సీమ హక్కులపై ఇప్పుడైనా మాట్లాడండి మోదీజీ!
x

'సీమ' హక్కులపై ఇప్పుడైనా మాట్లాడండి మోదీజీ!

ప్రధాని మోదీని కోరిన రాయలసీమ సాగునీటి సాధన సమితీ నేత బొజ్జా దశరథరామిరెడ్డి

రాయలసీమ హక్కులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోరు విప్పాలని రాయలసీమ సాగునీటి సమితీ డిమాండ్ చేసింది. అన్ని విధాలుగా వెనుకబడిన ప్రాంతాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేసింది. రాయలసీమ ప్రాంతానికి చట్టబద్ధంగా కల్పించిన హక్కులను తక్షణమే అమలు చేయాలని మంగళవారం నంద్యాలలో మీడియాతో మాట్లాడిన రాయలసీమ సాగునీటి సమితీ అధ్యక్షుడు బుజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు ప్రధానమంత్రికి ఓ వినతిపత్రాన్ని మెయిల్ ద్వారా పంపారు.
నరేంద్ర మోదీ అక్టోబర్ 16న ఉమ్మడి కర్నూలు జిల్లాకు విచ్చేయనున్న సందర్బంలో ఆయన రాయలసీమ సాగునీటి సాధన సమితి డిమాండ్లను ప్రధానమంత్రి దృష్టికి తేవాలని నిర్ణయించారు.
రాయలసీమ సాగునీటి సమితీ అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రధాని రాకను స్వాగతిస్తూనే రాయలసీమ హక్కుల పరిష్కరించాలని కోరారు. ఆయన ఏమన్నారంటే...
"​రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీ తక్షణమే విడుదల చేయాలి. ​రాష్ట్రం విడిపోయి 11 ఏళ్లు గడిచినా వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు కేటాయించిన ప్రత్యేక ప్యాకేజీ నిధులను కేంద్రం విడుదల చేయడంలో విఫలమైంది. ​ఈ నిధులను వెంటనే విడుదల చేయాలి. రాయలసీమలో "పర్యావరణ పరిరక్షణ కమిషన్" ఏర్పాటు చేయాలి. ఈ కమిషన్ ద్వారా చెరువుల నిర్మాణం, పునరుద్ధరణ, వాగులు, వంకలు, కాలువలతో అనుసంధానం, సామాజిక అడవుల పెంపకం, పెన్నా నది పునరుద్ధరణ వంటి కార్యక్రమాలను చేపట్టాలి"​ దశరథరామిరెడ్డి కోరారు.
"​కేంద్రీకృత అభివృద్ధి విధానాన్ని పాలకులు ఎంచుకోవడం వల్ల నిధుల కొరత ఏర్పడింది. దీంతో ​రాష్ట్ర విభజన చట్టం హక్కుగా కల్పించిన తెలుగుగంగ, గాలేరునగరి, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయడంలో విఫలమైంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని పూర్తి చేయాలి"​ అని ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
​విభజన చట్టంలో పేర్కొన్న కడప ఉక్కు, జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరారు.
బచావత్ ట్రిబ్యునల్ హక్కులు కల్పించిన HLC, LLC, కేసీ కెనాల్, SRBC ప్రాజెక్టులలో పూడిక తీయలేదని, వీటికి అనుబంధంగా రిజర్వాయర్ల నిర్మించని కారణంగా- కేటాయించిన నీరు వినియోగించుకోలేని పరిస్థితిని ఉందని వివరించారు. ​శ్రీశైలం ప్రాజెక్టు విధివిధానాలు సక్రమంగా అమలు కాకపోవడం వల్ల తెలుగుగంగ, గాలేరునగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు కూడా నీటిని వినియోగించుకోలేకపోతున్నాయని పేర్కొంటూ, ​ఈ సమస్యల పరిష్కారానికి తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ, గుండ్రేవుల రిజర్వాయర్, సిద్దేశ్వరం అలుగు నిర్మాణం, వేదవతి ఎత్తిపోతల పథకం నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని ప్రధానికి బొజ్జా విన్నవించారు.
​​హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల మధ్య ఉన్న రాయలసీమ జిల్లాలకు, వాణిజ్యానికి కీలకంగా ఉండే రైల్, రోడ్ కనెక్టివిటీని పెంచడంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చెన్నై - బెంగళూరు, చెన్నై - హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి నిర్దిష్ట కార్యాచరణ చేపట్టాలని ప్రధానికి పంపిన మెయిల్ లో బొజ్జా విజ్ఞప్తి చేశారు.
"ఈ ఏడాది సుమారు 348 టీఎంసీల తుంగభద్ర జలాలు రాయలసీమ గడ్డ దాటినా, స్థానిక సాగునీటి ప్రాజెక్టులకు నీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోయి, జీవనం భారమై రైతులు, రైతు కూలీలు వలసల బాట పడుతున్నారు" అని బొజ్జా ఆవేదన వ్యక్తం చేశారు.
​రాయలసీమ యువత భవిష్యత్తు, గ్రామీణ ప్రజల జీవనోపాధి దృష్ట్యా తాను ప్రస్తావించిన అంశాలపై తక్షణ చర్యలు చేపట్టి, రాయలసీమ సమగ్ర అభివృద్ధికి పునాదులు వేయవలసిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి దశరథరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
​ఈ సమావేశంలో రాయలసీమ సాగునీటి సాధన సమితీ ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి, న్యాయవాది అసదుల్లా, కెడిసిసి డైరక్టర్ బెక్కం రామసుబ్బారెడ్డి, చెరుకూరి వెంకటేశ్వర నాయుడు, కరిమద్దెల ఈశ్వరరెడ్డి, పట్నం రాముడు, కొమ్మా శ్రీహరి, కృష్ణమోహన్ రెడ్డి, జానోజాగో మహబూబ్ భాష, మనోజ్ కుమార్ రెడ్డి, రాఘవేంద్రగౌడ్, న్యాయవాది అసదుల్లా పాల్గొన్నారు.
Read More
Next Story