
జగన్ కోసం మోదీ సీబీఐ గొంతు నొక్కారు
వైఎస్ సునీత పోరాటంలో న్యాయం ఉందని వైఎస్ షర్మిల అన్నారు.
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సీబీఐ గొంతు నొక్కారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీకి దత్తపుత్రుడని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డినిక కాపాడుకోవడం కోసం ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని కూడా కాపాడుకుంటున్నారని ప్రధాని మోదీపై ఆరోపణలు గుప్పించారు. వాస్తవంగా సీబీఐ కానీ అనుకుని ఉండిఉంటే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దోషులకు ఎప్పుడో శిక్ష పడేదన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని, గూగుల్ మ్యాప్ లొకేషన్లు కూడా ఉన్నాయని, వివేకానందరెడ్డి హత్య ఘటన జరిగినప్పుడు అదే సంఘటన స్థలంలో వైఎస్ అవినాష్‌రెడ్డి ఉన్నాడని, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని వైఎస్ షర్మిల వెల్లడించారు. వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి అన్ని బలమైన ఆధారాలు ఉన్నప్పటికీ ఈ కేసులో న్యాయం ఎందుకు జరగడం లేదని షర్మిల ప్రశ్నించారు. ప్రధాన మంత్రి మోదీ చేతిలో కీలుబొమ్మగా మారిన సీబీఐ విచారణ సరిగా లేదని వైఎస్ సునీత చేస్తున్న ఆరోపణల్లో నిజముందని షర్మిల ఆరోపించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో మళ్లీ దర్యాప్తు ఎందుకు చేపట్టకూడదని ఆమె ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో నాటి నుంచి నేటి వరకు సునీత పోరాటం చేస్తూనే ఉందన్నారు. అయినా న్యాయం జరగడం లేదన్నారు.