
విశాఖకు మించి మోదీ కర్నూలు టూర్ ను సక్సెస్ చేయాలి
శ్రీశైలం మల్లన్నను ప్రధాని మోదీ దర్శనం చేసుకోనున్నారు. .
ఈ నెల 16వ తేదీన ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. సచివాలయంలో బుధవారం నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రులు నారా లోకేష్, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. సీఎస్, డీజీపీలు సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. అమరావతి, విశాఖల్లో ప్రధాని పాల్గొన్న కార్యక్రమాలకు మించిన స్థాయిలో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రధాని పర్యటనను సక్సెస్ చేయాలని సీఎం చంద్రబాబు మంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తన పర్యటన సందర్భంగా ప్రధాని శ్రీశైల భ్రమరాంబ, మల్లిఖార్జున స్వామిని దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాత కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరులో నిర్వహించే బహిరంగ సభకు హజరు కానున్నారు. కేంద్రం తెచ్చిన జీఎస్టీ-2.0 సంస్కరణలను స్వాగతించి.. దేశంలోనే తొలిసారిగా అసెంబ్లీలో అభినందనల తీర్మానం చేసింది ఏపీ ప్రభుత్వం. అలాగే జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ పేరుతో దసరా నుంచి దీపావళి వరకు పెద్ద ఎత్తు ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. ఈ క్రమంలో జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని పాల్గొనే ఈ సభను విజయవంతం చేసేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేసింది. ఈ సభ నిర్వహాణను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ప్రధాని పర్యటన సందర్భంగా వాతావరణ పరిస్థితులను చూసుకుని.. దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రధాని సభకు వచ్చే సభికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని... ఆహారం, తాగునీరు సౌకర్యం కల్పించాలని... సభకు వచ్చే అప్రోచ్ రోడ్లను పూర్తి చేయాలని.. పార్కింగ్ నిమిత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.