ పాలకులు ఏదైతే అనుకుంటున్నారో దానినే అమలు చేస్తూ రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తున్నారని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఉత్తర భారత దేశంలోని 21 రాష్ట్రాల పరిధిలో 102 లోక్‌ సభ స్థానాలకు ఏప్రిల్‌ 19న అక్కడి ఓటర్లు తీర్పు ఇచ్చేశారు. ఈ తీర్పు అనుకూలంగా ఉందో లేదో తెలుసుకోలేని స్థితిలో బిజెపీ లేదు. అందుకే వారిలో గుబులు మొదలైందేమో ఇటువంటి వ్యాఖ్యలు వారి నుంచి వస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య వ్యాఖ్యానించారు.
ఈ పరిణామాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన ఎన్నికల కమిషన్‌ కొద్దిగా ఆలస్యంగానైనా స్పందించింది. ప్రధాని వ్యాఖ్యలకు సంబంధించి సరైన వివరణ ఇవ్వాలని మోదీకి నోటీసులు జారీ చేసింది. ఇవి కేవలం నోటీసులుగానే మిగిలిపోతాయా కనీస చర్యలు ఏమైనా ఉంటాయా అనే చర్చ కూడా దేశ వ్యాప్తంగా జరుగుతోంది. భారతీయ సమాజం పురోగమనంలో ముందడుగు వేయాలంటే కుల, మత రాజకీయాలను అందరు అసహ్యించుకోవాలి. అందుకు ఓటే సరైన ఆయుధమని జనచైతన్యాన్ని కోరుకునే నేతలు వ్యాఖ్యానించడం విశేషం.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అమరావతి రాజధానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కులం రంగు పులిమారు. కేవలం కమ్మ సామాజిక వర్గానికే ఈ ప్రాంతం పరిమితమైందని, అమరావతి రాజధాని అందరిది కావాలంటూ అనేక సభల్లో కుల ప్రస్తావన లేకుండా మాట్లాడారు. విజయవాడ నగరం నడిబొడ్డులో డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహ స్థాపన కూడా కమ్మ సామాజిక వర్గంపై కొరడా ఝుళిపించడానికే అనే ప్రచారం సాగుతోంది. మతం రంగు పులుముతున్న మోదీకి, కులం రంగు పులిమిన జగన్‌కు పెద్ద తేడా అంటూ ఏమీ లేదనేది రాజకీయ పరిశీలకుల వ్యాఖ్య. ఐదేళ్ల కాలం అమరావతిలో ఉన్న ఇటుక, ఇసుక, ఇనుము చెదలు పట్టాయి. దీనికి కారణం సీఎం వైఎస్‌ జగన్‌ అని నిస్సందేహంగా ఎవరైనా చెబుతారు. తెలుగుదేశం అధికారంలో ఉండగా అమరావతి నిర్మాణానికి రూపకల్పన చేసింది. వైఎస్‌ఆర్‌సీపీ అధికారం చేపట్టగానే ఆ రూపకల్పనను చిధ్రం చేసింది. ఇవి కళ్ల ముందు కనిపిస్తున్న నిజాలు. ఇవే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఓటర్లుకు ఆయుధాలు. ముఖ్యమంత్రి జగన్‌ ఎక్కడ మాట్లాడిన పెద్దలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్ధమని నేను పేదల పక్షమని, నేను సాయం చేశానని భావిస్తేనే నాకు ఓటు వేయండని ప్రచారం చేస్తున్నారు. జగన్‌ దృష్టిలో పెద్దలు, పెత్తందారులనే వాళ్లు టీడీపీలోని కమ్మ సామాజిక వర్గం వారని, పరోక్షంగా స్పష్టం చేస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో కులం చిచ్చు మొదలైంది. అది ఈ ఎన్నికల్లో తారా స్థాయికి చేరింది. ఇక 2029 ఎన్నికల్లో ఈ కులం చిచ్చు జడలు విప్పి నాట్యం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
ఒకరు మతాలను అడ్డం పెట్టుకొని మైనారిటీల వర్గాలను కించపరచడం, మరొకరు అమరావతిని అడ్డంపెటుకొని సామాజిక వర్గాలను అణగ దొక్కాలని ఆలోచనలు చేయడం ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి అరిష్టమే తప్ప ఆలోచనా శక్తిని పెంచి ప్రజలకు సౌభాగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి పనికి రావు. పాలకుల తీరు ఎప్పుడు మారుతుందో పాలితులు కూడా వారికి అనుగుణంగా నడుచుకోవడానికి అలవాటు పడుతారు. లేకుండా విద్వేషాలు నిండిన మనుసులతో రగలి పోవడానికి పాలకులే ప్రధాన కారణమవుతారు. అందుకు మూల్యం పాలకులు చెల్లించక తప్పదు.
Read More
Next Story