గేమ్ ఛేంజర్ గా మోదీ సంస్కరణలు: సీఎం చంద్రబాబు
x
పీఎం సభలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

గేమ్ ఛేంజర్ గా మోదీ సంస్కరణలు: సీఎం చంద్రబాబు

సూపర్ జీఎస్టీ -సూపర్ సేవింగ్స్ బచత్ ఉత్సవ్ బహిరంగ సభలో పాల్గొని సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రధాన మంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు.


ముఖ్యమంత్రిగా... ప్రధానిగా 25 ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్న ప్రధానికి ప్రత్యేక అభినందనలు. సరైన సమయంలో సరైన చోట సరైన వ్యక్తిగా ప్రధాని మోదీ ఓ విశిష్టమైన వ్యక్తి. 21వ శతాబ్దపు నేత. ఎందరో ప్రధానమంత్రులతో కలిసి పని చేసినా మోదీ లాంటి వ్యక్తిని చూడలేదు. విరామం, విశ్రాంతి లేకుండా నిర్విరామంగా ప్రజాసేవలోనే ఉంటున్న అరుదైన వ్యక్తి మోదీ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కర్నూలులో సూపర్ జీఎస్టీ -సూపర్ సేవింగ్స్ బచత్ ఉత్సవ్ బహిరంగ సభకు ప్రధాని మోదీతో కలిసి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభలో మాట్లాడారు. కేంద్ర సహకారంతో అమరావతిని నిలబెట్టామని అన్నారు.

శక్తిపీఠం, జ్యోతిర్లింగం ఒకేచోట కొలువై ఉన్న దివ్యక్షేత్రం శ్రీశైలం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టిన పౌరుషాల గడ్డ లో జీఎస్టీ బచత్ ఉత్సవ్ సభకు ప్రధాని హాజరు కావటం సంతోషంగా ఉందని అన్నారు. ఎస్టీ సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రధాని మోదీకి ఏపీ ప్రజల తరపున అభినందనలు తెలిపారు.


ప్రధాని మోదీ తెచ్చిన సంస్కరణలు దేశానికి గేమ్ చేంజర్లుగా మారాయి. ప్రగతిశీల దేశంగా 2047 నాటికి భారత్ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచి సూపర్ పవర్ గా తయారవుతుంది. 11 ఏళ్లలో 4 కోట్ల కుటుంబాలకు పక్కా ఇళ్లు, 81 కోట్ల మందికి ఉచితంగా రేషన్, 144 వందే భారత్ రైళ్లు, 55 వేల కి.మీ మేర కొత్త హైవేలు, 86 ఎయిర్ పోర్టులు, 16 ఎయిమ్స్ ఆస్పత్రులు నిర్మించిన ఘనత ప్రధాని మోదీదేనన్నారు.

7 ఐఐటీలు, 8 ఐఐఎంలను తీసుకువచ్చిన రికార్డు కూడా ప్రధాని మోదీదే ఇది ఆల్ టైం రికార్డు. ప్రధాని సంకల్పంతోనే 11 ఏళ్ల క్రితం 11వ ఆర్ధిక వ్యవస్థగా ఉన్న భారత్‌ 4వ స్థానానికి వచ్చింది. 2028 నాటికి 3వ, 2038కి 2వ ఆర్ధిక శక్తిగా భారత్ ఎదుగుతుంది. ఆర్థికంగా మనం బలం ఏంటో ఈ విజయాలు చెబితే...సైనికంగా మన బలం ఏంటో ఆపరేషన్ సింధూర్ చాటిందని చెప్పారు.

మోదీ సంకల్పంతో 11వ స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరాం. ఆపరేషన్‌ సిందూర్‌.. మన సైనిక బలం నిరూపించింది. మాటలతో కాదు.. చేతలతో చూపించే వ్యక్తి ప్రధాని మోదీ.

ఒకే దేశం-ఒకే పన్ను- ఒకే మార్కెట్ విధానంతో తెచ్చిన జీఎస్టీ 2.0లో 99 శాతం వస్తువులు సున్నా, 5 శాతం శ్లాబ్ ల పరిధిలోనే ఉన్నాయి. జీఎస్టీ పన్ను తగ్గింపుతో నిత్యావసరాల వస్తువుల ధరలు తగ్గాయి. పేద మధ్య తరగతి వర్గాలకు ఇదో పెద్ద రిలీఫ్. రైతులు, విద్యార్ధులు, చిరువ్యాపారులు, ఇలా అన్ని వర్గాలకూ లబ్దికలిగేలా సంస్కరణలు ఉన్నాయి. జీఎస్టీ నెక్స్ జెన్ సంస్కరణలతో ప్రతీ కుటుంబానికీ ఏడాదికి రూ.15వేలు ఆదా అవుతోంది. దసరా నుంచి దీపావళి వరకూ ఆ తర్వాత కూడా జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలను వివరించేలా కార్యక్రమాలు ఉంటాయని ముఖ్యమంత్రి చెప్పారు.

సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరిట 98 వేలకు పైగా ఈవెంట్లు నిర్వహించాం. జీఎస్టీ సంస్కరణలతో బచత్ ఉత్సవ్... ఇవాళ భరోసా ఉత్సవ్ గా మారింది. కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ తో రాష్ట్రానికి డబుల్ బెనిఫిట్ జరిగింది. సూపర్ సిక్స్ పథకాలతో పాటు సూపర్ జీఎస్టీతో ఏపీ ప్రజలకు సూపర్ సేవింగ్స్ జరిగాయి అని చంద్రబాబు నాయుడు అన్నారు.


మెగా డీఎస్సీ, పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి, తల్లికి వందనం, దీపం-2.0, పెన్షన్ల పంపిణీ, వంటి సంక్షేమ పథకాలతో సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం. ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రధాని చెప్పిన స్వదేశీ మంత్రం మనకు బ్రహ్మాస్త్రంగా మారుతుంది. గర్వ్‌ సే కహో, యే స్వదేశీ హై’ అన్న మోదీజీ నినాదాన్ని ఏపీ అందిపుచ్చుకుంటోంది. సెమికండక్టర్ల నుంచి శాటిలైట్ల వరకు... చిప్‌ నుంచి షిప్‌ వరకు మన దగ్గరే ఉత్పత్తి చేసేలా కార్యాచరణ చేపట్టాం. కేంద్రం సహకారంతో అమరావతిని నిలబెట్టాం, పోలవరాన్ని గాడిన పెట్టాం, విశాఖ ఉక్కును బలోపేతం చేశాం. విశాఖలో ఆర్సెల్లార్ మిట్టల్, నెల్లూరుకు బీపీసీఎల్ ప్రాజెక్టులు వచ్చాయి. ఇప్పుడు విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ ఏఐ డేటా హబ్ ఏర్పాటు అవుతోంది అని ముఖ్యమంత్రి చెప్పారు.

వీటితో పాటు సెమీ కండక్టర్ యూనిట్‌, క్వాంటం వ్యాలీ రావడానికి కారణమైన మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెపుదాం. త్వరలోనే రాయలసీమకు హైకోర్టు బెంచ్ వస్తుంది. రాయలసీమ ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. రాయలసీమలో స్టీల్, స్పేస్, డిఫెన్స్, ఏరో స్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్స్ తయారీ, గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, సిమెంట్ పరిశ్రమలు వస్తున్నాయి. రాష్ట్రంలో విద్యుత్, రైల్వే, హైవే, రక్షణ రంగాలకు చెందిన రూ.13,430 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు, జాతికి అంకితం జరిగాయి. రూ.4,922 కోట్ల విలువైన కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్స్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు. దేశాన్ని ప్రగతి దిశగా నడిపే శక్తిని ప్రధాని మోదీకి ఇవ్వాలని ఆ శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జున స్వామిని ప్రార్థిస్తున్నాను అని అన్నారు.

మన వికసిత భారత లక్ష్యం సాకారం కావాలని కోరుతున్నాను.ప్రధాని మోదీ విజయయాత్ర నిరంతరం కొనసాగాలి. అదే సమయంలో వచ్చే బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను.

Read More
Next Story