
యోగాంధ్ర బుక్ ఆవిష్కరించిన మోదీ
దాదాపు 45 నిముషాల పాటు మంత్రి లోకేష్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.
మంత్రి నారా లోకేష ఆధ్వర్యంలో రూపొందించిన యోగాంధ్ర టేబుల్ బుక్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. జూలైలో విశాఖపట్నం వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సం కార్యక్రమం జరిగింది. దీనికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో యోగాంధ్ర టేబుల్ బుక్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. దాదాపు 45 నిముషాల పాటు ప్రధాని మోదీ, మంత్రి లోకేష్ భేటీ కొనసాగింది.
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై ఈ సందర్భంగా లోకేష్ ప్రధానితో చర్చించినట్లు సమాచారం. కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అందాల్సిన సాయం, పెండింగ్ ప్రాజెక్టులు, ఏపీలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుతో పాటు తాజా ఏపీ రాజకీయ పరిస్థితుల మీద కూడా ప్రధాని మోదీతో మంత్రి లోకేష్ చర్చించినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఇటీవల చేపట్టిన సింగపూర్ పర్యటన వివరాలను కూడా మోదీకి వివరించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ స్లాబుల హేతుబద్దీకరణ, సంస్కరణలపై లోకేష్ ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు.
ప్రత్యేకించి విద్యారంగంలో ఉపయోగించే పలు రకాలైన వస్తువుల పై జీఎస్టీ పన్నులు తగ్గించినందుకు లోకేష్ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోదీకి లోకేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినట్లు సమాచారం. ఇదిలా ఉంటే తన భార్య నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ్‌లతో మే 17న లోకేష్ ప్రధాని మోదీని కలిశారు. లోకేష్ యువగళం పాదయాత్ర బుక్‌ను నాడు మోదీ ఆవిష్కరించారు. అప్పుడు దాదాపు రెండు గంటల పాటు లోకేష్ కుటుంబంతో ప్రధాని గడిపారు. అందరూ కలిసి డిన్నర్ కూడా చేశారు. మళ్లీ తాజాగా లోకేష్ ప్రధాని మోదీని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Next Story