ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. 75వ ఏటలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రముఖలు చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. సీఎం చంద్రబాబుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 2014–19 వరకు చెట్టాపట్టాలేసుకొని తిరిగిన సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీలు 2019 ఎన్నికల సమయానికి ప్రత్యర్థులుగా మారారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఘాటైన విమర్శలు చేసుకున్నారు. చంద్రబాబును వెన్ను పోటు దారుడు అని మోదీ అంటే, మోదీ దేశ ద్రోహి అని చంద్రబాబు అని పరస్పరం భారత దేశం నివ్వెరపోయే విధంగా విమర్శలు గుప్పించుకున్నారు.
2024 ఎన్నికల్లో తిరిగి ఒకటయ్యారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిలబడటానికి చంద్రబాబు కీలకమయ్యారు. చంద్రబాబు మద్దతుతోనే మోదీ ప్రభుత్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబును నా స్నేహితుడు అంటూ సంభోదించారు ప్రధాని నరేంద్ర మోదీ. ‘నా స్నేహితుడు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. భవిథ్యత్ రంగాలపై దృష్టి సారించి ఆయన పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవిశ్రాంతంగా పనిచేస్తున్న చంద్రబాబు పనితీరు అద్భుతం..ప్రశంసనీయం.. చంద్రబాబుకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా’ అంటూ చంద్రబాబుకు మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ మేరకు ప్రధాని మోదీ తన సోషల్ మీడియా వేదికగా ఆదివారం ఓ పోస్టు పెట్టారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు దీర్ఘాయుష్షుతో జీవితంచాలని కోరుకుంటున్నట్లు జగన్‌మోహన్‌రెడ్డి తన ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘హ్యాపీ బర్త్‌డే చంద్రబాబు నాయుడు గారు.. మీరు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నట్లు’ జగన్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని, మరెన్నో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని, ప్రజాసేవలో సుదీర్ఘకాలం కొనసాగాలని ఆక్షాంక్షిస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అయితే చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. అనితర సాధ్యుడు చంద్రబాబు నాయుడు అంటూ తనదైన స్టైల్‌లో చంద్రబాబుకు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థికంగా కుంగిపోయి, అభివృద్ధి అగమ్యగోచరంగా తయారై, శాంతి భద్రతలు క్షీణించి పోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతిని పునరుజ్జీవింప చేయడం నారా చంద్రబాబు నాయుడు లాంటి దార్శనికుని మాత్రమే సాధ్యమని.. అటువంటి పాలనాదక్షునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ తన ఎక్స్ వేదిక ద్వారా తెలిపారు.
ఇక నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి వెరైటీగా చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలండీ’ అంటూ ఎక్స్ వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలిపిన భువనేశ్వరి వారిద్దరు కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ఇంకా ఆమె ఏమన్నారంటే.. ‘ మన ఆంధ్రప్రదేశ్ కుటుంబం పట్ల మీకున్న అంతులేని మక్కువతో ఈమరు నా ప్రపంచాన్ని ప్రకాశింపచేస్తున్నారు. మీ బలం, మీ దార్శనికత నన్ను ప్రతి రోజూ మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతున్నాయి. మీకు తోడుగా ఉండటం చాలా గర్వంగా ఉంది. నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను. నా ప్రేమతో మిమ్మల్ని ప్రోత్సహిస్తుంటాను’ అంటూ చంద్రబాబు మీద తనకున్న ప్రేమను, గౌరవాన్ని తన పోస్టులో వెల్లడించారు.