మోదీ రోడ్‌ షో హిట్టా..ఫట్టా
x

మోదీ రోడ్‌ షో హిట్టా..ఫట్టా

విజయవాడలో నిర్వహించిన ప్రధాని మోదీ రోడ్‌షోపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.


రాజధాని అమరావతిలో భాగమైన విజయవాడలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌లు బుధవారం రాత్రి నిర్వహించిన రోడ్‌ షో హిట్టా.. ఫట్టా.. అనే ఆసక్తికర ఏపీ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. రోడ్‌షోకు లక్షల్లో జనం వచ్చారని ఎన్డీఏ కూటమి చెప్పుకొంటున్నారు. అధికారపక్షం మాత్రం మోదీ రోడ్‌ షోను చూసి ఆనందం వ్యక్తం చేస్తోంది. అధికార పక్షం అంచనా ప్రకారం పది హేను వేలకు మించి జనం రాలేదనే అభిప్రాయంలో ఉంది. ఇంటెలిజెన్సీ వర్గాలు కూడా ఇదే రకమైన సమాచారాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు కూడా ఇచ్చినట్టు సమాచారం.

మోదీ మానియా కలిసొస్తుందా?
కూటమి పొత్తు ఖరారైన నాటి నుంచి ప్రధాని మోదీ మానియా కలిసి వస్తుందని టీడీపీ, జనసేన పార్టీలు గంపెడు ఆశలు పెట్టుకున్నాయి. పొత్తు కుదిరిన వెంటనే చిలకలూరిపేటలో మోదీతో నిర్వహించిన తొలి సభ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మైక్‌ పనిచేయకపోవడం, జనసమీకరణ పెద్దగా లేకపోవడంతో మోదీ సభ నిరుత్సాహా పరిచిందనే చర్చ కూడా ఆ పార్టీ వర్గాల్లో ఉంది. ప్రధానంగా మోదీ తొలిసభలో సీఎం వైఎస్‌ జగన్‌ను పల్లెత్తి మాట అనకపోవడం, మొక్కుబడిగా ప్రసంగం చేయడం టీడీపీ, జనసేన శ్రేణులకు అసలు మింగుడు పడలేదు. అయితే పురందేశ్వరి పోటీ చేస్తున్న రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గంలో మోదీ సభ కాస్త ఊరటనిచ్చింది. ఈసారి ట్రిప్‌లో మోదీ నేరుగా సీఎం వైఎస్‌ జగన్‌ను నేరుగా టార్గెట్‌ చేయకపోయినా.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వమని, అభివృద్ధిలేదని ఎండగట్టారు. ఆపై రాజంపేట లోక్‌సభ నియోజవకర్గం పరిధిలోని పీలేరులో నిర్వహించిన సభల్లో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుతాన్ని టార్గెట్‌ చేసిన మోదీ మరో మారు ఘాటు విమర్శలు చేశారు. రాయలసీమలో అభివృద్ధిలేదని, ఇసుక మాఫియా పెరిగిపోయిందని, మంత్రులు అవినీతిలో కూరుకపోయారు, ఈ ప్రభుత్వాన్ని ఓడించండి అంటూ మోదీ పిలుపునివ్వడం టీడీపీ, జనసేన పార్టీల్లో జోష్‌ నింపింది. ఇంత చేసినా పీలేరు సభకు జన సమీకరణ, నిర్వహణ చాలా పేలవంగా ఉందని మోదీ పెదవివిరిచినట్టు సమాచారం.
పశ్చిమ నుంచి తూర్పుకు మళ్లీంపు..
విజయవాడ పశ్చిమ నియోజకర్గంలో బీజేపీ అసెంబ్లీ అభ్యర్థిగా సుజనాచౌదరి గెలుపు కోసం తొలుత మోదీ ప్రచారం అక్కడ నిర్వహించాలని బీజేపీ భావించింది. ఆ దిశగానే ప్రధాని మోదీ టూర్‌ను ఖరారు చేయడానికి నిర్ణయించింది. అయితే ఎన్డీఏ భాగస్వాములైన టీడీపీ, జనసేన అభిప్రాయాలు తీసుకుంటే బాగుంటుందని బీజేపీ నేతలు చంద్రబాబు, పవన్‌తో చర్చించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కువగా ముస్లింలు, క్రిస్టియన్‌లు, జైన్‌లతోపాటు ఇతర మైనార్టీలు ఉన్నారు. అక్కడ మోదీ రోడ్‌ షో నిర్వహిస్తే వారంతా ఎన్డీఏ కూటమికి దూరమయ్యే ప్రమాదం ఉంది. ఎలాగు విజయవాడ నగరంలో ప్రధాని మోదీ సభ, రోడ్‌ షో ఏర్పాటు చేసి ఎన్నికలకు ఒక హైపు తీసుకురావడమే ప్రధాన ధ్యేయంగా కూటమి పెద్దలు అడుగులు వేశారు. నగరంలోని ప్రధానమైంది బందరు రోడ్డు. ఆ రోడ్డుపై ఎన్నికల షో నిర్వహిస్తే మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు అనువుగా ఉంటుందని జనం ఎన్డీఏను రిసీవ్‌ చేసుకునే అవకాశం ఉంటుందని భావించిన కూటమి పెద్దలు బందరు రోడ్డులో రోడ్‌ షోను నిర్వహించడానికి తెరతీసారు. దీంతో ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి బెంజి సర్కీల్‌ వరకు రోడ్‌షో జరిగింది. 1.8 కిలోమీటర్ల దూరం ఒక గంటపాటు కొనసాగింది.
రోడ్‌ షోపై ఆసక్తికర చర్చ
ప్రధాని మోదీ ఉత్తరాది రాష్ట్రాల్లో నిర్వహించిన రోడ్‌ షోలు, ఏపీలోని అమరావతి రాజధాని సమీపంలో నిర్వహించిన రోడ్‌ షో తీరు తెన్నులపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ జన సందోహం నడుమ, భారీ కటౌట్లు, డ్యాన్సులు, తప్పెట్లు, మేళతాళాలతో రోడ్‌ షోలు సాగితే, ఆ స్థాయిలో విజయవాడ రోడ్‌ షో లేదని పెదవి విరుస్తున్నారు. రోడ్‌షో కోసం రెండు రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. లక్షల్లో జనం వస్తారని భావించారు. తీరా ఆ స్థాయిలో జనం రాకపోవడంతో మోదీ రోడ్‌షోను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాని, ఇది హిట్‌ కాదు ఫట్‌ అని కూటమి నేతల్లో కూడా చర్చ సాగుతోంది.
Read More
Next Story